– కంపుకొడుతున్న హైదరాబాద్ నగరం
– జీహెచ్‌ఎంసీకి ఆనుకుని ఉన్న రోడ్లపైనే కుప్పలు తెప్పలుగా వ్యర్థాలు
– దుర్వాసనతో రహదారులు, వీధులు
– తొలగించడంలో నిర్లక్ష్యంగా గ్రేటర్ సిబ్బంది, రాంకీ శివారు మున్సిపాల్టీల్లో రోడ్లపైనా ఇదే పరిస్థితి
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మహానగరం అపరిశుభ్రతంగా మారింది. నగరంలోని పలు ప్రాంతాలు వీధులు, రోడ్లు చెత్తకుప్పలుగా మారడం, మురుగు నీటితో చుట్టుపక్కల కంపుకొడుతుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయల మార్కెట్లు, పూల మార్కెట్లు, మూసీ పరివాహక ప్రాంతాలు, అంతర్గత రోడ్లు, నాలాలే కాకుండా ఫ్లైఓవర్ల కింది భాగం(పిల్లర్ల వద్ద)లో చెత్తాచెదారం పేరుకుపోయి కంపుకొడుతోంది. నగరంలో ప్రతిరోజూ వ్యర్థాల తొలగింపు సవ్యంగా జరగకపోవడం, కొందరు పౌరులు బాధ్యత లేకుండా రోడ్లపై చెత్త వేస్తుండటంతో ఆ ప్రాంతమంతా దుర్గంధంగా మారుతోంది. శివారు మున్సిపాల్టీల్లోనూ రోడ్లపై ఇదే దుస్థితి నెలకొంది.
ఎప్పటికప్పుడూ చెత్త సేకరణ చేస్తున్నామని, నగరం క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తయారైందని, ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలిపామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అంబర్‌పేట, రామంతాపూర్, సికింద్రాబాద్, ముషీరాబాద్, రాంనగర్, వీఎస్‌టీ, కోఠి తదితర ప్రాంతాల్లో చెత్తాచెదారం, వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో కవర్లతోపాటు వ్యర్థాలను బస్తాల్లో తీసుకొచ్చి రోడ్లపైనే వేస్తున్నారు. వాటి నుంచి నీరు రోడ్లపైకి వచ్చి కంపుకోడుతోంది. గతంలో నగరంలో పెద్దపెద్ద చెత్తకుండీలుండేవి. స్థానికులు వాటిల్లో వ్యర్థాలను వేసేవారు. అయితే, వాటిని తొలగించిన అధికారులు చెత్త ఎక్కడ వేయాలో సరైన ప్రాంతాలను నిర్ధారించకపోవడం.. అందరూ చెత్త సేకరణ ఆటోల్లో వేయకపోవడంతో కొందరు స్థానికులు రోడ్లపై, పాత పాయింట్ల వద్దే చెత్తాచెదారం, వ్యర్థాలను పడేస్తున్నారు.
ఆహ్లాదం వెనుక కంపు
తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై నుంచి చూస్తే చుట్టుపక్కల ఎంతో అందంగా కనిపిస్తుంది. అప్పర్ ట్యాంక్ బండ్, ఆ చుట్టుపక్కల పార్కులు, సచివాలయం, జీహెచ్‌ఎంసీ కార్యాలయంతోపాటు అందమైన భవనాలు, సీనరీ ఎంతో బాగుంటాయి. కానీ ఒక్కసారి కింది భాగంలో పరిశీలిస్తే కంపుతో ముక్కుపుటలు అదిరిపోతాయి. ఒక్కసారిగా ఆనందం మటుమాయమవుతుంది. తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింది భాగంలో పెద్దఎత్తున చెత్తాచెదారం పేరుకుపోవడం ఓ దిక్కయితే, మరోదిక్కు నిరుపయోగంగా మారిన టాయిలెట్ కనిపిస్తుంది. అక్కడ టాయిలెట్ వాసనతోపాటు కుళ్లిపోయిన వ్యర్థాలుంటాయి. అధికారులు ఫ్లైఓవర్ కిందిభాగంలో అందంగా ఉండేందుకు గార్డెనింగ్ చేశారు. అయితే గార్డెనింగ్‌కు ట్యాంకర్ ద్వారా నీళ్లుకొడుతున్నా పారిశుధ్య అధికారులు చెత్తాచెదారాన్ని పట్టించుకోకపోవడంతో పెద్దఎత్తున వ్యర్థాలు పేరుకుపోయాయి. వ్యర్థాల నుంచి మురుగునీరు బయటకు వచ్చి కంపుకొడుతోంది. మూడు నాలుగు రోజులుగా దుర్వాసన వస్తోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా ఆ ప్రాంతం రాత్రి వేళల్లో అసాంఘీక శక్తులకు అడ్డాగా మారింది. పలువురు ఫైఓవర్ కింద కూర్చొని మద్యంతోపాటు మాదక ద్రవ్యాలను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.
