లిథుయేనియా రాజధాని విల్నియస్‌లో ఇటీవల జరిగిన నాటో సదస్సు, అమెరికా నేతృత్వంలో పశ్చిమ దేశాల సైనిక కూటమి సరి కొత్తదాడి ప్రారంభించింది. ఉక్రెయిన్ యుద్ధం ఈ సదస్సులో కీలకాంశం అయినప్పటికీ, చివరగా జారీ చేసిన డిక్లరేషన్ మాత్రం ఆ అంశాన్ని మించి, యూరప్‌కు వెలుపల ఇతర ప్రాంతాల్లో తన ప్రయోజనాల గురించి పేర్కొంది. తద్వారా ప్రపంచ ఆధిపత్యాన్ని ఎలాగైనా కొనసాగించాలనే తన ఉద్దేశ్యాన్ని అది స్పష్టం చేసింది. గతేడాది మాడ్రిడ్‌లో జరిగిన సదస్సు డిక్లరేషన్‌లో పేర్కొన్నట్లుగా, భూ, వాయు, సముద్ర జలాల, సైబర్ స్పేస్ రంగాల్లో ఎదురయ్యే భద్రతాపరమైన ముప్పులకు సంబంధించి ‘360 డిగ్రీల వైఖరి’ గురించి డాక్యుమెంట్ పేర్కొంటోంది. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించినంత వరకు నాటో వినిపించిన గళం, దూకుడును పెంచేలా, పోరాటానికి సుముఖంగా వున్నామనేలా ఉంది. అంతేకానీ శాంతి చర్చలకు గల అవకాశాల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఉక్రెయిన్ భూభాగాల నుండి రష్యా పూర్తిగా, బేషరతుగా వైదొలగాలన్నది శాంతికి ముందస్తు షరతుగా పేర్కొంది. ఉక్రెయిన్‌కు ఆయుధాలు, యుద్ధ పరికరాల సరఫరాలను పెద్దఎత్తున పెంచేందుకు నాటో సదస్సు విడిగా ఒక ఒప్పందంలో అంగీకరించింది. తక్షణమే నాటో సభ్యత్వం కావాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేస్తున్న డిమాండ్‌ను నాటో నేతలు అంగీకరించ లేదు. దీనికి కూడా వ్యూహాత్మక ఎత్తుగడలు వున్నాయి. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇచ్చినట్లైతే నాటో ఒప్పందంలోని ఆర్టికల్ 5 అమల్లోకి వస్తుంది. అంటే అమెరికా, ఇతర నాటో సభ్య దేశాలు ప్రత్యక్షంగా రష్యాతో యుద్ధానికి దిగినట్లే అవుతుంది. ప్రస్తుతం నాటో కూటమిలోకి పరోక్షంగా వచ్చినట్లే నంటూ డిక్లరేషన్ ఉక్రెయిన్‌కు హామీ ఇచ్చింది. ”నాటో కూటమితో రాజకీయంగా విలీనమైనట్లేనని, పరస్పరం సహకరించు కోవడం మరింత పెరుగుతోందని” డిక్లరేషన్ పేర్కొంది. ఒకపక్క నాటో దేశాలు అందించే అత్యంత అధునాతనమైన ఆయుధాల సాయంతో నిలకడగా అలా పోరు సల్పుతూనే, మరోపక్క యుద్ధం కారణంగా జరిగే విధ్వంసం, వినాశనం భారాన్ని మాత్రం ఉక్రెయిన్ భరించే పరిస్థితి నెలకొనాలని అమెరికా కోరుకుంటోంది. ఫిన్లాండ్‌ను కొత్త సభ్యురాలిగా తీసుకున్నారు. టర్కీ తన అభ్యంతరాన్ని ఉపసంహరించు కోవడంతో స్వీడన్ చేరికకు మార్గం సుగమమైంది. ఈ రెండు దేశాల చేరికతో, రష్యాతో భూ సరిహద్దులు రెట్టింపు కన్నా పెరిగాయి. తూర్పు యూరప్ అంతటా మోహరించిన బలగాలు, ఆయుధాల వివరాలను పేర్కొంటూ ఒక డాక్యుమెంట్‌ను నాటో సదస్సు ఆమోదించింది. అలాగే నాటో సత్వర ప్రతిస్పందనా బలగాల సంఖ్యను 40వేల నుండి మూడు లక్షల మంది సైనికులకు పెంచాలన్న ప్రణాళికకు కూడా ఆమోదముద్ర వేసింది. ఆ రకంగా, రష్యా చుట్టుపక్కల సరిహద్దులను నాటో బలగాలతో చుట్టుముట్టడం చాలా వేగంగా పెరిగింది. ఇలా నాటో తూర్పు దిశగా విస్తరించడమే ఉక్రెయిన్‌లో యుద్ధానికి మొదటి కారణంగా వుంది. జర్మనీ ఏకీకరణ తర్వాత నాటోను తూర్పు దిశగా విస్తరించబోమని ఇచ్చిన హామీ నుండి అమెరికా, పశ్చిమ దేశాలు వెనక్కి మళ్ళాయి. మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఇండో-పసిఫిక్ ప్రాంతంతో సహా ప్రపంచంలో ప్రతి భాగంలోనూ తమ వ్యూహాత్మక ప్రయోజనాల గురించి విల్నియస్ డిక్లరేషన్ మాట్లాడింది. ఆ రకంగా, గుత్తాధిపత్యం కోసం… తన ప్రపంచ ప్రణాళికకు ద్రోహం చేసింది.
