నవతెలంగాణ – డిచ్ పల్లి
వందేళ్లుగా తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం నిర్మించాలని ప్రజా ప్రభుత్వం సంకల్పించగా, శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్పత్రి
నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్‌గంజ్‌లో ఉండగా.. కొత్త ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. 2 వేల పడకల సామర్ధ్యంతో మొత్తం 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఆసుపత్రిని నిర్మించనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాలు కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించి నిర్మాణానికి పునుకుందని వివరించారు.రాబోయే వందేళ్ల అవసరాలకు తగినట్లు ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని, అందుకు అనుగుణంగా.. అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి డిపార్ట్‌మెంట్‌కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్‌కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒకే చోట అన్నిరకాల డయాగ్నసిస్ సేవలు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కూడిన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్లకు రూపకల్పన చేస్తున్నారని చెప్పారు.
అండర్ గ్రౌండ్ రెండు ఫ్లోర్లలో పార్కింగ్, ఆస్పత్రి సమీపంలో ఫైర్ స్టేషన్, ఆస్పత్రి చుట్టూ విశాలమైన రహదారులు, ఆసుపత్రి ప్రాంగంణంలో ఎక్కడికైనా ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు తిరిగే మార్గాలు, దివ్యాంగులు ఆస్పత్రిలోకి రాకపోకలు సాగించేందుకు వీలుగా ర్యాంప్‌లు, ఆస్పత్రిలోని రోగులకు సహాయకులుగా వచ్చే వారు సేద తీరేందుకు డార్మెటరీలు, క్యాంటీన్, మరుగుదొడ్లు వంటి సమస్త సౌకర్యాలతో అత్యాధునికంగా నిర్మించనున్నారు.