అబద్ధాల పుట్ట.. తప్పుల తడక..

Birth of lies..
Mistakes..– సర్కార్‌ శ్వేతపత్రంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
–  అసెంబ్లీ సాక్షిగా అప్పులపై ప్రభుత్వం అసత్యాలు చెప్పిందంటూ విమర్శ
–  తమ హయాంలో తీసుకున్న స్థూల రుణాలు రూ.3,17,015 కోట్లేనని స్పష్టీకరణ
– బీఆర్‌ఎస్‌ తొమ్మిదిన్నరేండ్ల ప్రగతి ప్రస్థానంపై ‘స్వేదపత్రం’ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం ఒక అబద్ధాల పుట్టని, తప్పుల తడకని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. తమ పార్టీనీ, గత ప్రభుత్వాన్నీ బద్నాం చేసేందుకే కాంగ్రెస్‌ ఉద్దేశపూర్వకంగా అప్పులపై అసత్యాలను వల్లె వేసిందని ఆయన విమర్శించారు. తమ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో తీసుకున్న స్థూల రుణాలు రూ.3,17,015 కోట్లేనని చెప్పారు. కానీ అందుకు భిన్నంగా రాష్ట్ర అప్పులు రూ.6.71, 757 కోట్లుగా చూపించారని ఆయన తెలిపారు. విద్యుత్‌, ఆర్టీసీ, పౌర సరఫరాల శాఖల్లో లేని అప్పులను ఉన్నట్టుగా చూపించారని వాపోయారు. తమ హయాంలో పెట్టిన ఖర్చు కంటే పెరిగిన సంపద పది రెట్లు ఎక్కువని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని గుర్తించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కోరారు. సంబంధిత లెక్కలు, అంకెలు, సంఖ్యలు, గణాంకాలతో ‘స్వేదపత్రం’ అనే డాక్యుమెంట్‌ను ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చిన ఆయన… తొమ్మిదన్నరేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిని సోదాహరణంగా వివరించారు. ముఖ్యంగా వ్యవసాయం, విద్యుత్‌, సాగు, తాగు నీరు, అడవుల సంరక్షణ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తదితరాంశాల్లో చేపట్టిన సంస్కరణలను ఏకరువు పెట్టారు. పెద్ద నోట్ల రద్దు, కరోనా మహమ్మారి, విభజన కష్టాల వల్ల రాష్ట్రం నష్టపోయిన తీరు గురించి చెప్పారు. తమ ఏలుబడిలో రెండో హరిత విప్లవం (వ్యవసాయం), గులాబీ (గొర్రెలు, ఇతర జీవాలు), నీలి (చేపలు), శ్వేత (పాలు), పసుపు విప్లవా(ఆయిల్‌ పామ్‌)లను సాధించామని తెలిపారు.
బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ఆస్తులను పెంచటంతోపాటు అస్థిత్వాన్ని సైతం కాపాడామని కేటీఆర్‌ ఈ సందర్భంగా చెప్పారు. పెండింగ్‌ ప్రాజెక్టుల్లో చాలా వాటిని పూర్తి చేశామని తెలిపారు. వాటికి ఇప్పుడు కాల్వలు తవ్వి, నీళ్లు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి సూచించారు. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులో ఒక బ్యారేజీలో చిన్న తప్పు దొర్లితే మొత్తం ప్రాజెక్టునే లోపభూయిష్టంగా పేర్కొనటం శోచనీయమన్నారు. రైతుల సహజ మరణాలను సైతం అన్నదాతల ఆత్మహత్యలుగా చిత్రీకరించటం కాంగ్రెస్‌ సర్కారుకే చెల్లిందని విమర్శించారు. ఉచిత కరెంటు, భూ గర్భ జలాలు పెరగటం తదితర వెసులుబాట్ల వల్ల వ్యవసాయ మోటార సంఖ్య బాగా పెరిగిందని చెప్పారు. దీనిపై కూడా సీఎం రేవంత్‌ వ్యగ్యంగా మాట్లాడటం దారుణమన్నారు. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. దాన్ని ఖర్చుగా చూడకూడదని, భవిష్యత్‌ తరాలకు పెట్టుబడిగా భావించాలని అన్నారు. తెలంగాణ సంపదను అగౌరవపరిస్తే సహించబోమన్నారు. ‘అది ఒక దీపస్తంభం లాంటిది, దాన్ని ఆరిపోనివ్వం.. ఆగిపోనివ్వం.. నిలబెడతాం…’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులపై న్యాయ విచారణకు ఆదేశిస్తామంటూ ప్రభుత్వం చెబుతోంది.. మేం ఎలాంటి విచారణకైనా సిద్ధం… అని కేటీఆర్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
చెప్పుకోలేక పోయాం…
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ వైపు నుంచి కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమేనని కేటీఆర్‌ ఈ సందర్భంగా అంగీకరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు, అత్యధిక మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన తదితరాంశాలను సరిగ్గా చెప్పుకోలేకపోయామని అన్నారు. ప్రతీ ఎన్నికల్లోనూ గెలుపోటములు సహజమేనని తెలిపారు. ప్రస్తుత ఓటమి తమ పార్టీకి స్పీడ్‌ బ్రేకర్‌ లాంటిదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోపాటు ఇంకా 412 హామీలను అమలు చేయాల్సి ఉందన్నారు. అందువల్ల వాటన్నింటినీ పూర్తి చేయాలని సూచించారు.
