– ఎఫ్‌టీసీసీఐ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులో: జాయింట్ డైరెక్ట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ సంభాజీ చవాన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో భారతదేశ నూతన విదేశీ వాణిజ్య విధానం-2023 పాలసీని రూపొందించినట్టు జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ సంభాజీ చవాన్ తెలిపారు. ఈ విధానం రూపాంతరం చెందిందని, భవిష్యత్తుకు సంబంధించిందని అన్నారు.విశ్వాసం, ఎగుమతిదారులతో భాగస్వామ్యం సూత్రాలపై నిర్మించబడిందని అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్‌టీసీసీఐ) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్‌టీ) సహకారంతో హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ‘భారతదేశ కొత్త విదేశీ వాణిజ్య విధానం-2023’ అంశంపై గురువారం రాత్రి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం డిజిటలైజేషన్, ఎగుమతి ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్(ఈపీసీజీ), అమ్నెస్టీ స్కీమ్, ఇండియా ట్రేడ్ హబ్, రూపాయిని గ్లోబల్ కరెన్సీగా హైలైట్ చేసింది.
ఫారిన్ ట్రేడ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బి. పున్నంకుమార్ మాట్లాడుతూ పాలసీకి సంబంధించిన వివిధ అంశాలను పరిచయం చేశారు. కొత్త విదేశీ వాణిజ్య విధానం నుంచి ఎగుమతిదారులు పొందగలిగే ఆమ్నెస్టీ స్కీమ్ డిజిటలైజేషన్, వివిధ పథకాల సౌలభ్యాన్ని ఆయన వివరించారు. విదేశీ వాణిజ్య విధానంలో ప్రకటించిన క్షమాభిక్ష పథకం ప్రకారం, అడ్వాన్స్, మూలధన వస్తువులకు ఎగుమతి ప్రమోషన్ అధికార పథకం కింద ఎగుమతి బాధ్యతను చేరుకోవడంలో విఫలమైన వ్యాపారులు కస్టమ్స్ సుంకం, వడ్డీని చెల్లించడం ద్వారా క్లీన్‌గా రావచ్చని తెలిపారు. నూతన విదేశీ వాణిజ్య విధానం-2023ని విడుదల చేస్తున్నప్పుడు, అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్(ఏఏఎస్), ఎగుమతి ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్(ఈపీసీజీ), ఎగుమతి ఆబ్లిగేషన్(ఈఓ) డిఫాల్ట్ కేసులను క్రమబద్ధీకరించడానికి ఒక అమ్నెస్టీ స్కీమ్ యోచిస్తున్నట్టు ప్రకటించారని గుర్తుచేశారు. అమెజాన్ ఇండియా ప్రతినిధి కార్తీక్ ప్రసన్న మాట్లాడుతూ భారతదేశం తన వస్తువులు, సేవలను ఎగుమతి చేయడానికి ఈ-కామర్స్, డిజిటలైజేషన్ ప్రధాన అవసరాన్ని గురించి వివరించారు. ప్రపంచంలో ఈ-కామర్స్ వ్యాపారంలో చైనాతో పోల్చితే భారత్ 5-8శాతమే చేస్తోందని ఆయన పేర్కొన్నారు. చైనా కంటే దేశం చాలా వెనుకబడి ఉందని, ఈ-కామర్స్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షులు అనిల్ అగర్వాల్ స్వాగతోపన్యాసం చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన చాలా మంది యువ ఔత్సాహికులు తమ వస్తువులు, సేవలను ఎగుమతి చేసుకునేందుకు కొత్త విదేశీ వాణిజ్య విధానం అవకాశం కల్పించిందని అన్నారు. తెలంగాణ ఐటి ఎగుమతులు 2022లో మైలురాయిని సాధించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌టీసీసీఐ సీఈఓ కీర్తి అమోల్‌నరవణే, ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ బిజినెస్ రిలేషన్స్ కమిటీ కో-ఛైర్ రూపేష్ అగర్వాల్, పలువురు వాణిజ్యవేత్తలు తదితరులు పాల్గొన్నారు.