అమృతం కురవని రాత్రి

The night of nectar pouringరాత్రి పదకొండయ్యింది. పొద్దటినించీ, ఇంటి పని, ఆఫీస్‌ పని, పిల్లల లెక్కల పరీక్షకు హెల్ప్‌ చెయ్యడం వీటితో తల దిమ్మెక్కిపోయింది. ఈ మధ్య సివియర్‌ ఇన్సోమ్నియాతో రోజుల తరబడి నిద్రలేక ఆరోగ్యం అంతంత మాత్రంగా వుంది. ఇంక లాభం లేదని లాప్‌టాప్‌ మూసేసి నిద్ర మాత్ర వేసుకున్నా. మరుసటి రోజు గడవాలంటే తప్పదు మరి. అదిచ్చే రెండుగంటల నిద్ర అనబడే మత్తు, దాని వల్ల వచ్చే సైడ్‌ ఎఫెక్ట్స్‌ కంటే మంచిదా అని ఎప్పుడూ సందిగ్ధమే. అయినా ఎట్లాగూ త్వరలోనే మానేస్తా. అదిచ్చే మత్తు అయిదారు రోజుల్లోనే అయిదు గంటల నించీ రెండు గంటలకు పడిపోయింది. అస్సలు పని చేయకపోవడానికి ఇంక ఎక్కువ రోజులు పట్టదు.
ఈ ఆలోచనలను పక్కన పెట్టి గీతాంజలి గారి ‘ఆమె అడవిని జయించింది’ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకొని, కిరణ్‌ నిద్రని డిస్టర్బ్‌ చెయ్యడమెందుకని కింద బెడ్‌రూమ్‌లోకి పోయిన. సాయంత్రం నించీ కురుస్తున్న కుండపోత ఆగిపోయి సన్న జల్లుతో బయటంతా చల్లగా ఉంది. నిద్ర కోసం ఎదురుచూడకుండా బెడ్రూం కిటికీ తలుపులు తీసి, బెడ్‌ హెడ్‌బోర్డ్‌కి దిండుపెట్టుకొని, పుస్తకం వొళ్లో పెట్టుకొని, మంచం మీద కాళ్లు జాపి కొంచం జారి కూర్చోని చదవడం మొదలు పెట్టిన. కిటికీ లోంచి చల్లగాలి, తనతో పాటు మధు మాలతి అలియాస్‌ రాధా మాధవం అలియాస్‌ రంగూన్‌ క్రీపర్‌ పువ్వుల కమ్మని వాసనను మోసుకొస్తుంది. అది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నించి వస్తున్న నాచు వాసన నాకు రాకుండా జాగ్రత్తపడుతోంది.
ఎవరో కొట్టి లేపినట్టు ఠక్కున లేచిన. ఎప్పుడూ కూర్చున్న పొజిషన్‌లోంచి మారి మంచానికి అనించిన దిండు కింద పెట్టి కాళ్లు జాపి పడుకున్నానో, ఎప్పడు నిద్ర పట్టిందో గుర్తు లేదు. లైట్లన్నీ ఏసే వున్నారు. టైం ఒకటిన్నర అవుతుంది. బయట ఉరుముల శబ్దంతో పోటీ పడుతున్న వర్షం. కానీ ఇంకేదో వినిపిస్తూంది. బెడ్రూంలోంచి బయటకొస్తూంటే ఎవరో బాధతో మూలుగుతున్నట్టు వినిపించింది. హాల్లోకి ఉరికి పోయి చూస్తే మెయిన్‌ డోర్‌ తెరిచి ఉంది. కార్‌ పార్కింగ్‌లో లైట్‌ వెలుతురులో ఒక నిండు గర్భిణీ బాధతో అరుస్తూ మూలుగుతూ ఎక్కడ్నో చూస్తూ కనబడింది. బక్కగా, ఛామన ఛాయకూ, నలుపుకూ మధ్య రంగులో ఆకర్షణీయంగా ఉంది. చిన్న వయసే. అంత నీరసంలో కూడ తన కళ్ళు వింతగా మెరుస్తున్నాయి. అక్కడ తడి చూస్తే అర్థమయ్యింది, ఇంక నిమిషాల్లో ప్రసవమౌతుందని. ఏమో, కౌముది పుట్టినప్పుడు గంటలో అయిపోతుందని లేబర్‌ రూమ్‌కు తీసుకుపోయినాక, 13 గంటల భయంకరమైన పురిటి నొప్పుల తర్వాత ప్రసవమయింది కదా. తన అదృష్టం ఎట్లుందో.
