కొన్ని సినిమాలను ఎన్నిసార్లు చూసినా తనివితీరదు. ముఖ్యంగా మానవ జీవన పరిణామంలోని మార్పులను చిత్రించిన చిత్రాలలో కఠిన వాస్తవాలకే పెద్ద పీట వేస్తారు దర్శకులు. అలాంటివి సాంకేతికంగా అతి ఉత్తమ చిత్రాలుగా నిలుస్తాయి. కానీ ఆ కఠిన వాస్తవికతకు కవితాత్మకతను, అందాన్ని, సున్నితత్వాన్ని, సెంటిమెంట్‌ను జోడించి ప్రేక్షకులకు ఓ తరానికి సంబంధించిన చారిత్రక రికార్డును అందించిన అద్భుత చిత్రం ‘హౌవ్ గ్రీన్ వాస్ మై వాలి’. అందుకే అదే సంవత్సరం వచ్చిన ‘సిటిజెన్ కేన్’ ఓ ప్రభంజనాన్ని సష్టించినా, దాన్ని దాటుకుని ఈ సినిమా ఉత్తమ చిత్రంగా ఆస్కార్ గెలుచుకుంది. ఇందులో సినిమా మేకింగ్‌కి సంబంధించి ఓ పరిపూర్ణత కనిపిస్తుంది. మానవ జీవితంలోని గొప్పతనం, ఆదర్శవాదం తెరపై చూపుతూ మానవ సమూహ జీవితంలోని సంపూర్ణతకు అర్ధాన్ని జోడించగల గొప్ప చిత్రీకరణ కారణంగా ఈ సినిమా సినీ ప్రేమికుల దష్టిలో మర్చిపోలేని ఆణిముత్యంగా నిలిచిపోయింది.
‘హౌవ్ గ్రీన్ వాస్ మై వాలీ’ 1939లో వచ్చిన నవల ఆధారంగా జాన్ ఫోర్డ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. రిచర్డ్ లెవ్లిన్ ఈ నవలా రచయిత. కథ వెల్ష్ ప్రాంతానికి సంబంధించినది. యూనైటెడ్ కింగ్‌డం (యూకే) అంటే ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ అనే నాలుగు దేశాల సమాహారం. ఈ నాలుగు ప్రాంతాల మధ్య సాంస్కతిక పరంగా, భాషా పరంగా చాలా భేదాలుంటాయి. వెల్ష్, అంటే వేల్స్‌కు సంబంధించిన ప్రజల గురించి హాలీవుడ్‌లో తక్కువగా సినిమాలు వచ్చాయి. అందుకే ఈ సినిమా వెల్ష్ ప్రజల సంస్కతిని ప్రపంచానికి పరిచయం చేసిన మొదటి సినిమాగా గుర్తింపు పొందింది.
ఈ సినిమాతో దర్శకులు జాన్ ఫోర్డ్‌కు మూడవసారి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ లభించింది. ప్రపంచ గొప్ప దర్శకులలో అగ్రగణ్యులుగా ఆయనను సినీ పండితులు ప్రస్తావించుకుంటారు. ‘హౌ గ్రీన్ వాస్ మై వాలి’ పది కేటగిరీలలో ఆస్కార్‌కు నామినేట్ అయి, ఐదు అవార్డులు గెలుచుకుంది. ఇక ఈ సినిమాలో నటించిన వారంతా అలనాటి ఉత్తమ నటులే. కాని సినిమా మొత్తంలో ఒక్కరు తప్ప ఎవరూ వెల్ష్ ప్రాంతానికి చెందిన వారు కాదు. కాని వీరంతా ఈ సినిమా కోసం ఆ యాసను నేర్చుకుని నటించారు. సినిమాను కాలిఫోర్నియాలోనే చిత్రీకరించినా వెల్ష్ ప్రాంతపు వాతావరణాన్ని సష్టించడంలో పూర్తిగా సఫలం అయ్యారు దర్శకులు. ఈ సినిమా ఆర్ట్ డైరక్షన్ కూడా ఆస్కార్ గెలుచుకుందంటే ఎంత అందంగా చిత్రీకరణ జరిగిందో అర్ధమవుతుంది.
