మేయర్‌పై అవిశ్వాస తీర్మానం..

Motion of no confidence in the mayor– కలెక్టర్‌కు బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల వినతిపత్రం
నవతెలంగాణ – కరీంనగర్ 
బీఆర్ఎస్ పార్టీ తరపున మేయర్ గా పదవిని గెలుచుకుని, ఆ తరువాత బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 29 మంది కార్పొరేటర్లు, మరో ఆరుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లు కలిపి మేయర్ వై. సునీల్ రావుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. సోమవారం బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి ఈ మేరకు వారు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా మాజీ సివిల్ సప్లై చైర్మన్ రవీందర్ సింగ్, కార్పొరేటర్లు రాజేందర్ రావు మహేష్ గందె మాధవి, కార్పొరేటర్లు మాట్లాడుతూ.. వై. సునీల్ రావు మేయర్‌గా తన పదవిని ఉపయోగించుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. నిధులను దుర్వినియోగం చేశారని, బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఆయన బీజేపీలోకి చేరడం ప్రజల విశ్వాసానికి తూట్లు పొడిచినట్లు అన్నారు. మేయర్ సునీల్ రావుపై అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించి, తక్షణ చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. మేయర్ చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపాలన్నారు. మేయర్ మెజారిటీ కోల్పోయి కూడా పదవిలో కొనసాగడం చట్టానికి విరుద్ధమని, మున్సిపల్ చట్టం ప్రకారం అతడిని తొలగించాలని వారు విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందుకున్న కలెక్టర్ పమేలా సత్పతి, ఈ విషయాన్ని అధికారికంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాము అని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కార్పొరేటర్లు పాల్గొన్నారు.