కుల నిర్మూలన ఆవశ్యకత – వాస్తవధోరణులు, మార్గదర్శకాలు

Need for Abolition of Caste - Principles, Guidelinesభారతదేశంలో కుల వ్యవస్థ ఎప్పటికీ ఒక నిర్మూలన చెందని రాక్షసిగా కొనసాగుతోంది. గణాంకాలు, ఆధునిక సమాజంలో సుసంపన్నంగా ఉన్నప్పటికీ, కుల వ్యవస్థ , దానితో పాటు వచ్చే సామాజిక అసమానతలు మన దేశ ప్రజల జీవితాలను నాశనం చేస్తూనే ఉన్నాయి. కులం ఆధారంగా పనులు కేటాయించడం మన సమాజంలో చెరుపలేని మచ్చగా నిలిచింది. ఈ చరిత్ర ప్రాచీన కాలానికి వెళ్ళి పోతుంది, అయితే ఇప్పటికీ సమాజం ఈ కుల వ్యవస్థ నుండి బయటపడటం చాలా కష్టం అవుతుంది. కులవ్యవస్థకు మూలమైన వర్ణ వ్యవస్థ భారతదేశంలో శ్రమ విభజనను బలంగా అమలు చేసింది. బ్రాహ్మణులు విద్య, వేదాలు చదివే సత్వరాధికారం పొందినప్పుడు, క్షత్రియులు పాలనా భాద్యతలు స్వీకరించారు. వైశ్యులు వ్యాపారాలలో నిమగ్నమయ్యారు, శూద్రులు శ్రామిక పనులు మాత్రమే చేసేవారు. వర్ణ వ్యవస్థ కేవలం కార్మిక వ్యవస్థ మాత్రమే కాదు, అది ఆధిపత్యానికి, ఒక కులం మరొక కులం మీద చూపే పైచేయికి మౌలిక కారణం. ఈ వర్ణ వ్యవస్థ క్రమంగా కుల వ్యవస్థగా మారడం, తక్కువ కులాలకు చెందినవారు నష్టపోవడం సహజంగా జరిగింది. కులం ఆధారంగా కేటాయించిన పనులు వారిని భౌతికంగా, మానసికంగా, ఆర్థికంగా పడిపోవడానికి దారితీశాయి.
ఆధునిక కాలంలో కూడా, దళితులు, వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలు అనారోగ్యకరమైన,హానికరమైన పనుల్లో శ్రమిస్తూనే ఉన్నారు. ఇటీవలి The ministry of social justice and empowerment గణాంకాల ప్రకారం, దేశంలో మాన్యువల్ స్కావెంజింగ్ వంటి హానికరమైన పనుల్లో 91.9% మంది SC, ST, OBC వర్గాలకు చెందినవారే ఉంటున్నారు. మొత్తం 38,000 మంది కార్మికులు వివిధ పథకాల క్రింద ప్రొఫైల్ చేయబడినప్పుడు, ఈ వర్గాల వారు మాన్యువల్ స్కావెంజింగ్ వంటి పనులు చేయడానికి ఎందుకు బలవంతులవుతారు అన్న ప్రశ్నకు సమాధానం ఇప్పటికి సరిగ్గా లేదు. కేవలం వర్ణాధిపత్యం , కుల విభజన కారణంగానే ఈ వర్గాలు ఇంకా ఈ పనులను చేస్తూనే ఉంటాయి. అంబేద్కర్ వంటి మహానుభావులు కుల వ్యవస్థపై తీవ్రమైన పోరాటం చేసినప్పటికీ, ఈ సమస్య ఇంకా సమాజంలో కొనసాగుతూనే ఉంది. అంబేద్కర్ తన జీవితం మొత్తం సమానత్వం కోసం వెచ్చించారు. ‘అస్పృశ్యత’ ను తీవ్రంగా విమర్శించిన అంబేద్కర్, కులానికి వ్యతిరేకంగా నిలబడటం ద్వారా సమాజంలోని తక్కువ వర్గాలకు స్వాతంత్ర్యం కల్పించాలని కోరారు. అంబేద్కర్ రిజర్వేషన్లను కేవలం ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి కాకుండా, జీవిత ప్రమాణాలు మెరుగుపర్చడానికి కూడా ఉపయోగించారు. ఆయన తన రచనలలో ‘అస్పృశ్యత’ను నిందించారు,ఇది వ్యక్తుల జీవితాలను ఎలా నాశనం చేస్తుందో వివరించారు. అంబేద్కర్ ఆలోచనలు కేవలం న్యాయం లేదా రిజర్వేషన్ల కోసం మాత్రమే కాదు, జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు లక్ష్యంగా ఉన్నాయి. “నాకు నీతిని సాధించడం అవసరం, కేవలం జాతి మార్పిడిని కాదు” అన్న ఆయన మాటలలో కుల వ్యవస్థపై ఆయన ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది.