సినిమా కథ ఓ లోయ ప్రాంతంలోని చిన్న ఊరి నేపథ్యంలో నడుస్తుంది. అక్కడ బొగ్గు గనులు ఎక్కువ. ఆ ఊరిలోని వారంతా కూడా ఆ గనులలో పనిచేసే కార్మికులే. వారికి తమ పని పట్ల ఎంతో గౌరవం, ఆ పని చేస్తూ జీవిస్తున్నందుకు గర్వ పడతారు. అలాంటి ఊరిలో మార్గన్ కుటుంబం ఒకటి. ఇంటి పెద్ద గ్విలిం, అతని ఐదుగురు కొడుకులూ గని కార్మికులే. ఇంట్లో గ్విలిం భార్య బెథ్ అతని కూతురు అన్గరాద్, అందరి కన్నా చిన్నవాడు హు ఉంటారు. పొద్దున్నే పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చే ఆ కార్మికులకు స్త్రీలు ఇంటి బైట స్వాగతం పలుకుతారు. వారికిచ్చిన రోజు కూలీని గుమ్మం ముందు నుంచున్న స్త్రీల బుట్టల్లో గర్వంగా వేసి ఇంట్లోకి వచ్చే ఆ మగవారి ఆత్మవిశ్వాసం ముచ్చటగా ఉంటుంది. ఇంటికి వచ్చి మగవారంతా స్నానాలకు వెళితే, వారికి నీరు అందించే పని తల్లీకూతుర్లది. ఎంతో సరదాగా, ఉత్సాహంగా సమయాన్ని గడుపుతారంతా. స్నానం అయ్యాక అందరూ కలిసి భోంచేయడం ఓ నిత్య పండగ. భోజనం తర్వాత అందరికీ చిల్లరఖర్చుకు ఇంటి యజమాని చేతుల మీదుగా కొంత డబ్బు అందుతుంది. దాన్ని నచ్చినట్లుగా బైటికి వెళ్ళి ఖర్చుపెట్టుకుంటారు అందరూ. చిన్నవాడైన హూకు కూడా చాక్లెట్ల కోసం తండ్రి రోజూ ఓ నాణెం ఇస్తాడు. దాన్ని ఆనందంగా అందుకుని పరుగెత్తుకుంటూ వెళ్ళి ఓ చాక్లెట్టు కొనుక్కుని చాలాసేపు దాన్ని చీక్కుంటూ తినడంలోని గొప్ప ఆనందం హూ జీవితంలోని ఓ మధురమైన జ్ఞాపకం.
ఈ కథ మొత్తం పెద్దవాడైన హూ జ్ఞాపకాలలో నడుస్తుంది. శాశ్వతంగా ఆ ఊరు దాటి వెళ్లిపోతున్న హూ శ్మశానంగా మారిన తమ చిన్న ఊరు, తన చిన్నతనంలో ఎంత అందంగా పచ్చగా ఉండిందో చెబుతూ ఆ ఊరిలో గడిచిన తన అందమైన బాల్యాన్ని వివరించడమే ఈ సినిమా కథ.
హూ తన తండ్రితో అందమైన లోయలో తిరిగిన రోజులను గుర్తుకు తెచ్చుకుంటాడు. ఊరిలోని చర్చ్, దాని ముందు అందమైన నిండైన తమ చిన్న ఇల్లు, అందులో గడిచిన జీవితం, మలచబడిన తన వ్యక్తిత్వం ఇవన్నీ మరపురాని అనుభవాలు. వాటిని పంచుకుంటూ మనల్ని తన గతంలోని తీసుకెళుతున్నాడు హూ.
