విద్యా వ్యవస్థపై నూతన ప్రభుత్వం దృష్టి సారించాలి

The new government should focus on the education system– యూటీఎఫ్‌ వ్యవస్థాపకులు అప్పారి వెంకటస్వామి వర్ధంతి సభలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-నల్లగొండటౌన్‌
విద్యావ్యవస్థ బాగు కోసం నూతన ప్రభుత్వం దృష్టి సారించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. యూటీఎఫ్‌ సంఘం వ్యవస్థాపకులు అప్పారి వెంకటస్వామి వర్థంతి సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని టీఎస్‌యూటీఎఫ్‌ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు అధ్యక్షతన ‘ఉపాధ్యాయ ఉద్యమం- నేటి సవాళ్లు’ అంశంపై ఆదివారం సదస్సు నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పదేండ్లకాలంలో పాఠశాల విద్య పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ప్రమాణాలు తగ్గిపోయాయని విమర్శించారు. నూతన ప్రభుత్వం విద్యాశాఖపై దృష్టి కేంద్రీకరించి, మెరుగైన విద్య కొరకు విద్యాశాఖను పునర్‌సమీక్షించాలని కోరారు.
అప్పారి వెంకటస్వామి లాంటి నాయకులు నిస్వార్థమైన సేవలందించడం వల్ల నేడు ఉపాధ్యాయులు మెరుగైన వసతులు అనుభవిస్తున్నారని తెలిపారు. టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.జంగయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నూతన విద్యావిధాన పత్రం విద్యను కాషాయీకరించే విధంగా ఉందన్నారు. కవి ఎగ్బాల్‌, రోమిల్లా థాపర్‌ రచనలను, భగత్‌సింగ్‌ లాంటి వీరుల చరిత్రను పాఠ్యపుస్తకాల నుంచి తొలగిస్తున్నారని విమర్శించారు. సభ అనంతరం ప్రాథమిక పాఠశాలలో ఎన్‌రోల్‌మెంట్‌ పరిస్థితిపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి తీసుకోవాల్సిన కర్తవ్యాలపై చర్చించారు. కార్యక్రమంలో టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శులు ఎం.రాజశేఖర్‌రెడ్డి, జి.నాగమణి, రాష్ట్ర మైనారిటీ గురుకులాల అధ్యక్షులు జి.రాంబాబు, టీఎస్‌ యూటీఎఫ్‌ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశం, ఉపాధ్యక్షులు శ్రీనివాసచారి, అరుణ, కోశాధికారి శేఖర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు సీహెచ్‌.అరుణ, జిల్లా కార్యదర్శులు రామలింగయ్య, శ్రీనివాస్‌రెడ్డి, జి.నర్సింహ, రాజు, విజయలక్ష్మి, మధుసూదన్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు సరళ, గోవర్ధన్‌, జిల్లా పౌరస్పందన వేదిక అధ్యక్షులు అంజిరెడ్డి, తాప్రా అధ్యక్షులు శ్యాంకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.