కానీ, కొందరు ఆ వాదనను వ్యతిరేకిస్తూ “రిజర్వేషన్ల అవసరం లేదు” అంటున్నారు. అయితే గణాంకాలు, వాస్తవాలు చూస్తే, రిజర్వేషన్ల అవసరం ఇంకా వాస్తవంగా కనిపిస్తోంది. మన సమాజంలో ఉన్న అసమానతలు ఇంకా పూర్తిగా తొలగించబడలేదు. మాన్యువల్ స్కావెంజింగ్ వంటి హానికరమైన పనులు కేవలం ఆ వ్యక్తుల భౌతిక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, వారి ఆర్థిక స్థాయికి కూడా చాలా పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. ఇవి కేవలం అనారోగ్యాలను తీసుకొచ్చే పనులే కాకుండా, ఆ వర్గాల ప్రజల అభివృద్ధికి అడ్డంకులు ఏర్పరుస్తున్నాయి. ఈ వర్గాలకు ఇంకా తగిన అవకాశాలు అందుబాటులో లేకపోవడం వారి అభివృద్ధిని పూర్తిగా నిరోధిస్తుంది. వారి రోజువారీ జీవన పరిస్థితులు పూర్తిగా శ్రమాధారంగా ఉండడం వారిని ఆర్థికంగా వెనుకబెట్టే ప్రధాన కారణంగా మారింది. పై ఇచ్చిన గణాంకాలు కూడా ఈ వాస్తవాన్ని మద్దతు ఇస్తున్నాయి.
రాజకీయాల్లో,ఉన్నతస్థాయిలో అధిక పదవులు ఇప్పటికీ ఉన్నత కులాలకు చెందినవారే స్వాధీనం చేసుకుంటున్నారు. మన రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించినప్పటికీ, సాధారణంగా అధిక స్థాయిలో ఉన్న పదవులు ఒకే వర్గానికి చెందిన వారే అధికంగా పొందుతున్నారు. ప్రభుత్వాలు, కార్పొరేట్ రంగాలలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని మరింతగా స్పష్టం చేశాయి. “రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నత కులాల వారి మాత్రమే పాలన కొనసాగుతోంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది వాస్తవంగా ఉన్న విషయం, కులవ్యవస్థ సమాజంలో ఇంకా బలంగా ఉన్నదనే దానికి స్పష్టమైన ఉదాహరణ.