హూ పెద్ద అన్న ఐవొర్ వివాహం బ్రాన్వెన్ అనే యువతితో నిశ్చయమవుతుంది. వివాహం కోసం ఒంటరిగా ఆ ఊరికి వస్తుంది బ్రాన్వెన్. ఆమెను మొదటి చూపులోనే ఇష్టపడతాడు హూ. ఆమెను కుటుంబ సభ్యులంతా ఆదరిస్తారు. వీరి వివాహాన్ని ఆ ఊరికి కొత్తగా వచ్చిన పాస్టర్ మెర్డిన్ గ్రఫిడ్ చేస్తాడు. ఆ వివాహ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్న గ్రఫిడ్ అంటే మార్గన్లకు అభిమానం ఏర్పడుతుంది. ముఖ్యంగా హు సోదరి అన్గరాద్ గ్రఫిడ్‌తో మొదటి చూపులోనే ప్రేమలో పడుతుంది. సనాతనమైన మత మౌడ్యంతో నడుస్తున్న ఆ చర్చ్‌లో గ్రఫిడ్ తర్కాన్ని ప్రవేశపెడతాడు. మతంపై కోపం ఉన్న యువకులతో మతంలోని గొప్పతనాన్ని మానవత్వం కన్నా గొప్పమతం లేదనే నిజాన్ని వివరిస్తాడు. అతని ఆలోచనలు అటు పెద్దవారికి పిలల్లకు కూడా నచ్చుతాయి. ముఖ్యంగా హూ గ్రఫిడ్ వ్యక్తిత్వానికి ఆకర్షితుడవుతాడు. గ్రఫిడ్ హూని ప్రేమిస్తాడు. అతన్ని తీర్చిదిద్దడంలో పెద్ద పాత్ర వహిస్తాడు.
గని యజమానులు కార్మికుల కూలి తగ్గిస్తారు. నిరుద్యోగులైన పక్క ఊరి యువత చౌకగా పనులు ఒప్పుకునే స్థితి గమనించి వారు కూలి తగ్గించేస్తారు. యువకులు సమ్మె చేద్దామని నిశ్చయించుకుంటారు. కాని పాత తరానికి చెందిన గ్విలిం దీనికి అంగీకరించడు. యజమానులకు ఎదురు తిరగడం తప్పని వాదిస్తాడు. అందుకని కొందరు అతనితో విబేధిస్తారు. కోపాన్ని పెంచుకుని అతనికి విరుద్ధంగా ఓ సమావేశం నిర్వహిస్తారు. తమతో ప్రేమగా మసలిన ఊరివారు ఇంటిపై రాళ్ళు రువ్వడం, భర్తను అవమానించడం బెత్ సహించలేకపోతుంది. అర్ధరాత్రి భర్తకు విరుద్ధంగా నిర్వహించిన సమావేశానికి చిన్న కొడుకు హుతో కలిసి వెళుతుంది. తన భర్తను దూషించడం తప్పని అతని మంచితనాన్ని అనుభవించిన ఆ ఊరు ఇప్పుడు అతనిపై అకారణ వైరం చూపించడం న్యాయం కాదని ఆమె ఆవేశంగా ప్రసంగిస్తుంది. అదే ఆవేశంతో తన భర్తపై చేయి చేసుకునేవారెవరైన్నా సరే వారిని తాను చంపుతానని బెదిరిస్తుంది. ఆ ఊరిలోని యువకులంతా ఆమె కళ్ళ ముందు పుట్టిన వారే. అందుకే తల్లిగా వారిని అంత చనువుతోనూ మందలిస్తుంది ఆమె. ఆమె ముందు అందరూ పిల్లలవలె తల దించుకుంటారు. మంచు వర్షం కురుస్తున్న ఆ రాత్రి బెత్, హూతో రాత్రి సమావేశం నుండి ఇంటికి తిరిగి వస్తూ నదిలో పడిపోతుంది. హూ అరుపులు విని వారిని ఊరివారు రక్షిస్తారు. కాని మంచువర్షంలో ఆ నీటిలో కొంత సేపు ఉండవలసి రావడంతో తల్లి కొడుకులిద్దరి కాళ్లు చచ్చుపడిపోతాయి. తల్లి కొన్ని రోజుల్లో కోలుకోవచ్చు కాని హు మళ్లీ తిరిగి నడవలేడేమో అని వైద్యుడు చెపుతాడు.
