నవతెలంగాణ – దుబ్బాక రూరల్
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టీఎస్ యుటీఎఫ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తప్పెట్ల యాదగిరి అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ దుబ్బాక మండల శాఖ ఆధ్వర్యంలో దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట , దుంపలపల్లి హై స్కూల్, మండల పరిధిలోని తిమ్మాపూర్, పెద్దగుండవెల్లి, పద్మనాభునిపల్లి ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను బుధవారం సందర్శించారు. అనంతరం యుటిఎఫ్ మండల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.ఈ సంద్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి టీఎస్ యుటీఎఫ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తప్పెట్ల యాదగిరి మాట్లాడుతూ కేంద్ర కేబినెట్ ఈనెల 24వ తేదీన యునైటెడ్ పెన్షన్స్ స్కీం ను ఉద్యోగులందరికీ అమలు చేస్తామని తెలుపుతూ ఆమోదం తెలిపిందని, ఈ విధానం ఉద్యోగులకు సరైనది కాదన్నారు. అలాగే పెన్షన్ విధానంలో పేర్లు మార్చడం సరైనది కాదని ఉద్యోగులందరికీ మేలు చేసే పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక విద్యారంగ సమస్యలు పరిష్కరించి, 5 డి ఏ లు ప్రకటించాలని కోరారు. పిఆర్సి నివేదిక బహిర్గత పరిచి సంఘాలతో చర్చలు జరిపి 30 శాతం ఫిట్మెంట్ తో పిఆర్సి అమలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి ఎం. కృష్ణ, దుబ్బాక మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొంబాయి శీను, ఏ . రాములు, జిల్లా కమిటీ సభ్యులు ఎండి, ఇస్మాయిల్, ఎన్. యాదయ్య, సక్రియ, రాజేశం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.