క్షేత్రస్థాయిలో ..
నగర అభివృద్ధికి పారిశుధ్య నిర్వహణతో పాటు పచ్చదనాన్ని పెంచడం, టౌన్ ప్లానింగ్, క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా రూపొందించే దిశగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 6 జోన్లు, 30 సర్కిల్స్ ఉండగా, అందులో శానిటేషన్ పనుల నిర్వహణ కోసం సుమారు 22 వేల మంది వివిధ కేటగిరీ ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రతిరోజూ 4500 స్వచ్ఛ ఆటోల ద్వారా నగరంలో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేస్తున్నామని, ఇలా గ్రేటర్‌లో 7500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తవుతోందని, వాటితోపాటు భవన నిర్మాణ వ్యర్థాలు (సీ అండ్ డీ) ప్రతిరోజూ 1500 మెట్రిక్ టన్నులు సేకరించి, దాదాపు 250 లారీలల్లో జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నామని అధికారుల లెక్కలు చెపుతున్నాయి. కానీ నగరంలో సరిపడా చెత్త తరలింపు వాహనాలు లేకపోవడంతోపాటు రాంకీ వ్యవస్థ పెద్దగా పటించుకోకపోవడంతో పారిశుధ్యం గాడి తప్పింది. ప్రతి కాలనీలో మూడు నాలుగు ట్రిప్పులు తిరగాల్సిన రాంకీ వాహనాలు ఒకటి రెండు ట్రిప్పులకే సరిపెడుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో చెత్తసేకరణను పట్టించుకోవడం లేదు. దాంతో రోడ్లపై చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని నగర వాసులు కోరుతున్నారు.
ఖైరతాబాద్‌లో:
ఖైరతాబాద్‌లో రేసింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేసిన అధికారులు అక్కడ చెత్తవేసినా పట్టించుకోవడం లేదు. పారుశుధ్య నిర్వహణ అధికారులు అటువైపు చూడకపోవడంతో చెత్తకుప్పలు పేరుకుపోయాయి. ప్రతి నెలా గుత్తేదారులకు రూ.లక్షలు చెల్లిస్తున్నా చెత్తను తొలగించడం లేదని స్థానికులు వాపోతున్నారు. అక్కడ చెత్తాచెదారం కుళ్లిపోయి కంపుకొడుతోంది.
రాంనగర్ మార్గంలో:
వీఎస్‌టీ రాంనగర్ మార్గంలో చెత్తను తొలగించకపోవడంతో ఆ వైపు నుంచి వెళ్లేవారు ఇబ్బందులకు గురవుతున్నారు. దుర్వాసనతో నానా అవస్థలు పడుతున్నారు. బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండలంలో అనేక ప్రభుత్వ, ప్రయివేటు కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయినా చెత్తాచెదారం, దుర్వాసన వెదజల్లుతూనే ఉంటుంది.
ట్యాంక్‌బండ్‌లో:
నగరంలో వివిధ ప్రాంతాల నుంచి కొందరు చెత్తను తీసుకుచ్చి ట్యాంక్‌బండ్‌లో వేస్తున్నారు. మరికొందరు సందర్శకులు సైతం వ్యర్థాలను ట్యాంక్‌బండ్‌లో వేయడంతో ఆ చెత్తాచెదారం ట్యాంక్ బండ్ చివరకు చేరుకుంటోంది. జీహెచ్‌ఎంసీ నాలా వరకు చెత్త కొట్టుకొచ్చి కంపుకొడుతోంది.