– సీఈవో సుదర్శన్‌రెడ్డికి సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో విద్యాసంస్థ పేరుతోపాటు పోస్టల్ అడ్రస్ పూర్తిగా ఉండేలా పొందుపర్చాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఎన్నికల కమిషన్ (ఈసీ)ని కోరింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి సుదర్శన్‌రెడ్డిని శనివారం హైదరాబాద్‌లోని బీఆర్‌కేఆర్ భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జె బాబూరావు కలిసి వినతిపత్రం సమర్పించారు. 2019 ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా ఓటర్ జాబితాలోని ‘కాలమ్ నెంబర్-5లో’ ఓటరు పనిచేసే పాఠశాల/ కళాశాల/ విశ్వవిద్యాలయం పేరు మాత్రమే ప్రస్తావించాలని ఉందని తెలిపారు. పూర్తి అడ్రస్ పేర్కొనాలంటూ ఆ కాలమ్‌లో లేదని వివరించారు. అడ్రస్ లేనందువల్ల బోగస్ ఓట్లు నమోదయ్యే అవకాశముంటుందని పేర్కొన్నారు. ఇతర కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ, కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. అక్టోబర్ ఒకటి నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతున్నదని వివరించారు. ఈ ఓటర్ల జాబితాలోని ‘కాలమ్ నెంబర్-5’లో విద్యాసంస్థ పూర్తి పేరుతోపాటు, మండలం, జిల్లా తదితర పోస్టల్ అడ్రస్‌ను పొందుపర్చాలని కోరారు. బోగస్ ఓట్ల నమోదు ను నివారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని ఓటర్ల జాబితాలో చేర్చడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు.