ఆయిల్ ఫామ్ లక్ష్యాన్ని పూర్తి చేయాలి..

– ఉద్యాన సాగు ఎక్కువ జరగాలి.
– జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్
నవతెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో ఉద్యాన పంట సాగు ఎక్కువ జరగాలని ఆదిశగా అధికారులు నిబద్ధతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఆయిల్ ఫామ్ లక్ష్యం 2500 ఎకరాలు ఉన్నదని ఆదిశగా వ్యవసాయ శాఖ ఏ.ఈ. ఓ లతో కలసి లక్ష్యం పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో 2300 ఎకరాలను గుర్తించామని మిగతా ఎకరాలను గుర్తించాలని సూచించారు. ఉద్యాన రైతులకు ఆదర్శ రైతులతో  పంట సాగు పై టెక్నాలజీ విస్తరింపచేయలని సూచించారు.  ఎండు మిర్చి లో నర్సరీ దశ నుండి పంట కాలం పూర్తి అయ్యేవరకు రైతులకు సాంకేతిక సలహాలు అందించాలని ఆదేశించారు. జిల్లా, మండల స్థాయిలలో పనిచేస్తున్న అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ సమన్వయంతో కలసి పనిచేయాలని సూచించారు. మామిడి లో అధిక సాంద్ర పద్ధతి, మార్కెటింగ్ పై రైతులకు వివరించాలని అన్నారు.
పంటల నమోదు పక్కాగా ఉండాలి.
విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా చూడాలి.
వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపట్టాలి.జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
జిల్లాలో పంటల నమోదు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.జిల్లాలో నకిలీ విత్తనాలు,ఎరువులు అలాగే పురుగుల మందుల శాంపిల్స్ సేకరించి వాటి ఫలితాల ఆధారంగా తగు చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిదంగా ప్రతి సర్వే నెంబర్ ఆధారంగా పంట వేసిన వెంటనే పంట నమోదు చేపట్టాలని అన్నారు. జిల్లాలోని రైతులకు త్వరలో ఋణమాఫి  ఉన్నందున ప్రభుత్వ మార్గదర్శకాలు అందిన వెంటనే వ్యవసాయ, బ్యాంక్  అధికారులతో సమావేశాలు చేపట్టి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రధాన్యట్స్ ఇస్తుందని వ్యవసాయ అధికారులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.  జిల్లాలో ఎక్కడకూడా ఎరువులు, విత్తనాల కొరత రాకుండా చూడాలని అలాగే పంటలకు సరిపోయే విదంగా తగినంత ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతు వేదికల ద్వారా రైతులకు పంటలసాగు విధానంపై శాస్త్ర సాంకేతిక సలహాలు అందించాలని అలాగే రైతులకు సమర్థవంతంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ సీజన్ మొదలైనందున వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని అలాగే నకిలీ విత్తనాలు, ఎరువులు రైతులు దళారుల నుండి కొనుగోలు చేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఫెర్టిలైజర్స్ pos మిషన్ ద్వారానే సేల్స్ చేయాలని సూచించారు.  జిల్లాలో ప్రధాన పంటలైన వరి, ప్రత్తి,మిరప, మామిడి, నిమ్మ వంటి పంటలపై రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన అధికారులతో ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తామని పూర్తి స్థాయి నివేధికాలతో రావాలని ఈ సందర్బంగా తెలిపారు.  ఈ సమావేశంలో ఏ. డి.ఏ శ్రీధర్ రెడ్డి, డి.హెచ్.ఓ నాగయ్య, ఏ.డి.ఏ లు సంధ్యారాణి, జగ్గూ నాయక్, ఉద్యాన అధికారులు కె. జగన్, వి.స్రవంతి, అనిత, బి.రవినాయక్, ఏ.ఓ లు, ఏ.ఈ. ఓ లు తదితరులు పాల్గొన్నారు.