వన మహోత్సవంలో మొక్కలు నాటి లక్ష్యాన్ని పూర్తి చేయాలి..

Plantation of saplings during Vana Mahotsavam– యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కె జండాగే..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
వన మహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ సిబ్బందిని జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే ఆదేశించారు. సోమవారం నాడు కలెక్టరేటు సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ది శాఖకు చెందిన అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు జరిగిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 75 వ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ది శాఖకు కేటాయించిన 11 లక్షల 28 వేల మొక్కలకు గాను ఇప్పటి వరకు 4 లక్షల 77 వేల మొక్కలు నాటడం జరిగిందని, వర్షాలు కురుస్తున్నందున సమయం వృధా కాకుండా వెంటనే మిగతా లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అవెన్యూ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేన్, ప్రభుత్వ సంస్థలలో మొక్కలు పెద్ద ఎత్తున నాటాలని, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం ఉపయోగపడే విధంగా మునగ, చింతపండు, కరివేపాకు తదితర మొక్కలు నాటాలని, రైతులకు కావలసిన ఉద్యానవన పండ్ల తోటలకు సంబంధించి రైతులకు కావలసిన మొక్కలు నాటించాలని సూచించారు. వన మహోత్సంలో పెద్ద మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్క బ్రతికే విధంగా సంరక్షణ చర్యలు తీసుకోవాలని, జియో ట్యాగింగ్ చేపట్టాలని ఆదేశించారు. నర్సరీల పరిరక్షణ ముఖ్యమని, నర్సరీలలో కలుపు రాకుండా చూడాలని, షిఫ్టింగ్ గ్రేడింగ్ నిర్వహించాలని సూచించారు. మండల స్పెషల్ ఆఫీసర్లు, జిల్లా అధికారులు తరచూ మొక్కల పెరుగుదల, సంరక్షణపై తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి ఎంఎ కృష్ణన్, అడిషనల్ డిఆర్డిఓ సురేశ్ పాల్గొన్నారు.