– ఎస్‌కేఎమ్ పోరాటానికి పెరుగుతున్న విశాల మద్దతు
– మీడియా తక్కువచేసి చూపినా అంతర్జాతీయంగా సంఘీభావం
– కనీస మద్దతు ధరల చట్టం చేయాల్సిందే
– రైతుల ప్రధాన డిమాండ్లను నెరవేరాల్సిందే.. లేకుంటే మోడీ గద్దె దిగాల్సిందే
– న్యాయం దక్కేదాకా దశలవారీగా కార్యాచరణ అమలు : అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
‘దేశ రక్షణ కోసం, వ్యవసాయ రంగాన్ని బతికించుకోవటం కోసమే ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఉద్యమాన్ని ఉధృతంగా చేస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎమ్) ఆధ్వర్యంలో రైతులు చేస్తున్న పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టే రోజురోజుకీ ప్రజా మద్దతు పెరుగుతున్నది. మీడియా పెద్దగా హైలెట్ చేసి చూపకపోయినా అంతర్జాతీయంగా సంఘీభావం దక్కుతున్నది. ఇప్పటికైనా మోడీ సర్కారు దిగొచ్చి కనీస మద్దతు ధరల చట్టం చేయాల్సిందే. ఇతర డిమాండ్లనూ పరిష్కరించాల్సిందే. లేదంటే మోడీ సర్కార్ గద్దె దిగాల్సిందే. రైతులకు న్యాయం చేయకపోతే ప్రజాకోర్టులోకి వెళ్లి రైతుల సత్తా ఏంటో మోడీ సర్కార్‌కు చూపుతాం’ అని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో నవతెలంగాణ ప్రతినిధి అచ్చిన ప్రశాంత్‌కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఢిల్లీ రైతాంగ పోరాటంపై పలు విషయాలను వివరించారు.
ఢిల్లీలో రైతాంగ ఉద్యమం మళ్లీ ఎందుకు మొదలైంది?
రైతుల ఉద్యమం తిరిగి ప్రారంభం కావడానికి మోడీ ప్రభుత్వ వైఖరే కారణం. 23 ఏండ్ల శుభ్‌కరణ్‌సింగ్ అనే రైతు చనిపోవడానికి ప్రధాన బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదే. మూడేండ్ల కిందట రైతు ఉద్యమాన్ని చల్లబర్చటానికి గురునానక్ జయంతి రోజు దేశ ప్రజానీకానికి మోడీ క్షమాపణ చెప్పారు. మూడు నల్లచట్టాలను, విద్యుత్ సవరణబిల్లును ఉపసంహరించుకుంటామనీ, కనీస మద్దతు ధరల చట్టం తీసుకొస్తామనీ బహిరంగంగా ప్రకటించి మాటతప్పారు. అందుకే రైతుల ఉద్యమం మళ్లీ మొదలైంది. గ్రీక్ ప్రధాని మాట్లాడుతూ..తమ దేశంలో, ఇండియాలో జరుగుతున్న రైతాంగ పోరాటాలకు సారూపత్య ఉందని ఒప్పుకున్నారు. మోడీకి మాత్రం రైతుల పోరాటాన్ని అంగీకరించేందుకు మనస్సు రావడం లేదు.
రోజురోజుకీ అన్నదాతల ఉద్యమానికి పెరుగుతున్న ఆదరణను ఎలా అర్థం చేసుకోవాలి?
