సెల్ఫీ తెచ్చిన తంటా..

– పోలింగ్‌ అధికారిపై సస్పెన్షన్‌ వేటు
– నిబంధన అతిక్రమణతో ఈసీ ఆగ్రహం
న్యూఢిల్లీ : ఎన్న్లికల విధుల్లో ఉన్న సమయంలో ఓటర్లతో సెల్ఫీలు తీసుకు న్నందుకు ఓ పోలింగ్‌ అధికారిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఉత్తరప్రదేశ్‌లోని హరీంపూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ బూత్‌ అధికారి పోలింగ్‌ జరుగున్న సమయంలో తన సెల్‌ఫోన్‌లో ఓటర్లతో సెల్ఫీలు తీసుకున్నాడు. నిబంధనలు అతిక్రమించినందుకు అతనిపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ముఖ్య అధికారి నవదీప్‌ రిన్వా తెలిపారు. హరీంపూర్‌ జిల్లాలోని ముష్కారా బ్లాక్‌ ఉమ్రి బాలికల ప్రాథమిక పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఆశిష్‌ కుమార్‌ ఆర్యను శ్రీ విద్యా మందిర్‌ ఇంటర్‌ కాలేజీలో 112వ పోలింగ్‌ బూత్‌కు ఎన్నికల విధుల కోసం పంపారు. పోలింగ్‌ కొనసాగుతున్న సమయంలో అతను ఓటర్లతో సెల్ఫీలు దిగాడు. ఈసీ ఆదేశాలను ఉల్లంఘించినందుకు హరీంపూర్‌ జిల్లా విద్యాధికారి ఆర్యాను సస్పెండ్‌ చేసి, ముస్కారా బ్లాస్‌ రిసోర్స్‌ సెంటర్‌కు పోస్ట్‌ చేసినట్టు జిల్లా విద్యాధికారులు తెలిపారు.