ఈ క్రమంలో, అరుంధతి రాయ్ రాసిన The Doctor and the Saint అనే పుస్తకం అంబేద్కర్, గాంధీ మధ్య జరిగిన చర్చను చక్కగా వివరిస్తుంది. ఈ చర్చలో అంబేద్కర్, కుల వ్యవస్థ వల్ల ప్రజల జీవితాలు ఎంతగా దెబ్బతిన్నాయో, గాంధీ ఆచరణలో ఉన్న సామరస్యాన్ని కాపాడాలని కోరుకున్నప్పటికీ, అంబేద్కర్ సమాజంలోని అసమానతలను పూర్తి స్థాయిలో తొలగించేందుకు ఎంత శ్రమించారో తెలియజేస్తుంది. ఈ చర్చ మనకు అంబేద్కర్ సిద్ధాంతాలు ఇప్పటికీ ఎంత ముఖ్యమో బోధిస్తుంది. ఈ పరిస్థితిలో, కుల వ్యతిరేక పోరాటం ఇంకా కొనసాగాల్సిన అవసరం ఉంది. కేవలం హానికరమైన పనులను తగ్గించడం మాత్రమే కాదు, ఉన్నతస్థాయి ఉద్యోగాలలో కూడా సామాజిక సమానత్వం సృష్టించడం అవసరం. కులం ఆధారంగా కేటాయించిన పనులు, అధికారాలు సమానంగా ఉన్నత వర్గాలకే పరిమితం కాకుండా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు కూడా అర్థవంతమైన అవకాశాలు అందించాలి. విద్య, వైద్య రంగాలలో కూడా ఈ వర్గాలకు తగిన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పనులను టెక్నాలజీ ద్వారా మెషన్లు ద్వారా చేయించాలనే ప్రభుత్వ యత్నాలు ఉన్నా, ఇంకా పూర్తిగా అమలు కాకపోవడం వల్ల ఈ వర్గాలు ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నాయి. నిజానికి మన రాజ్యాంగం కుల వివక్షను నిషేధించింది, కానీ ఈనాటి వాస్తవాలు చూస్తే, రిజర్వేషన్లు ఇంకా చాలా అవసరమని స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఆర్థిక, సామాజిక, శారీరక పరమైన సమస్యలతో బాధపడుతున్న నిమ్న వర్గాల వారి స్థితి చాలా దయనీయంగా ఉంది.
ఈ తరగతులకు చెందినవారు ఆర్థికంగా కేవలం వలస జీవితాన్ని గడుపుతున్నారు. వారి జీవితాలలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలతో పాటు శారీరక సమస్యలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఆరోగ్య రక్షణలో అసమానతలు, మానసిక ఆరోగ్య సమస్యలు, సంఘానికి దూరంగా ఉండే పరిస్థితేనియంగా ఉన్నారు. అంబేద్కర్ గారి అనుసరణలో మనం ఈ సమస్యల నుండి బయటపడాలని ప్ర‌యాత్నించాలి. ఇంకా, మన దేశంలో ఉన్నత పదవులు, రాజకీయాలు అధికంగా పై కులాలకు చెందినవారే అధికం చేసారు. ఒక అధ్యయనం ప్రకారం కేంద్ర స్థాయి పాలన , రాజకీయాల్లో ఉన్న అధిక శాతం స్థానాలు అగ్ర కులాలకు చెందినవారే అధిష్టించారని వెల్లడించబడింది . ఇలా అధికారంలో ఉన్నత స్థానాలను కలిగివున్న వారే ఎక్కువగా తమ కులాల వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది కుల వివక్షను ఇంకా బలపరుస్తుంది. ఇదే సమయంలో, రిజర్వేషన్లు ఎందుకు అవసరమో, కుల వ్యతిరేక పోరాటం ఎంతదూరం జరగాలనే దానికి ఈ గణాంకాలు, పుస్తకాలు, వాస్తవాలు బలంగా నిలుస్తున్నాయి. అంబేద్కర్ సూచించిన మార్గం ప్రకారం సమాజం ముందుకు సాగాలి. సమాజంలోని అసమానతలు ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ సమానత్వం కోసం చేసే యత్నాలు సమాజాన్ని ముందుకు నడిపించడానికి అత్యవసరంగా మారతాయి. కుల నిర్మూలన కోసం మనం చేసే ప్రయత్నాలు ఇంకా ఎక్కువగా అవసరం అవుతున్నాయి. సమానత కోసం మనం కొనసాగించాల్సిన పోరాటం ఇప్పటికీ ముగిసిపోలేదు. ప్రతి ఒక్కరికీ సమానమైన అవకాశాలు ఇచ్చేవరకు ఈ పోరాటం కొనసాగాల్సిందే.
– సృజ‌న దుర్గె