ప్రజా దర్బార్‌ పట్టించుకోలేదు : అన్నపూర్ణను ఆదుకున్న కేటీఆర్‌
ప్రజాదర్బార్‌లో నాలుగు సార్లు విన్నవించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగిన అన్నపూర్ణ అనే మహిళను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదుకున్నారు. తన ఆర్థిక కష్టాలను, తన పిల్లల చదువుల ఇబ్బందులను, తన దుర్భరమైన జీవితాన్ని వివరిస్తూ తమను ఆదుకోవాలని ఆమ ప్రజాదర్బార్‌లో కోరారు. అయితే ఫలితం లేకపోవడంతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలవడంతో ఆమె కూతురు నర్సింగ్‌ చదువుకునేందుకు రూ.ఒక లక్ష ఆర్థిక సాయాన్ని అందజేశారు. కేటీఆర్‌కు అన్నపూర్ణ ధన్యవాదాలు తెలిపారు.
స్వేదపత్రంలోని ముఖ్యాంశాలు…
తలసరి ఆదాయం (రూ.)
2013-14 2022-23
1,12,162 3,17,115
జీఎస్డీపీ (లక్షల కోట్లు)
2013-14 2022-23
4.51 13.27

పేదరికం
2013-14 2022-23
21.92 5.8
విద్యుత్‌ రంగం
– ఈ రంగంపై పెట్టిన ఖర్చు రూ.1,37,517 కోట్లు
– స్థాపించిన విద్యుత్‌ సామర్థ్యం 2013-14లో 7,778 మెగావాట్లు, 2022-223 నాటికి అది 19,464 మెగావాట్లకు పెరిగింది
– తలసరి విద్యుత్‌ వినియోగం 2013-14లో 1,196 యూనిట్లుగా ఉంది. 2022-23 నాటికి అది 2,140 యూనిట్లకు పెరిగింది.
– రాష్ట్ర పీక్‌ డిమాండ్‌ 2013-14లో 5,661 మెగావాట్లు, 2022-23 నాటికి అది 15,497 మెగావాట్లకు పెరిగింది.
– మోటారు కనెక్షన్లు 2013-14లో 19 లక్షలుగా ఉంటే, 2022-23 నాటికి వాటి సంఖ్య 28 లక్షలకు పెరిగింది.
బడ్జెట్‌ అప్పులు (రూ.కోట్లలో) 3,89,673
– పాత బడ్జెట్‌ రుణాలు (రూ.కోట్లలో) 72,658
– స్థూలంగా బడ్జెట్‌ రుణాలు (రూ.కోట్లలో) 3,17,015 (6,71,757 కాదు)
– ఎస్‌పీవీలు (ప్రభుత్వ గ్యారెంటీలు ఉన్నవి రూ.కోట్లలో) 1,27,208
– ఎస్‌పీవీలు (రూ.కోట్లలో) 95,462
– ప్రభుత్వ హామీలేని రుణాలు (రూ.కోట్లలో) 59,414
– పౌర సరఫరాల శాఖ లోన్లు రూ.21,029 కోట్లు మాత్రమే (వీటిని కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.56,146 కోట్లుగా చూపింది-లేని రూ.35 వేల కోట్లను అదనంగా చూపించారు)
-తమ పరపతితో కట్టుకునే బడ్జెటేతర అప్పు స్థూలంగా రూ.2,46,969 కోట్లు
– ఆర్టీసీ, విద్యుత్‌, పౌర సరఫరాలశాఖలో లేని అప్పులను ఉన్నట్టుగా చూపారు.
వ్యవసాయ రంగం…
– ఉచిత విద్యుత్‌ కోసం రూ.36,899 కోట్లు ఖర్చు
– మొత్తం 58.29 లక్షల మందికి రూ.30 వేల కోట్ల మేర రుణాల మాఫీ
– రైతు బీమా కోసం రూ.6,861 కోట్ల ప్రీమియం చెల్లింపు
– తొమ్మిదేండ్లలో రూ.1,34,768 కోట్ల విలువైన ధాన్యం కొనుగోళ్లు (723 లక్షల మెట్రిక్‌ టన్నులు)