గ్రూప్‌ 2, 3 ఉద్యోగాల సంఖ్య పెంచాలి

– ఇష్టాగోష్టిలో మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
గ్రూప్‌ 2, 3 ఉద్యోగాల సంఖ్య పెంచాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లోని డిప్యూడీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చాంబర్‌కు వచ్చిన ఆయన…విక్రమార్క అందుబాటులో లేకపోవడంతో తనను కలిసి విలేకర్లతో మాట్లాడారు. గ్రూప్‌1 విషయంలో జీవో 55 తీసేసి, కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా జీవో నెంబర్‌ 29 తెచ్చిందన్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు 1:50 పద్దతిలో నియామకం చేపట్టారని తెలిపారు. ఉమ్మడి ఏపీలో వైఎస్సార్‌ ప్రభుత్వం, ఏపీలో వైఎస్‌. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం 1:100 పద్దతిలో నియామకాలు చేపట్టిందని గుర్తు చేశారు. 2015లో తాము, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నోటిఫికేషన్లకు, సప్లిమెంటరీ నోటిఫికేషన్లు ఇచ్చి అదనపు ఉద్యోగాలిచ్చామని తెలిపారు. అప్పుడు తలెత్తని సమస్యలు ఇప్పుడెందుకు వస్తున్నాయని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.