– టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయాలు
– అన్ని స్థానాలు మనవే.. అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తితో పని చేయాలి
– ఇందిరమ్మ గ్రామ కమిటీల ఏర్పాటు
– 8,9 తేదీల్లో ఉమ్మడి జిల్లాల కమిటీలతో సమావేశాలు
– 11,12,13 తేదీల్లో పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మంత్రుల సమీక్షలు
– రాష్ట్రం నుంచి సోనియా గాంధీ పోటీకి తీర్మానం
– త్వరలో కార్పొరేషన్లకు చైర్మెన్లు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం పిలుపునిచ్చింది. అసెంబ్లీ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకుని 17 ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరింది. ఆరు గ్యారంటీలు పకడ్బంధీగా అమలు చేసేందుకు ఇందిరమ్మ గ్రామ కమిటీలు వేయాలని నిర్ణయించింది. కష్టపడి పని చేసిన వారిని గుర్తించి, వారికి సముచిత గౌరవాన్ని ఇచ్చేందుకు ఏఐసీసీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామని భరోసానిచ్చింది. వీలైనంత త్వరగా వివిధ కార్పొరేషన్లకు చైర్మెన్లు నియమించాలని నిర్ణయించి, అందుకు సంబంధించిన జాబితాను సిద్ధం చేసే బాధ్యత కొత్త ఇన్‌చార్జి దీపాదాస్ మున్షికి అప్పగించింది. ఆ జాబితాను అధిష్టానానికి పంపించి అక్కడ ఆమోదం తీసుకోనుంది. కార్యకర్తలను, నాయకులను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు ఈనెల 8, 9 తేదీల్లో ఉమ్మడి జిల్లా కమిటీలతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కావాలని నిర్ణయించింది. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాలకు నియమించిన ఇన్‌చార్జీ మంత్రులు కూడా ఈనెల 11, 12,13 తేదీల్లో సమీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో నిర్వహించిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీకి అభినందనలు తెలుపుతూ, తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో సమన్వయంతో పని చేసిన మాణిక్ రావు ఠాక్రేను అభినందిస్తూ, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ తీర్మానాలు చేశామని తెలిపారు. ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి, వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత పార్టీ తీసుకుంటుందన్నారు. బోర్లా పడి బొక్కలు విరిగినా బీఆర్‌ఎస్‌కు బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడవకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారని విమర్శించారు. చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆర్‌ఎస్ దోచుకుందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈనెల 20 తర్వాత క్షేత్రస్థాయి పర్యటనల్లో పాల్గొంటానన్నారు. ‘బీజేపీ అధ్యక్షులు, జి కిషన్‌రెడ్డికి ఆదాయం తగ్గినట్టుందనీ, అందుకే కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్నారని ఎద్దేవా చేశారు. నాడు స్వయంగా నేను సీబీఐ ఎంక్వయిరీ కోరినప్పుడు ఏం చేశారు. దొంగను గజదొంగకు పట్టించాలంటూ కిషన్‌రెడ్డి అడుగు తున్నాడు. కాళేశ్వరం అవినీతిపై మేం జ్యుడీషియల్ విచారణ చేసి తీరుతాం. బీజేపీ, బీఆర్‌ఎస్ తోడు దొంగలు. ఇద్దరూ కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు. పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం చేశారు’ అని విమర్శించారు.
టీమ్ వర్క్ ఉండాలి : ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి
కాంగ్రెస్‌లో మరింత టీమ్ వర్క్ పెరగాలని ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి సూచించారు. ఇక ముందు చాలా ఎన్నికలు రాబోతు న్నాయనీ, అందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు కావడం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో కలిసి పని చేస్తే మంచి ఫలితా లొస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు పదేండ్లు కష్టపడ్డారని కొనియాడారు. హైదరాబాద్‌లో బోగస్ ఓట్లు చాలా ఉన్నాయన్నారు. నాయకులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
దశాబ్దం తర్వాత గొప్ప అవకాశం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
‘దశాబ్ద కాలం తర్వాత మనకు ఇదో గొప్ప అవకాశం. అనేక కష్టనష్టాలను భరించి అధికారంలోకి వచ్చాం. యువత ఎన్నో కలలు కని రాష్ట్రం కోసం పోరాటం చేసింది. ప్రజలు విశ్వాసంతో మనం వారికి ఇచ్చిన హామీలను నమ్మి మనల్ని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన పని చేస్తున్న వారంతా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలి. గత ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారు. ఒకవైపు ఆర్థికంగా బలోపేతం కావాలి. మరోవైపు మనం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. రాష్ట్రంలో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టు వచ్చింది. ఒక స్వాతంత్య్రం వచ్చినట్టు ప్రజలు ఫీల్ అవుతున్నారు. కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఇస్తాం’ అని భరోసా ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉచిత బస్ సౌకర్యంతో ఆరున్నర కోట్ల మంది ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. ఈనెల 6న ఆటో డ్రైవర్ల ధర్నా వెనుక బీఆర్‌ఎస్ ఉందని విమర్శించారు. ఉచిత బస్ సౌకర్యాన్ని బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు ఎంతో శ్రమించారని గుర్తు చేశారు. వారి త్యాగాల ఫలితంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. వారి కష్టానికి తగిన ఫలితం ఉంటుందని చెప్పారు. జాతీయ స్థాయి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ మరింత బలహీన పడుతుందని చెప్పారు. అనంతరం పార్టీ ఉపాధ్యక్షులు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. a