దీన్ని కేవలం రైతుల కోసం జరుగుతున్న పోరాటంగా చూడొద్దు. ఇది రైతాంగం మనుగడ, వ్యవసాయం రక్షణ కోసం జరుగుతున్న పోరాటం. తాము బతకాలి, వ్యవసాయాన్ని బతికించుకోవాలనే లక్ష్యంతో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు కలిసికట్టుగా రోడ్లమీదకొస్తున్నారు. అందుకే ప్రజల నుంచి విశాల మద్దతు లభిస్తున్నది. జాతీయ మీడియా ఎంత తొక్కిపెట్టి చూపాలని ప్రయత్నిస్తున్నా అంతర్జాతీయంగానూ చర్చనీయాంశమవుతున్నది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఇంత విశాల మద్దతు ఏ పోరాటానికీ దక్కలేదు. ఎందుకంటే ఈ పోరాటంలో విశ్వసనీయత ఉంది. దేశాన్ని కాపాడుకోవాలనే దృఢసంకల్పం దాగి ఉన్నది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా రైతు మృతిపై బాధను వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం స్పందించాలని గళమెత్తారు. రైతులతో చర్చించి డిమాండ్లను పరిష్కరించాలని మోడీ సర్కార్‌కు సూచించారు. మన జీడీపీలో 18.8 శాతం వాటా వ్యవసాయ రంగానిదే. 80 కోట్లమంది వ్యవసాయ మీద ఆధారపడుతున్నారు. దీనినిబట్టే రైతు ఉద్యమానికి గ్రావిటీ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎస్‌కేఎంలో విభేదాలున్నాయి, ఉద్యమం హర్యానా, పంజాబ్, యూపీలకే పరిమితమైందనే ప్రచారంపై మీరేమంటారు?
ఇది పూర్తిగా అసత్య ప్రచారం. ఎస్‌కేఎమ్‌లో వందలాది రాజకీయ, రాజకీయేతర సంఘాలు భాగస్వామ్యం అయ్యాయి. ఉద్యమ నిర్మాణం, ఇతరత్రా అంశాల్లో సంఘాల మధ్య భిన్నాభిప్రాయాలుండటం సాధారణమే. వాటిపై కూర్చొని చర్చించుకుంటున్నాం. అంతిమంగా కలిసికట్టుగానే ముందుకెళ్తున్నాం. ఉద్యమ బలోపేతం కోసం ఆరుగురు ముఖ్యనేతలతో ఓ కమిటీ వేశాం. ఉద్యమంలోకి బీజేపీ చొరబడి చర్చల పేరుతో విచ్ఛిన్నం చేయాలని కుట్రలు పన్నుతున్నది. చైతన్యంతో కూడుకున్న రైతాంగ ఉద్యమం బీజేపీ ఎత్తులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నది. ఈ ఉద్యమంలో ప్రారంభం నుంచీ హర్యానా, పంజాబ్ రాష్ట్రాలతో పాటు యూపీలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన రైతులు ముందువరుసలో ఉండటానికి చారిత్రక కారణాలున్నాయి. హరితవిప్లవం అమలు చేసింది అక్కడే. గోధుమ పంట ఎక్కువ పండేదీ అక్కడే. ఢిల్లీ సరిహద్దుల్లో ఆయా రాష్ట్రాలు ఉండటం కూడా సానుకూల అంశం. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటకలో కూడా ఉద్యమం జరుగుతున్నది.
ఎస్‌కేఎమ్ తక్షణ డిమాండ్లు ఏంటి?
రైతులకు కనీస మద్దతు ధరను గ్యారంటీ చేస్తూ చట్టం తేవాలి. విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలి. వ్యవసాయ కూలీలకు, పేదలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని, పేదలకు ఆహారాన్ని అందించే ప్రజాపంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయాలి. పోలీసులను ఉసిగొల్పి యువరైతు శుభ్‌కరణ్‌సింగ్ చావుకు కారణమైన హర్యానా సీఎం ఖట్టర్ మీద కేసు నమోదు చేయాలి. ఆ రాష్ట్ర హోంమంత్రిని వెంటనే తొలగించాలి. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. చనిపోయిన రైతుకు 16 లక్షల అప్పు ఉంది. దాన్ని తీర్చాలి. కోటి రూపాయల పరిహారం కుటుంబానికి ఇవ్వాలి. ఇది హర్యానా ప్రభుత్వ హత్య అని కేసు ఫైల్ చేయాలి. రాజకీయం, ఓట్ల కోసం భారత రత్నలు ఇవ్వటం కాదు..ముందు స్వామినాథన్ సూచించిన సీటూప్లస్ మద్దతు ధరను రైతులకు అందజేసి కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
రైతులకు మేలు జరిగే కనీస మద్దతు ధర చట్టానికి మోడీ సర్కారు ఎందుకు అంగీకరించట్లేదు?
