వచ్చే ఐదేండ్లూ మండే కాలమే..ఐరాస

జెనీవా : 2023 నుంచి ఐదేండ్ల పాటు అంటే 2027 వరకు అత్యంత వేడిగా వుండే కాలంగా నమోదు కానుందని ఐక్యరాజ్య సమితి బుధవారం హెచ్చరించింది. కాలుష్య కారక వాయువులు, ఎల్‌నినో ప్రభావం ఈ రెండూ కలిసి ఉష్ణోగ్రతలను విపరీతంగా పెంచేస్తున్నాయని పేర్కొంది. పారిస్‌ వాతావరణ ఒప్పందాల్లో నిర్దేశించిన మరింత బృహత్తరమైన లక్ష్యాన్ని అంతర్జాతీయంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు త్వరలోనే అధిగమించనున్నాయి. రాబోయే ఐదు సంవత్సరాల్లో ఒక సంవత్సరం కచ్చితంగా అలా వుంటుందనడానికి మూడింట రెండు వంతుల అవకాశాలు వున్నాయని ఐక్యరాజ్య సమితి వాతావరణ సంస్థ తెలిపింది. ఇప్పటివరకు నమోదైన 8 అత్యంత వేడిమి సంవత్సరాలు 2015-2022 మధ్యలోనే వున్నాయి. అయితే, వాతావరణ మార్పులు పెరుగుతుండడం వల్ల ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరుగుతాయని అంచనా వేశారు.