కొనసాగుతున్న మొర్రం దందా పరంపర

The ongoing morram danda series– గురిగింజ మాటలు చెబుతున్న అధికార పార్టీ నాయకులు
– పరిమిషన్ లేకుండానే మొరం తీస్తున్నారు : అధికారులు
నవతెలంగాణ – రాయపర్తి
అడ్డు లేదు అదుపు లేదు.. రాబందుల అందిన కాడికి ఎత్తుకెళ్లడమే అన్నట్లుగా ఉంది కొందరి అధికార పార్టీ నాయకుల తీరు. వివరాల్లోకి వెళితే రాయపర్తి – వర్ధన్నపేట మండలాల మధ్య శివారులో ఉన్న ఎస్సారెస్పీ కాలువ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా గత నాలుగు రోజులుగా హిటాచి, టిప్పర్లతో మొరం దందా విచ్చలవిడిగా కొనసాగుతుంది. సమాజానికి ఆదర్శంగా ఉండవలసిన అధికార పార్టీ నాయకులు అనధికారికంగా మట్టిని తరలిస్తూనే గురిగింజ మాటలు చెబుతున్నారు అని ప్రశ్నించే సామాజిక కార్యకర్తలు దుయ్యబడుతున్నారు. చేసేదే తప్పు అందులో మేకపోతు గాంభీర్యం వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. ఇప్పటికైనా చేసే తప్పును మానుకోవాలి కానీ సమర్ధించుకునే వ్యవహారం చేయరాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎస్సారెస్పీ అధికారులు..
ఎస్సారెస్పీ అధికారులు కొందరు వారి మనోవేదనను ఈ విధంగా వెళ్లబుచ్చుకున్నారు. వాస్తవానికి ఎస్సారెస్పీ శాఖ నుండి మొరం తీయడానికి ఎలాంటి అనుమతులు లేవు.. కానీ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఎమర్జెన్సీ ఉంది మొరం కావాలని  ఫోన్ చేసి చెప్పినట్లు తెలిపారు. శనివారం ఆదివారం సెలవు దినాలు కనుక సోమవారం పర్మిషన్ తీసుకుంటా అని చెప్పినట్లు వివరించారు. కాంట్రాక్టర్ కృష్ణా రెడ్డి  కూడా మొరం కావాలని అడగగా పర్మిషన్ తీసుకుంటేనే మొరం తీయనిస్తామని చెప్పగా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి ఫోన్ చేయించాడని అధికారి పూస గుచ్చి నట్టుగా శరవాణిలో వివరించాడు. వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ తండ్రి ఎస్సారెస్పీ కాలువ ఏరియా మొత్తం నాదే మాకు ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు నా ఇష్టం వచ్చినట్లు మొరం తీసుకుంటా అని తాటాకు చప్పుల మాటలతో ప్రశ్నించే వారిని బెదిరించడం జరుగుతుంది. మంగళవారం సాయంత్రం కూడా వారికి ఎలాంటి పరిమిషన్ లేకపోవడం ఓ కొసమెరుపు.