బీజేపీ రైతువారీ వ్యవసాయానికి వ్యతిరేకం. మన ఉత్పత్తి విధానం రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మికుల కేంద్రంగా ఉంది. దేశ అవసరాలు, పోషణ, ఉపాధి కోసం మన దేశంలో సాంప్రదాయక వ్యవసాయం అమలవుతున్నది. దేశంలో పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చెందుతూ వస్తున్నది. నిజంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే అది రైతులకు, వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు మేలు చేసేదిలా ఉండాలి. తద్వారా దేశానికి మేలు జరుగతుంది. కానీ, మోడీ సర్కారు దీని గురించి ఆలోచించడం లేదు. పూర్తిగా కంపెనీ వ్యవసాయంగా మార్చే కుట్రకు దిగింది. ప్రపంచంలో భౌగోళిక పరిస్థితుల రీత్యా అన్ని పంటలు పండేందుకు మన భూములు అనుకూలం. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడ పండించి ఎగుమతులు చేసి లాభాలు గడించాలనే ఆలోచనలో భాగంగానే కార్పొరేట్ల కన్ను మన వ్యవసాయ రంగంపై పడింది. కానీ, ఇది మన రైతులు సాగులో ఉన్నంత కాలం వారికి సాధ్యం కాదు. అంబానీ, అదానీలకు వ్యవసాయాన్ని అప్పగించాలంటే కుదరదు. అందుకే మూడు వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతులను అప్పులపాలు చేసి వారిని వ్యవసాయం నుంచి పక్కకు స్వయంగా తప్పుకునేలా చేసే కుట్ర జరుగుతున్నది.
అందుకే మోడీ సర్కారు రైతుల న్యాయసమ్మతమైన డిమాండ్లను తొక్కిపెడుతున్నది. కనీస మద్దతు ధరల చట్టం లేకపోవడం వల్ల ఇటు రైతులకు, అటు వినియోగదారులకు అన్యాయం జరుగుతున్నది. అంతిమంగా ట్రేడర్లు లాభపడుతున్నారు. వారంతా బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. మద్దతు ధర ఇస్తే ట్రేడర్లకు లాభాలు తగ్గుతాయి. ఎఫ్‌సీఐ, ప్రజాపంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయాలి. అది చేస్తే వినియోగదారులు బయట కొనటం తగ్గుతుంది. అందుకే వ్యవసాయ రంగానికి దోహదపడే వ్యవస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా మోడీ సర్కారు నిర్వీర్యం చేస్తూ పోతున్నది.
మోడీ సర్కారు రైతు ఉద్యమం పట్టనట్టుగానే ఉంటున్న తరుణంలో మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి?
శుక్రవారం దేశంలో బ్లాక్ డే నిర్వహించాం. 26న దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ట్రాక్టర్ల ర్యాలీలతో నిరసనలు తెలుపుతాం. మహాపంచాయతీలను నిర్వహిస్తున్నాం. మార్చి 14న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జాతీయస్థాయి మహాపంచాయితీని తలపెట్టాం. ప్రధాన డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకే ఈ పోరాటం చేస్తున్నాం. అప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పందించకుంటే ప్రజాకోర్టులోకెళ్తాం. డిమాండ్లను నెరవేర్చని పక్షంలో 2024లో మోడీ ప్రభుత్వాన్ని గద్దెదింపుతాం. వచ్చే ప్రభుత్వం ద్వారా రైతుల డిమాండ్లను సాధించుకుంటాం.