– బస్‌భవన్ ఎదుట ఆర్టీసి కార్మిక సంఘాలు నిరసన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత చట్టం (బీఎన్‌ఎస్)లోని హిట్ అండ్ రన్‌ను రద్దు చేయాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలు గురువారం హైదరాబాద్‌లోని బస్‌భవన్ ఎదుట నిరసన చేపట్టారు. ఎంప్లాయిస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, స్టాఫ్ వర్కర్స్ యూనియన్, బహుజన వర్కర్స్ యూనియన్, బహుజన కార్మిక యూనియన్ కార్మిక పరిషత్ సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డ్రైవర్లకు పదేండ్ల జైలు శిక్ష, రూ.7 నుంచి రూ. 10 లక్షల జరిమానా విధించాలని నిర్దేశించిన సెక్షన్ 106 (1,2)లను పునసమిక్షించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతుగా ఆందోళన చేపట్టనున్నట్టు తెలిపారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం చేస్తున్న పోరాటంలో ఆర్టీసీలోని ఇతర కార్మిక సంఘాలు సైతం కలిసి రావాలని పిలుపునిచ్చారు. గతంలో ఆర్టీసీలో తీసుకొచ్చిన ఎంవీ యాక్ట్ 2019 ద్వారా సంస్థకు ఉన్న ప్రత్యేక హక్కులు, రాజ్యాంగ రక్షణను నిర్వీర్యం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈయూ నాయకులు వెంకన్న, ఎస్‌డబ్య్లూ ప్రధాన కార్యదర్శి విఎస్ రావు, ఐఎన్‌టీయూసీ నాయకులు జి. అబ్రహం జే.సత్యనారాయణ, .యాదయ్య, బి.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.