డిక్లరేషన్‌లో కీలకంగా దృష్టి పెట్టిన మరో అంశం చైనా. ”అంతర్జాతీయంగా తన ప్రభావాన్ని, అధికారాన్ని పెంచుకు నేందుకు, విస్తృత స్థాయిలో రాజకీయ, ఆర్థిక, సైనిక సాధనాలు ఉపయోగిస్తోందంటూ” చైనాపై ఆరోపణలు చేసింది. ”హానికరమైన హైబ్రిడ్, సైబర్ కార్యకలాపాలతో నాటో భద్రతను దెబ్బతీస్తోందని, కీలకమైన సాంకేతిక రంగాలను, ముఖ్యమైన మౌలిక సదుపాయాలను, వ్యూహాత్మక పరికరాలను, సరఫరా మార్పులను నియంత్రించడానికి ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు చేసింది. ప్రపంచ దేశాలపై అమెరికా గుత్తాధిపత్యాన్ని కొనసాగిం చేందుకు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేసుకున్న యంత్రాంగాలు-నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను ఉల్లంఘిస్తోం దంటూ చైనాపై ఆరోపణలు చేసింది. విల్నియస్ సదస్సులో క్వాడ్, అకస్ దేశాల రాజకీయ నేతల భాగస్వామ్యాన్ని చూసిన చైనాను ఈ రకంగా లక్ష్యంగా చేసుకుంది. ఈ సదస్సుకు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రధానులు, దక్షిణ కొరియా అధ్యక్షుడు హాజరయ్యారు. చైనాను ఎదుర్కొనడానికి, ఏకాకిని చేయడానికి తూర్పు ప్రాంతంలో నాటోను సృష్టించాలని అమెరికా ఆశిస్తోంది. క్వాడ్ సభ్యురాలై నప్పటికీ భారత్ ఈ సదస్సులో పాల్గొనలేదు. ప్రాధమికంగా ఉక్రెయిన్ యుద్ధాన్ని, రష్యాను విల్నియస్ సదస్సు ఎదుర్కొనాల్సి ఉన్నందున, తన తటస్థ వైఖరిని దృష్టిలో ఉంచుకుని భారత్ ఈ సదస్సుకు హాజరు కాలేక పోయింది. అయితే, పశ్చిమ దేశాల కూటమి అనుసరిస్తున్న ఇండో-పసిఫిక్ వ్యూహాన్ని నాటో సదస్సు అంచనా వేస్తోంది. ఈ ఇండో పసిఫిక్ వ్యూహంలో ఇప్పటికే భారత్ పూర్తిగా రంగంలోకి దిగింది. పెరుగుతున్న సైనికీకరణను, అమెరికా, దాని మిత్రపక్షాల దూకుడును నాటో సదస్సు స్పష్టంగా తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సైన్యం ఉపసంహరణకు దిగిన జర్మనీ, జపాన్‌లు రెండూ తిరిగి ఆయుధాలను సమకూర్చుకునే పంథాను ఇప్పుడు అనుసరిస్తున్నాయి. సైనిక పాటవాన్ని సమకూర్చు కుంటున్నాయి. ఉక్రెయిన్ సాయుధ బలగాల ప్రతి దాడిలో పెద్దగా పురోగతి లేకపోయినప్పటికీ ఉక్రెయిన్‌లో యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగా లని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆశిస్తున్నారు. యూరప్‌పై తన గుత్తాధి పత్యాన్ని మరింత సంఘటితం చేసుకోవా లన్న అమెరికా ఆకాంక్షకు, చైనాతో జరగబోయే పోరాటంలో వారందరినీ కూడగట్టేందుకు ఈ సుదీర్ఘ యుద్ధం, అనుగుణంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే, అమెరికా దుందుడుకు ప్రణాళికలను మోడీ ప్రభుత్వం మరింతగా అంగీకరించడాన్ని చూడాల్సి ఉంటుంది.
(‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)