అత్యంత టాప్‌ బ్రాండ్‌గా రష్యన్‌ బ్యాంకు

మాస్కో : ‘‘వార్షిక బ్రాండ్‌ ఫైనాన్ష్‌ యూరోప్‌ 500” రేటింగ్‌ను అనుసరించి ఐరోపా ఫైనాన్షియల్‌ సంస్థలన్నింటిలోకెల్లా అత్యంత బలమైన బ్రాండ్లలో ఒకటిగా రష్యా ప్రభుత్వ బ్యాంక్‌ సబర్‌(గతంలో సబర్‌ బ్యాంకు) నిలిచింది. లండన్‌ స్థావరంగావున్న బ్రాండ్‌ ఫైనాన్ష్‌ కన్సల్టెన్సీ 5000 పెద్ద సంస్థలను పరీక్షించి 100 నివేదికలను ప్రచురించింది. అలాగే వివిధ దేశాలకు చెందిన వివిధ సంస్థలకు ర్యాంకులను కేటాయించింది. ప్రపంచంలోని 500 అత్యంత బలమైన యూరోపియన్‌ బ్రాండ్లకు 2023వ సంవత్సరంలో వార్షిక యూరోప్‌ 500లో చోటు లభించింది. ఒక బ్రాండ్‌ తన వ్యాపారాన్నిఎలా నిర్వహిస్తుంది, తన కస్టమర్ల విశ్వాసాన్ని ఎలా నిలుపుకోగలుగుతుంది, తన ప్రతిష్టకు ఎలా భంగం కలుగకుండా చూసుకోగలుగుతుంది, తన బ్రాండ్‌ విలువను ఎలా పెంపొందించుకోగలుగుతుంది, ఎంత తెలివిగా తన పెట్టుబడిని పెట్టగలుగుతుంది, ఎలా తన మార్కెట్‌ను అభివృద్ధి చేసుకోగలుగుతుందనే విషయాల ఆధారంగా సదరు బ్రాండ్‌ బలం ఉంటుంది. హెచ్‌ఎస్‌బీసీ, సటాండర్‌, బార్క్లేస్‌లను అధిగమించి సబర్‌ యూరోప్‌ లో నాలుగవ అత్యంత విలువైన బ్యాంకుగా నిలిచింది. అంతేకాకుండా 40 టాప్‌ బ్రాండ్లలో 37వదిగా సబర్‌ ఉంది. దీనికి తోడు ఐరోపా బ్రాండ్లలో మిచెలిన్‌, లాంబోర్జిని, రోలెక్స్‌ ను వెనక్కునెట్టి 7వ బలమైన యూరోప్‌ బ్రాండ్‌ గా సబర్‌ నిలిచింది. విదేశీ మార్కెట్ల పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్నప్పటికీ రష్యన్‌ బ్యాంకు గొప్ప ఫలితాలను ఇవ్వగలిగింది. అలానే అనేక ఇన్నొవేటివ్‌ ఉత్పాదనలను, ప్రపంచ స్థాయి సేవలను అందించగింది. అంతేకాకుండా 11కోట్ల ప్రయివేటు, కార్పొరేట్‌ క్లైంట్ల విశ్వాసాన్ని పొందగలుగుతోంది.