కిరణ్‌ తనకి సహాయం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. నా అడుగుల చప్పుడు విని ఒక్కసారి వెనక్కి చూసి ఎందుకు నిద్రలేచినవ్‌ అన్నట్టు ప్రేమా, విసుగూ కలిసిన ఒక చూపు విసిరినడు. ఏందో ఈయన, కొంపలు మునుగుతున్నా సరే నాకు నిద్ర పట్టిందంటే అస్సలు డిస్టర్బ్‌ చెయ్యడు. పిల్లలు డిస్టర్బ్‌ చేస్తే వాళ్ల పని అయిపోయినట్టే. ఒక్కోసారి నాకే విసుగొచ్చి పర్లేదు నానీ అని సర్దుతుంటా. పక్కింటి వాళ్లు గాఢనిద్రలో వున్నారో లేక ఏసీ చప్పుడుకు వినపడలేదో కానీ బయటకు రాలేదు. తనకి బాధ ఎక్కువైనట్టుంది, మూలుగులు అరుపులు ఇంకా ఎక్కువైనరు. పడుకునే ముందు చదివిన పుస్తకం వల్లనేమో తనని చూస్తుంటే ఏవేవో ఆలోచనలు వచ్చినరు. అసలు ఇంత చిన్న వయసులో తను ఎందుకు తల్లి కావాలనుకుందో. తనకి మాతృత్వం అంటే అంత ఇష్టమా, వంశాన్ని నిలబెట్టడానికి తన వాళ్ళు చేసిన కుట్రనా, అపురూపమైనదమ్మ ఆడజన్మ లాంటి పాటల వలలో తను కూడా పడిపోయి ఆ జన్మను ఇంకొంచం సార్థకం చేసుకోవాలనుకుందా? లేదా క్షణికావేశంలో చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తోందా? ఆ ఆవేశంలో ఆడ మగ ఇద్దరూ సుఖపడినా, కష్టాలు మాత్రం ఆడవాళ్లకే కదా. అబార్షన్‌ కూడా కష్టమైంది, రిస్క్‌తో కూడుకున్నదే.
నా ఆలోచనల్లో నేనుంటే కిరణ్‌ పైన లైబ్రరీ రూమ్‌లో తనకు పరుపు ఏర్పాటు చేసి వచ్చినడు. కార్‌ పార్కింగ్‌ అంతా తడి. క్షణాల్లో ప్రసవమయ్యేట్టుంది. ఎవరికీ ఫోన్‌ చేసే సమయం కూడా లేదు. తను వివరాలు చెప్పే పరిస్థితుల్లో లేదు. మేమిద్దరం కలిసి గబగబా తనని లైబ్రరీ రూంలో పండబెట్టినం. ఎవరో, ఎక్కడినించి వచ్చిందో అని చూడకుండా ఆపదలో సహాయం చేస్తుంటే కూడా తను మావైపు కోపంగా అసహనంగా చూస్తుందెందుకో. ఏమోలే ఈ టైంలో ఎమోషన్స్‌ని హార్మోన్స్‌, నొప్పులూ కంట్రోల్‌ చేస్తాయి కదా అని సర్ది చెప్పుకున్నా. తనకు ఏకాంతం కావాలేమోనని తలుపు దగ్గరగా వేసి ఇద్దరం కిందికొచ్చినం. నా నిద్ర మాత్ర అప్పుడు పని చేయడం మొదలు పెట్టిందనిపించి, తూలకముందే బెడ్‌ మీద పడుకున్నా.
మళ్లీ ఆలోచనలు. అసలు ప్రతి స్త్రీ ఇష్టంగానే మాతృత్వాన్ని కోరుకుంటుందా లేక సంఘానికి భయపడి తల్లవుతుందా? మాతృత్వం స్త్రీలను మరింత కట్టి పడేస్తుంది కదా, అయినా ఎందుకు తల్లి కావాలని అంత ఉవ్విళ్లూరుతారు. డాక్టర్ల చుట్టూ తిరిగి మంట పుట్టించే ఇంటర్నల్‌ స్కానింగ్లూ, మాత్రల సైడ్‌ఎఫెక్ట్‌లూ, రోజంతా అలిసిపోయినా రోజులు లెక్కపెట్టుకొని యాంత్రిక కలయికలూ, ప్రెగెన్సీ టెస్టులూ, నిరాశలూ, వత్తిళ్లూ ఇవన్నీ ఎందుకు భరిస్తారు. మాతృత్వం స్త్రీకి వరమా, శాపమా? శాపం సంగతేమో తెలియదు కానీ వరం కానే కాదు. వరమనుకోవడం, వరమని స్త్రీలను బ్రెయిన్‌ వాష్‌ చేయడం ఎంత తప్పు. అది పిల్లల్ని కనమని పరోక్షంగా ఒత్తిడి పెట్టడం కాదా? పిల్లలు పుట్టని స్త్రీలను, శారీరక లేదా మానసిక బాధల వల్ల, ఇతర ఇబ్బందులు నిర్బంధాల వల్ల పిల్లలు కనని, కనలేని వాళ్లను అవమానించడం కదా. మాతృత్వం ఒక్కోసారి శాపం కావొచ్చనీ, ప్రసవంలో ప్రాణాలు పోవచ్చనీ పైన రూమ్‌లో ఉన్న తనకు తెలుసా. ఏందీ పిచ్చి ఆలోచన అని తిట్టుకుంటూ నిద్రపోయిన.