కొన్నాళ్లకు గనులు తెరుచుకుంటాయి. మళ్లీ మగవారు పనికి వెళ్తారు. కానీ చాలామంది ఉద్యోగాలు పోతాయి. తక్కువ కూలితో పనులు చేసేవారి సంఖ్య పెరుగుతుంది. ఇక ఆ ఊర్లో ఉండలేమని హు ఇద్దరు అన్నలు నిశ్చయించుకుంటారు. తల్లిదండ్రులను ఒప్పించి పని కోసం వేరే దేశానికి వెళ్లిపోతారు. మంచానికి పరిమితమయిన హూకు గ్రఫిడ్ స్నేహితుడవుతాడు. ఈ అనారోగ్యం మంచి అవకాశంగా అతనికి ఇంగ్లీషులోని ఉత్తమ సాహిత్యాన్ని పరిచయం చేస్తాడు. గొప్ప నవలలను హు అప్పుడే ఒకొక్కటిగా అక్క, వదిన గ్రఫిడ్ సహాయంతో చదువుతాడు. గ్రఫిడ్ ఇచ్చిన ప్రోత్సాహంతో హు మళ్లీ నడక మొదలెడతాడు. దీనితో మార్గన్ కుటుంబం గ్రఫిడ్‌కు ఇంకా దగ్గరవుతుంది. అన్గరాద్ గ్రఫిడ్‌కు మానసికంగా దగ్గరవుతుంది.
గని యజమాని కొడుకు అన్గరాద్‌ను వివాహం చేసుకోవాలనే ప్రస్తావనతో గ్విలింను కలిసి అతని అనుమతి అడుగుతాడు. అంత పెద్ద ఇంటికి కూతురు కోడలు అవుతుందని తెలిసి గ్విలిం సంతోషిస్తాడు. గ్రఫిడ్‌పై తన ప్రేమను అన్గరాద్ అతని దగ్గర బైటపెడుతుంది. తాను ఆమెను ప్రేమిస్తున్నానని కాని ఆమెను వివాహం చేసుకోలేనని అంటాడు గ్రఫిడ్. తన జీవితాన్ని చర్చ్‌కి అంకితం చేశానని, జీవితాంతం పేదవానిగా మిగిలిపోతానని మాట ఇచ్చానని, తన జీవితం కఠినతరం అని, అందులో కుటుంబానికి స్థానం లేదని చెబుతాడు గ్రఫిడ్. తప్పని పరిస్థితులలో అన్గరాద్ వివాహం చేసుకుని ఆ ఊరు విడిచి వెళ్ళిపోతుంది. ఆమెతో గ్రఫిడ్ జీవితంలోని ఉత్సాహం కూడా తరలిపోతుంది. ఇది చిన్నవాడైన హూ అతని వదిన బ్రాన్వెన్ గమనిస్తారు. కాని ఏమీ చేయలేని నిస్సహాయతతో మిగిలిపోతారు. గ్రఫిడ్ దీక్ష వారిలో అతని పట్ల గౌరవాన్ని పెంపొందిస్తుంది.
హుని స్కూల్‌లో చెరుస్తాడు గ్రఫిడ్. అక్కడ పిల్లల ఆకతాయితనం, అహంకారం, టీచర్ల చీదరింపులను హూ భరించవల్సి వస్తుంది. మొదటిసారి దెబ్బలు తిని ఇంటికి వచ్చిన హూని చూసి అతని తండ్రి ఊరిలో బాక్సర్ అయిన మిత్రుడితో శిక్షణ ఇప్పిస్తాడు. హూ ఆకతాయి పిల్లలను ఎదుర్కొంటాడు కాని అహంకారంతో వున్న పట్నం టీచర్లను ఎదిరించలేకపోతాడు. అతని అవస్థ గమనించి ఆ తండ్రి మిత్రులే ఆ టీచర్‌ను కలిసి బుద్ది చెబుతారు. ఊరిలో ఒక పిల్లవాడి కష్టాన్ని తమదిగా భావించే ఆ ఊరివారి ప్రేమను క్రమంగా ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు ఎలా దూరం చేస్తాయో ఈ సినిమా అతి విషాదంగా వివరిస్తుంది.
స్కూలు చదువు పూర్తయ్యాక ఇంకా చదివించాలనుకున్న తండ్రి నిర్ణయాన్ని కాదని హు గనులలో పనికి వెళతాడు. ఆ పని వద్దని తండ్రి వాదిస్తే అంతకన్నా గౌరవమైన పని మరొకటి లేదని తల్లి హు ని సమర్ధిస్తుంది. తమ మగవారు చేసే పని పట్ల ఆ ఊరి స్త్రీలలో ఉన్నవిశ్వాసం, గర్వం, నమ్మకం బెత్ పాత్రలో గమనిస్తాం. మార్గన్ పరివారంలోని మగవారందరూ గనులలో మంచి పని వారు. కాని వీరికి ఎక్కువ జీతం ఇవ్వవలసి వస్తుందని గని యజమానులు మంచి పనివారందరినీ పనిలోనుండి తీసేస్తూ మార్గన్ పరివారంలోని మరో ఇద్దరు సోదరులకు ఉద్వాసన పలుకుతారు. తప్పని పరిస్థితులలో వీరిద్దరూ మరో దేశానికి పని కోసం వెళ్లిపోతారు.
