ఒలింపిక్‌ జ్యోతి వెలిగింది

ఒలింపిక్‌ జ్యోతి వెలిగింది– జ్యోతి ప్రజ్వలన చేసిన గ్రీకు నటి మేరీ మినా
-11 రోజుల పాటు గ్రీసులో ఒలింపిక్‌ టార్చ్‌ ర్యాలీ
– పారిస్‌ ఒలింపిక్స్‌కు 100 రోజుల కౌంట్‌డౌన్‌
ఏథెన్స్‌ (గ్రీసు)
2024 పారిస్‌ ఒలింపిక్స్‌ క్రతువు మొదలైంది. మంగళవారం ప్రాచీన ఒలింపియ వేదికగా సంప్రదాయబద్దంగా ఒలింపిక్‌ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అధికారికంగా జరిగింది. గ్రీకు నటి మేరీ మినా ప్రధాన పురోహితుల పాత్ర పోషిస్తూ బ్యాకప్‌ జ్యోతిని ఉపయోగిస్తూ ఒలింపిక్‌ జ్యోతి ప్రజ్వలన చేసింది. సాధారణంగా ఒలింపిక్‌ జ్యోతిని పారాబాలోక్‌ మిర్రర్‌ సాయంతో సూర్యకాంతితో వెలిగిస్తారు. కానీ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమ సమయంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండటంతో పారాబోలిక్‌ మిర్రర్‌ సాయంతో జ్యోతిని వెలిగించటం సాధ్యపడలేదు. దీంతో ప్రత్యామ్నాయ జ్యోతిని ఉపయోగించి ఒలింపిక్‌ టార్చ్‌ను వెలిగించారు. జ్యోతి ప్రజ్వలన కార్య క్రమంతో పారిస్‌ ఒలింపిక్స్‌ టార్చ్‌ రిలేమొదలైంది. 2024 ఒలింపిక్స్‌ ఆతిథ్య నగరం పారిస్‌కు చేరటంతో ఒలింపిక్‌ టార్చ్‌ రిలే ముగియనుంది. 1900, 1924 ఒలింపిక్స్‌కు సైతం ఆతిథ్యం వహి ంచిన పారిస్‌ నగరం.. ముచ్చటగా మూడోసారి విశ్వక్రీడలకు వేదిక కానుంది. యూరోప్‌లో యుద్ధ వాతావరణం కొనసాగుతున్న తరుణంలో ఒలింపిక్‌ క్రీడలు మళ్లీ ఆహ్లాదకర వాతావరణం తీసుకొచ్చేందుకు వారధిగా పని చేయాలని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) భావించింది. ప్రాచీన గ్రీసు దేశంలో ఒలింపిక్‌ క్రీడలు జరిగే సమయంలో ఎటువంటి యుద్ధాలు, వైరుధ్యాలకు చోటు ఉండేది కాదు. ఇదే సంప్రదాయం కొనసాగింపుగా.. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధాన్ని నిలిపివేయాలని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యూల్‌ మాక్రోన్‌ పిలుపినిచ్చాడు. యుద్ధం నేపథ్యంలో రష్యా, బెలారస్‌ క్రీడాకారులను ఆ దేశ అథ్లెట్లుగా కాకుండా.. తటస్థ క్రీడాకారులుగా పోటీపడాలని ఐఓసీ నిర్ణయించటం పట్ల రష్యా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
11 రోజుల పాటు : ప్రాచీన ఒలింపియలో మొదలైన ఒలింపిక్‌ జ్యోతి రిలే.. 11 రోజుల పాటు గ్రీసు దేశంలో కొనసాగుతుంది. ఈ 11 రోజులు గ్రీసులో పండుగ వాతావరణం నెలకొనే ఉంటుంది. ప్రతి రోజు ఒలింపిక్‌ క్రీడల స్ఫూర్తిని చాటేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 26న ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ స్టేడియంలో (1896 ఆధునిక ఒలింపిక్‌ క్రీడల వేదిక) 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ నిర్వాహకులకు అందజేస్తారు. ఫ్రాన్స్‌లో ఒలింపిక్‌ రిలే 68 రోజుల పాటు సాగనుంది. జులై 26న పారిస్‌ ఒలింపిక్స్‌ వేదికపై ఒలింపిక్‌ జ్యోతి ప్రజ్వలనతో ఒలింపిక్‌ రిలే ముగయనుంది.
‘యుద్ధాలు, వైరుధ్యాలతో మనం అందరం క్లిష్టమైన సమయంలో ఉన్నాం. నిత్య జీవనంలో ద్వేషం, దుందుడుకు దూకుడు, నెగెటివ్‌ వార్తలతో ప్రజలు విసిగిపోయారు. మనం అందరం ప్రజలందరిని ఏకం చేసేది, ఐక్యంగా నిలిపి ఓ విశ్వాసం అందించే దాని కోసం ఆశగా ఎదురుచూస్తున్నాం. ఈ రోజు వెలిగించిన ఒలింపిక్‌ జ్యోతి.. నమ్మకం, విశ్వాసానికి ప్రతీక’
– థామస్‌ బాచ్‌,అధ్యక్షుడు
అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)