అమెరికా ఎన్నికల్లో నరాలు తెగే ఉత్కంఠ!

Sampadakiyamఅమెరికా ఎన్నికల్లో నరాలు తెగే ఉత్కంఠ. ఏం జరుగుతుందో తెలియని స్థితి. పది రోజులుగా వివిధ సంస్థలు జరుపుతున్న సర్వేలు స్థిరంగా ఒకశాతానికి అటూ ఇటూగా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌ వైపే మొగ్గుచూపాయి. ఈ స్వల్ప తేడా ఓటింగ్‌ సమయానికిి ఏ మాత్రం అటూ ఇటైనా ఫలితాలు తారుమారౌతాయి. గతంలో 2016లో సర్వేలన్నీ హిల్లరీ క్లింటన్‌ గెలుస్తారని చెప్పినప్పటికీ డోనాల్డ్‌ ట్రంప్‌ గెలిచాడు. అయితే దేశం మొత్తంగా జనం వేసిన ఓట్లు చూస్తే హిల్లరీకి 30లక్షలకు పైగా మెజారిటీ వచ్చినప్పటికీ 538 ఎలక్టరల్‌ కాలేజీలో ట్రంప్‌కు మెజారిటీ వచ్చింది. రెండువేల సంవత్సరంలో కూడా ఇదే మాదిరి ఫలితాలు వచ్చాయి. అదే మరోసారి పునరావృతం అవుతుందా? అంటున్న వారు కూడా లేకపోలేదు. ఎలక్టరల్‌ కాలేజీలో ఇద్దరికీ సమంగా వస్తే వాటితో పాటు ప్రతి రాష్ట్రం ఒక ఓటు చొప్పున వేసి ఫలితాన్ని నిర్ధారిం చాల్సి ఉంటుంది. అమెరికా చరిత్రలో ఇప్పటికి మూడు సార్లు అలా జరిగింది. ఈ సారి అదే పరిస్థ్ధితి వస్తే మొత్తం 50రాష్ట్రాలలో రిపబ్లికన్లు 26చోట్ల అధికారంలో ఉన్నందున ఒక్క ఓటు మెజారిటీతో ట్రంప్‌ గెలిచే అవకాశాలు లేకపోలేదు. ఇవన్నీ వివిధ దృశ్యాల ఊహాగానాలే. గత ఎన్నికల్లో జో బైడెన్‌కు 306, ట్రంప్‌కు 232 ఓట్లొచ్చాయి. అంతకు ముందు ఎన్నికల్లో ట్రంప్‌కు 304, హిల్లరీ క్లింటన్‌కు 227, ఇతరులకు ఏడు ఓట్లొచ్చాయి.
సాంప్రదాయంగా డెమోక్రాట్లు, రిపబ్లికన్లకు మెజారిటీ వచ్చే రాష్ట్రాలలో అదే పరిస్టితి ఉన్నప్పటికీ ఏడు రాష్ట్రాలలో ఓటర్ల నాడి ఎలా ఉందో తెలియటం లేదు. వీటిని స్వింగ్‌ రాష్ట్రాలు అంటున్నారు. అంటే ఎటుమొగ్గేదీ చివరివరకు తెలియదు. పదిశాతం మంది రెండు రోజుల ముందువరకు ఎవరికి ఓటువేసేదీ నిర్ణయించు కోలేదని చెబుతున్నారు. ఏడింటిలో గత ఎన్నికల్లో ఆరుచోట్ల డెమోక్రాట్లు మెజారిటీ తెచ్చుకోగా ఒక రాష్ట్రంలో రిపబ్లికన్లు పైచేయి సాధించారు. బైడెన్‌ గెలిచాడు. అంతకుముందు ఎన్నికల్లో అధిక రాష్ట్రాల్లో రిపబ్లికన్లు గెలవటంతో ట్రంప్‌ నెగ్గాడు. తాజా ఎన్నికల్లో ఇది రాసిన సమయానికి నాలుగు రాష్ట్రాలో డెమోక్రాట్లు, మూడుచోట్ల రిపబ్లికన్లు మెజారిటీలో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అందుకే నరాలు తెగే ఉత్కంఠ కారణంగా ట్రంప్‌-కమల ఈ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు జరిపారు. లోవా రాష్ట్రంలో గత రెండు