గనిలో ప్రమాదం జరిగి గ్విలిం పెద్ద కొడుకు ఇవోర్ మరణిస్తాడు. అతని భార్య ఈ దు:ఖంలోనే మగబిడ్డను ప్రసవిస్తుంది. ఒంటరితనంతో కుమిలిపోతున్న ఆమె బాధ బెత్ అర్ధం చేసుకుంటుంది. ఆమెను తమ ఇంటికి తెచ్చుకోవడానికి గ్విలిం అంగీకరించడు. ఒక ఇంటికి ఒకరే యజమానురాలని కోడలు మరో ఇంట్లో ఉండవలసిందే అని చెబుతాడు. కాని ఆమె దు:ఖం అర్ధమైన బెత్ చిన్న కొడుకు హును వదినకు తోడుగా వుండడానికి పంపిస్తుంది. ఉమ్మడి కుటుంబంలో ఎవరి పరిధిలో వారుంటూనే ఒకరికొకరు తోడుగా నిలిచే వ్యవ్యస్థ ఇక్కడ కనిపిస్తుంది.
ఈ సమయంలో ఆ ఊరి కొండపై నున్న తమ బంగళాలో కొన్ని రోజులు ఉండడానికి ఒంటరిగా అన్గరాద్ వస్తుంది. పుట్టింటికి రాని ఆమెను చూడాలన్ని హూ తానే బంగళాకు వెళతాడు. అక్కడ అక్క కళ్ళలోని విషాదం, ఆ ధనిక జీవితంలోని కపటత్వం హూ గమనిస్తాడు. అక్కతో గ్రఫిడ్ గురించి చెబుతున్నప్పుడు ఈ సంభాషణ ఆ ఇంటి పనిమనిషి వింటుంది. సాధారణ కుటుంబానికి చెందిన అన్గరాద్ తన యజమానురాలిగా ఉండడం ఆమెకు నచ్చదు. అందుకని అన్గరాద్ విడాకులు తీసుకోబోతుందని, ఫాస్టర్ గ్రిఫిడ్‌తో ఆమెకు అక్రమ సంబంధం ఉందని పుకారు పుట్టిస్తుంది. మచ్చలేని కుటుంబంగా గౌరవ మర్యాదలు అందుకున్న మార్గన్ కుటుంబంపై లోలోన ఆ ఊరివారిలోని అసూయ బైటపడుతుంది. ఈ పుకారు ఊరంతా పాకుతుంది. చర్చ్‌లో అన్గరాద్‌ను ఊరి నుండి బహిష్కరించాలనే ప్రతిపాదన చేయబోతున్నారని మార్గన్ కుటుంబానికి తెలుస్తుంది. ఆ సమావేశానికి హూ ఒక్కడే వెళతాడు. గ్రిఫిడ్ ఊరివారి కపట బుద్దిని ఎత్తి చూపి తాను ఆ ఊరి నుండి వెళ్ళిపోతున్నానని ప్రకటిస్తాడు. అన్గరాద్ ప్రసక్తి అతను రానివ్వడు.
గనిలో మరోసారి ప్రమాద గంట మోగుతుంది. ఈ సారి గ్విలిం భూభాగంలో ఇరుక్కుని పోతాడు. అతని కోసం గ్రిఫిడ్, హూ, మరో స్నేహితుడు క్రిందకు వెళతారు. చాలాసేపు వెతకగా హూకు కొన ఊపిరితో ఉన్న తండ్రి రాళ్ల మధ్య ఇరుక్కుని కనిపిస్తాడు. హూ చెతుల్లో గ్విలిం ఆఖరి శ్వాస వదులుతాడు. అతని శవాన్ని పైకి తీసుకువచ్చిన హులో బాల్యం నశించి పెద్దరికం ప్రవేశిస్తుంది.
