మణుగూరు- కొత్తగూడెం బస్సు సర్వీసుల సంఖ్య పెంచాలి

– మణుగూరు డిపో మేనేజర్‌ తేజావత్‌ స్వామికి వినతి
నవతెలంగాణ-మణుగూరు
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మణుగూరు- కొత్తగూడెం బస్‌ సర్వీసుల సంఖ్యను పెంచాలని మణుగూరు డిపో మేనేజర్‌కి ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో వినతి పత్రం శనివారం డిపో మేనేజర్‌ తేజావత్‌ స్వామికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర కార్యదర్శి ఎస్‌డి నాజర్‌ పాషా మాట్లాడుతూ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసుల సంఖ్య లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ బస్సులలో సీటు దొరికింది అంటే వాళ్లు అదష్టవంతులనే చెప్పాలన్నారు. మధ్యాహ్నం సమయాలలో మణుగూరు బస్సు కోసం కొత్తగూడెం బస్టాండ్‌ లో మూడు బస్సులకు మించి ప్రయాణికులు వేచి ఉంటే ఆ సమయంలో ఒక బస్సు వస్తే ఆ వచ్చిన బస్సు స్టాండింగ్‌ ఉంటే వేచి ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. ఈ సమయంలో ఏదైనా మణుగూరు బస్సు వస్తే చంటి పిల్లలను సంకనెత్తుకుని బస్సుల వద్దకు పరిగెత్తుతున్న తల్లులను చూస్తే మనసుకు బాధ కలుగుతుందన్నారు. ఇక మణుగూరు బొగ్గు గనులలో పని చేస్తూ కొత్తగూడెం నుండి ప్రతిరోజు రాకపోకలు కొనసాగించే సింగరేణి కార్మికుల వెతలు వర్ణనాతీతం అన్నారు. కారణాలు ఏమైనప్పటికీ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మణుగూరు డిపో నుండి బస్సులు నడపలేకపోతున్నారని, ఆర్టీసీ యాజమాన్యంపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రయాణికుల రద్దీతో ఈ రూట్లో ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు కూడా అలసిపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టియు జిల్లా నాయకులు మిడిదొడ్ల నాగేశ్వరరావు, మంగీలాల్‌, ఉప్పల శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.