ఎన్నికల్లో ట్రంప్‌కు మెజారిటీ వచ్చింది. తాజా సర్వేలో అక్కడి మహిళాఓటర్లు కమల వైపు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలు వెల్లడించాయి. స్వింగ్‌ రాష్ట్రాలన్నింటా ఇదే వైఖరి ఉంటుందని ట్రంప్‌ విజయంపై ఆశలు పెట్టుకున్న బెట్టింగ్‌ బంగార్రాజులు కంగారు పడుతున్నట్లు వార్తలు. అమెరికా ఎన్నికల సమయంలో తిమ్మినిబమ్మిని చేయటంలో మీడియా, సామాజిక మాధ్యమాలు పెద్ద పాత్రనే పోషిస్తాయి గనుక చివరి క్షణంలో వచ్చే ఇలాంటి వార్తలను ఎంతవరకు నమ్మాలో తెలియదు. మహిళలు, రెడ్‌ ఇండియన్లు (అమెరికాలో ఆదివాసులు), వలసొచ్చిన వారు,స్పానిష్‌ భాష మాట్లాడే వారంతా ట్రంప్‌ను ఓడించేందుకు ముందుగానే పోలింగ్‌ కేంద్రాలకు వచ్చినట్లు కూడా కొన్ని వార్తలొచ్చాయి.గత ఎన్నికల్లో స్వింగ్‌ రాష్ట్రాలన్నింటా రెడ్‌ ఇండియన్లు డెమోక్రాట్లవైపు మొగ్గటంతో స్వల్ప మెజారిటీలతో బైడెన్‌ గెలిచాడు.
పోలింగ్‌ తరువాత తమ విజయ రహస్యాన్ని వెల్లడిస్తామని న్యూయార్క్‌ సభలో ట్రంప్‌ ప్రకటించాడు. అంతకు ముందు భారీ సంఖ్యలో పోల్‌ అవుతున్న ముందస్తు ఓట్లను చూస్తే అక్రమాలు జరుగుతున్నట్లుగా అనుమానం ఉందని ట్రంప్‌ అన్నాడు. అమెరికా దురాక్రమణకు గురైందంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు. పరుషపదజాలం, నోటి దురుసు సరేసరి. ఈ వ్యాఖ్యలపై వెలువడుతున్న భాష్యాలను చూస్తే తన ఓటమిని ట్రంప్‌ పసిగట్టాడని, అందుకే తాను ఓడితే ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లే అని ప్రచారం చేస్తున్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమిని అంగీకరించకుండా 2021జనవరి ఆరున ఫలితాలను ఖరారు చేసే అమెరికా అధికార కేంద్రం కాపిటల్‌ హిల్‌పై తన అనుచరులతో చేయించిన దాడి పునరావృతం అవుతుందేమో అని కూడా భయపడుతున్నారు. ఇలాంటి ఫాసిస్టు శక్తిని ఓడించాలని అమెరికా కమ్యూనిస్టు పార్టీ ఓటర్లకు పిలుపునిచ్చింది. ప్రాజెక్టు 2025పేరుతో అమెరికాను అగ్రస్థానంలో నిలుపుతానంటూ కార్మికవ్యతిరేకమైన అజెండా తో ట్రంప్‌ ముందుకు వచ్చినట్లు పేర్కొన్నది. డెమోక్రాట్లు గెలిస్తే కార్మికవర్గ హక్కుల రక్షణకు పోరాటాలు చేసేందుకు అవకాశం ఉంటుందని, ట్రంప్‌ అత్యంత ప్రమాదకారి అని పేర్కొన్నది. కమ్యూనిస్టులు, అభ్యుదయ వాదులు ఉన్నంతలో ఎవరు తక్కువ ప్రమాదకారి అని ఎంచుకోవటం తప్ప, ఎవరు గెలిచినా అమెరికా బహుళజాతి గుత్త సంస్థల అజెండాను ముందుకు తీసుకుపోవటం తప్ప మరొకటి కాదన్నది గత చరిత్ర రుజువు చేస్తున్నది.