– నామా..రంజిత్.. బోయినపల్లికి గులాబీ బాస్ గ్రీన్ సిగల్
– మిగతా స్థానాలపై పలువురి ఆశలు
– అధినేత నిర్ణయం కోసం ఎదురు చూపులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎలక్షన్లలో ఎక్కువ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో ఉన్న బీఆర్‌ఎస్… అందుకనుగుణంగా తన కార్యాచరణను సిద్ధం చేస్తున్నది. ఇటీవల ముగిసిన పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో నాయకులు, కార్యకర్తల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్టానం…క్యాడర్ ఆలోచనలకు అనుగుణంగా ఇప్పటికే పలు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఖమ్మం నుంచి పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, చేవెళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డిని మరోసారి బరిలోకి దింపాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. దీంతోపాటు కరీంనగర్ టిక్కెట్టును మాజీ ఎంపీ, తనకు అత్యంత దగ్గరి బంధువైన రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు కేటాయించేందుకు గులాబీ బాస్ నిర్ణయించారు. ఇవిపోను మిగతా 14 స్థానాల్లో ఎవర్ని నిలబడతారనే చర్చ ఇప్పుడు కొనసాగుతున్నది.
హైదరాబాద్ ఎంపీ స్థానంలో తమకు దోస్తీ అయిన ఎంఐఎంపై నామమాత్రపు పోటీ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. మజ్లిస్ తమకు ఫ్రెండ్లీ పార్టీ అంటూ మొన్నటిదాకా కేసీఆర్, కేటీఆర్ ప్రకటించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో అక్కడ ఎంఐఎంను ‘చూసీ చూడనట్టు’ వదిలేయనున్నారని సమాచారం. అయితే అక్కడి నుంచి తనకు అవకాశమివ్వాలంటూ బీఆర్‌ఎస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పట్నం కమలాకర్ కోరుతున్నారు. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో తన సామాజిక వర్గమైన మున్నూరు కాపుల ఓట్లు రెండు లక్షలున్నాయనీ, ఇది పార్టీకి కలిసొస్తుందంటూ ఆయన చెబుతున్నారు. ఇక సికింద్రాబాద్ స్థానం నుంచి టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ మాజీ చైర్మెన్, బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకుపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతోపాటు గతంలో తాను బీజెపీలో ఉన్నప్పుడు కూడా సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో పని చేశాననీ, ఇప్పుడు అది తనకు కలిసొస్తుందని ఆయన చెబుతున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలతో తనకున్న సంబంధాలు బీఆర్‌ఎస్‌కు అదనపు బలంగా మారుతాయని ఆయన అంచనా వేస్తున్నారు. అందువల్ల తనకు టిక్కెట్ ఇవ్వాలంటూ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అయితే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు సాయికిరణ్ రూపంలో ఆయనకు తీవ్ర పోటీ ఎదురవుతోందని తెలంగాణ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక నల్లగొండ, భువనగిరి స్థానాలకు విపరీతమైన పోటీ నెలకొంది. నల్లగొండ నుంచి తన కుమారుడు అమిత్‌రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలంటూ శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరుతున్న సంగతి తెలిసిందే. సీనియర్ నేతలు తేరా చిన్నపరెడ్డి, చాడ సురేశ్‌రెడ్డి కూడా ఆ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. భువనగిరి నుంచి మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, క్యామ మల్లేశ్, కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పల్లె రవికుమార్ గౌడ్, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మెన్ దూదిమెట్ల బాలరాజు గౌడ్ కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. వీటితోపాటు మిగతా స్థానాలకు కేసీఆర్ ఎవరెవరిని అభ్యర్థులుగా ఖరారు చేస్తారో వేచి చూడాలి.