ఏదో టక్కుటక్కుమని చప్పుడొస్తుంటే మెలకువ అయ్యింది. టైం చూస్తే 5:55. అమ్మో లేవడం అరగంట లేట్‌ అయ్యింది, 6:45 లోపల టిఫిన్‌, వంట ఎట్ల అయితుంది. రాత్రి కూరగాయలు కూడా తరుక్కోలేదు. నిద్ర పట్టదు కాబట్టి అలారం పెట్టుకొనే అలవాటు లేదు. దాని వల్ల ఇట్ల అప్పుడప్పుడూ ఇబ్బంది పడుతుంటా. వొళ్లు నొప్పులు, నీరసం, జ్వరంతో తూలుకుంటూ తలుపు తెరిస్తే కిరణ్‌ ఆలుగడ్డలు తరుగుతూ కనిపించినడు. ఈ రోజు నేను వంట చేస్తాన్లే బుజ్జీ అని బలవంతం చేస్తే డోలో వేసుకొని పడుకున్న కానీ వుండబుద్దవలేదు. కొంచం సేపు అయినాక లేచి వంట, బాక్సుల కార్యక్రమం పూర్తి చేసి ఆఫీస్‌కి రెడీ అయి కిందకొచ్చేవరకు, ఇల్లంతా ఖాళీ. అందరూ వెళ్లిపోయినరు. ఇంత హడావుడిలో తన గురించి కిరణ్‌ని అడగనేలేదు, కిరణ్‌ కూడా కూర చేయడం, పిల్లల యూనిఫామ్‌ లు ఇస్త్రీ చేయడంలో లేట్‌ అయ్యి మాట్లాడే టైం లేక కాలేజ్‌కి పరిగెత్తినడు.
ఏవో చెడు ఆలోచనలు వస్తుంటే తనను చూడడం పోస్ట్‌పోన్‌ చేసి ఏదో కొంచం టిఫిన్‌ తిని , టీవీ లో శ్రీరంగం గోపాలరత్నం గారి అన్నమాచార్య కృతులు వింటూ టీ తాగి, క్యాబ్‌ బుక్‌ చేసి బ్యాగ్‌ సర్దుకున్నా. ఇంక తప్పదని, పైకి పోయి లైబ్రరీ రూమ్‌ తలుపు తెరిచి తనని చూస్తుంటే, ఫోన్‌ మోగింది. క్యాబ్‌ ఎంట్రీకి మైగేట్‌ యాప్‌ పంపిన అప్రూవల్‌ అది. అబ్బా ఈ క్యాబ్‌ ఎప్పుడు కరెక్ట్‌ టైంకి రానే రాదు కానీ రెడీగా లేనప్పుడు మాత్రం వెంటనే వస్తుంది అని తిట్టుకుంటూ గబగబా కిందికి పోయి తాళమేసి క్యాబ్‌ ఎక్కి కూర్చున్న.
ఆఫీస్‌కి పోతుంటే పాలిస్తూ ప్రశాంతంగా నా వైపు కృతజ్ఞతగా చూసిన తన చూపే గుర్తొస్తుంది. నిన్నటికి ఈ రోజుకి తన చూపులో ఎంత తేడా. మాతృత్వ భావన గర్భం దాల్చగానే కలుగుతుందా లేక పిల్లలు పుట్టినాక కలుగుతుందా. ఏమో మొత్తానికి తను క్షేమంగా వుందని తెలిసినాక నాకెంత హాయిగా ఉందో. ఎంత పిల్లి అయినా తను కూడా ఒక తల్లే కదా. ఆరు నెలల కిందట శ్రీరామ నవమి రోజే కదా మూడు పిల్లల్ని కనింది. మళ్లీ అప్పుడే అయిదు. వాటిలో ఒకటి మృత శిశువు.
ఆమ్మో, పిల్లినైనా కాకపోతిని అని ఇంక అస్సలు పాడకూడదు. మగ పిల్లినైనా అనీ పాడితేనేమో రాగం కుదరదు.
ఇంతకీ ఇంటి నించి వెళ్లిపోయిన పిల్లి మళ్లీ వచ్చి పిల్లల్ని కంటే పురుడొస్తుందా?
– మాలతి పల్లా
90103 96655