తన తండ్రిలాంటి వ్యక్తులు కనుమరుగవడాన్ని, తన కుటుంబంలో తామందరూ అనుభవించిన ఆ ఆత్మీయత ఇకపై కుటుంబాలలోనూ, ఆ ఊరిలోని సామూహిక జీవనం సమాజంలోనూ మాయమవడాన్ని గమనిస్తూ పెరిగిన హూ చివరకు ఆ గనులు తమ ఊరిని ముంచేసి అందమైన ఆ లోయలను నల్లటి కాలరేఖగా మార్చేసిన విధానాన్ని వివరిస్తూ అసహాయంగా మధ్య వయస్కుడిగా ఆ ఊరిని చిట్టచివరిసారి చూసి శాశ్వతంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఉన్నదానితో తప్తిగా బతుకుతూ నీతిని, ప్రేమను నమ్ముకుని జీవించిన కష్టజీవుల కథ ఇది. ఆ తరం మెల్లగా అంతమవడానికి కారణమైన పారిశ్రామికీకరణ, భౌతికవాదం, దీని వలన సమాజం కోల్పోయిన సంతులనం, ఆ క్రమంలో వ్యాపారాత్మకం అయిన మానవ జీవన విధానాన్ని తెలియపరిచే గొప్ప సినిమా ఇది.
యూరోపియన్ సమాజం పూర్తిగా భౌతికవాదం వైపు మరలని రోజుల్లో అక్కడి శ్రామికుల, సాధారణ, నిశ్శబ్ద, సమతుల్య, దురాశకు దూరంగా జీవించిన ఆనందకరమైన సమయాన్ని రికార్డు చేసిన సినిమా అది. బ్యాంకులు కూడా లేని ఆ సమాజంలో ఇంటిల్లిపాది కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని ఓ చోట కలిసి భద్రపరుచుకుని, కలిసి పంచుకుని తిని, తప్తిగా జీవించిన అతి సాధారణమైన వ్యక్తుల ప్రశాంతమైన జీవితాన్ని చూపించిన సినిమా. అందుకే ఈ కథలో సినిమటోగ్రఫీ, ఆర్ట్ డైరక్షన్ కథనానికి ముఖ్యమయ్యాయి. ఈ రెండు విభాగాలలో శ్రద్దగా పని చేసినందుకు ఆర్థర్ మిల్లర్‌కు సినిమాటోగ్రఫీకి, రిచర్డ్ డే, నాథన్ హురన్, థామస్ లిటిల్‌కు బ్లాక్ అండ్ వైట్ ఆర్ట్ డైరక్షన్, ఇంటీరియర్ డెకరేషన్‌కు ఆస్కార్ అవార్డులు లభించాయి. డొనాల్డ్ క్రిస్ప్‌కు గ్విలిం మార్గన్ పాత్రకు ఉత్తమ సహాయక నటుడి పురస్కారం లభించింది. ఇక పాస్టర్ గ్రిఫిడ్‌గా నటించిన వాల్టర్ పీడ్జియన్‌కు, బెత్‌గా నటించిన సారా ఆల్గుడ్‌కు, అన్గరాద్‌గా నటించిన మారిన్ ఓ హారాకు ఈ సినిమా గొప్ప పేరు తీసుకొచ్చింది. హూ గా నటించిన రాడి మెక్డావల్ ఆ తరువాత గొప్ప నటుడిగా ఎదిగాడు.
దర్శకులు జాన్ ఫోర్డ్ దర్శకత్వం వహించిన సినిమాలన్నింటిలో ‘హౌ గ్రీన్ వాస్ మై వాలి” తనకెంతో నచ్చిన సినిమా అని ఎన్నోసార్లు ప్రస్తావించారు. ఈ సినిమాలో వివిధ సందర్భాలలో పాత్రల మధ్య నడిచే సంభాషణలలో ఒక లోతు ఉంటుంది. మతం, కుటుంబం, ధనం, విద్యకు సంబంధించి పాత్రలు పలికే మాటలు సినిమాకు గొప్ప బలాన్నిస్తాయి. చాలాకాలం మదిలో నిల్చిపోయే గొప్ప సినిమా ‘హౌ గ్రీన్ వాస్ మై వాలీ’.
– పి.జ్యోతి,
98853 84740