– ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ దోచుకుంది
– నేడు అదే దారిలో కాంగ్రెస్…
– రిజర్వేషన్లకు మోడీ చౌకీదారు
– ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తొలగించి ముస్లింలకు కాంగ్రెస్ మేలు చేసే యత్నం
– కులమతాలను రెచ్పగొడుతున్న ఆ పార్టీలను ఓడించండి : నారాయణపేట బీజేపీ జనసభలో ప్రధాని మోడీ
నవతెలంగాణ -మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
”తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్రం నుంచి కోట్లాది రూపాయలు పంపాం.. అవి ప్రజలకు చేరకుండా అక్రమార్కుల జేబులు నిండాయి. దేశంలో ఎస్సీ, ఎసీ,్ట బీసీ రిజర్వేషన్లను కాపాడటంలో చౌకీదారుగా పని చేస్తా. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయి. విలువలు లేకుండా ఇరువురూ ఒక్కటై బీజేపీ అభ్యర్థులను ఓడించే పనిలో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను తొలగించి మైనార్టీలకు మేలు కలిగించే ఆ పార్టీలను చిత్తుగా ఓడించాలి.” అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నారాయణపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం బీజేపీ జనసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కులాలు, మతాల పేరిట కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విడగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని ఆరోపించారు. వినాశకరమైన మతమార్పిడులు, మత రిజర్వేషన్లతో కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ తీసుకొచ్చిన సామాజిక హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేశ మూలవాసులైన హిందువులను వదిలి ముస్లిం మైనార్టీలపై ప్రేమ ఒలకబోస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
అమలుకు వీలుకాని అనేక వాగ్దానాలు ఇచ్చి తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ వంచనకు గురిచేసిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి బీజేపీ ఎంపీలను గెలిపించాలన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణ, తుంగభద్ర వంటి జీవనదులున్నా నేటికీ భూములకు సాగునీరు అందడం లేదన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ రుణమాఫీ ఎందుకు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జాతీయ మాజీ అధ్యక్షులు ఎన్నికలకు ముందు ప్రేమ దుకాణాలు ప్రారంభించి.. ఆ తర్వాత మూసేస్తారని వ్యాఖ్యానించారు. పదేండ్లపాటు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ నేతలు భారీ ప్రాజెక్టుల పేరుతో జేబులు నింపుకున్నారని, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం అదే పని చేస్తుందని వ్యాఖ్యానించారు.దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల ముందు తల ఎత్తుకునేలా పరిపాలన చేస్తున్నామని చెప్పారు. పేదలకు ఇల్లు, యువతకు ఉపాధి, భవిష్యత్‌కు గ్యారంటీ ఇదే మోడీ ఇస్తున్న హామీ అన్నారు. సభలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి డికె.అరుణ, నాగర్‌కర్నూల్ అభ్యర్థి భరత్ ప్రసాద్, నాయకులు నాగురావు, నామాజీ, బ్రహ్మచారి, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, డోకూర్ పవన్ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.