
– గొంగిడి సునీతకు హైటెక్ విజయాన్ని అందించాలి
– బండా ప్రకాష్ ముదిరాజ్
– ఘనంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆత్మీయ సమ్మేళనం
నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్ : తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకోవాలి అని, అది బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం, మండలంలోని వంగపల్లి లో ముదిరాజ్ సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తెచ్చుకున్న తెలంగాణను గొప్పగా మలుచుకోవాలంటే మనమందరం కలిసికట్టుగా ఉండాలి అన్నారు. కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ రాష్ట్రం గొప్పగా ప్రగతి సాధిస్తుందని అన్నారు. తెలంగాణ అనేక రంగాలలో నెంబర్ వన్ సాధించిందని కేంద్రం పార్లమెంటులో ప్రకటించారని అన్నారు. కేంద్ర మంత్రులు అనేక అవార్డులు కూడా ఇచ్చారని అన్నారు. తెలంగాణలో పేదరికం పోవాలి, సబ్బండవర్ణాలు అభివృద్ధి చెందాలి అనేది కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. ఏ సామాజిక వర్గానికి ఏ సంక్షేమ పథకాలు అవసరమో కెసిఆర్ కు తెలుసు అన్నారు. ఆర్థికంగా అన్ని కులాలు బాగుపడాలని అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారని అన్నారు. డిసిసిబి చైర్మన్ రెడ్డి మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో 25 ముదిరాజు సంఘ భవనాలు మంజూరు చేసాము అని, దానిలో కొన్ని నిర్మాణాలు కూడా పూర్తి అయినాయి అన్నారు. రాబోయే కాలంలో ఇంకా కొన్ని ముదిరాజ్ భవనాలను మంజూరు చేస్తామన్నారు. యాదగిరిగుట్టలో ముదిరాజ్ సంఘ భవనానికి కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్సీ, శాసన మండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ మాట్లాడుతూ భువనగిరి జిల్లా కేంద్రంలో ముదిరాజ్ భావనాన్ని నిర్మిస్తామని తెలిపారు. చాలా జిల్లా కేంద్రాల్లో ముదిరాజ్ భవనాలు ఉన్నాయి భువనగిరిలో కూడా కట్టుకుందాం అన్నారు. గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సహకారంతో యాదగిరిగుట్ట లో కూడా ముదిరాజ్ భవనాన్ని నిర్మించుకుందాం అన్నారు. ముదిరాజ్ ముద్దుబిడ్డలు పండుగ సాయన్న, పోలీస్ కిష్టన్న ల విగ్రహాలను బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం ముదిరాజు అభివృద్ధికి కృషి చేస్తుందని అందరూ బిఆర్ఎస్ వెంటే ఉండి, గొంగిడి సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హరి శంకర్ గౌడ్, కొలుపుల హరినాథ్ ముదిరాజ్, మాజీ ఎంపీపీ బలపాటి సత్యనారాయణ, ప్రొఫెసర్ దినేష్ కుమార్, జిల్లా అధ్యక్షుడు సంజయ్ బాబు, పల్లెపాటి బాలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్, వాకిటి కృష్ణ, పల్లెపాటి మాధవులు తదితరులు పాల్గొన్నారు.