హాలీవుడ్ సినిమాల్లో సాధారణంగా పాటలు ఉండవు. అంటే పాత్రలు కథకు అనుగుణంగా పాడడం కనిపించదు. అది మన భారతీయ సినిమాలకే పరిమితమైన శైలి. కాని మామూలు సినిమాలకు విరుద్ధ్దంగా పూర్తి సంగీత, నత్య ప్రధానంగా కొన్ని అపురూపమైన చిత్రాలు హాలీవుడ్‌లో కూడా నిర్మించారు. వాటిని మ్యూజికల్స్ అంటారు. 1927లో నిర్మించిన ‘ది జాజ్ సింగర్’ హాలీవుడ్ స్క్రీన్‌పై వచ్చిన మొదటి మ్యూజికల్ చిత్రం. ఈ మ్యూజికల్స్‌లో పాటలు, నత్యం, కథనాలను కలిపి స్క్రీన్‌పై చిత్రించారు. అందుకే ఈ సినిమాల్లో సంగీతంతో పాటు నత్యం కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఈ మ్యూజికల్స్ నాటకరంగం ప్రభావంతో తయారయిన చిత్రాలు. సినిమాలుగా వచ్చిన మ్యూజికల్స్ చాలా వరకు నాటకరంగంలో పేరుపొందిన కథాంశాలతో తయారయినవే. ఇప్పటిదాకా తొమ్మిది మ్యూజికల్స్ ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నాయి. అందులో ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ ప్రథమ స్థానంలో నిలుస్తుంది.
షేక్‌స్పియర్ నాటకం రోమియో జూలియట్ ఆధారంగా జెరోమ్ రాబిన్స్ మొదట వెస్ట్ సైడ్ స్టోరి కథాంశాన్ని రాసుకున్నారు. జెరోమ్ రాబిన్స్ ఒక అమెరికన్ డాన్సర్, కొరియోగ్రాఫర్, దర్శకుడు, థియేటర్ డైరెక్టర్, నిర్మాత కూడా. ఈ కథకు సంగీతాన్ని లియోనార్డ్ బెర్న్‌స్టెయిన్, మాటలను స్టీఫెన్ సోంధైమ్ అందించగా ఇది పూర్తి నిడివి నాటకంగా 1957లో ప్రజల ముందుకు వచ్చి అమెరికాలో 732 ప్రదర్శనలు జరుపుకుంది. 1958లో బెస్ట్ మ్యూజికల్‌తో సహా ఆరు టోనీ అవార్డులకు ఈ నాటకం నామినేట్ అయి రెండు అవార్డులను గెలుచుకుంది. దీనినే 1961లో సినిమాగా తీశారు. ఇది సినిమాగా గొప్ప విజయం సంపాదించింది. 11 అకాడమీ అవార్డులకు నామినేట్ అయి ఉత్తమ చిత్రంతో సహా ఇది 10 అవార్డులను గెలుచుకుంది. సంగీత ప్రధాన చిత్రంగా అంటే మ్యూజికల్‌గా అత్యధిక విజయాలు సాధించిన చిత్రంగా ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ రికార్డులకు ఎక్కింది.
సినిమా కథ రెండు టినేజ్ గాంగ్స్ మధ్య నడుస్తుంది. అమెరికాలో జాత్యంహంకార నేపథ్యంలో వెస్ట్ సైడ్ ప్రాంతంలో నడిచే కథ ఇది. అక్కడ యువకులు రెండు ముఠాలుగా విడిపోయారు. జెట్శ్స్ అనబడే ముఠా అక్కడ నివసించే తెల్లజాతి యువకులది. షార్క్స్ ప్యూర్టో రికా నుంచి వలస వచ్చిన యువకులది. ఆ ప్రాంతంలో ఈ వలసవచ్చిన వారు ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. ఈ రెండు ముఠాల మధ్య ఎప్పుడూ వైరమే. జెట్శ్‌కు రిఫ్, షార్క్స్‌కు బెర్నాడో నాయకులు. వీరి మధ్య గొడవలు జరగకుండా ష్రాంక్ అనే పోలీస్ ఆఫీసర్ కావలి కాస్తూ ఉంటాడు. అయినా ఈ రెండు ముఠాల మధ్య తరచుగా ఏవో చిన్న చిన్న గొడవలు జరగడం, వీళ్లు గొడవలకు దిగడం మామూలే.
ఆ నగరంలో ఓ నత్య సంబరం జరుగుతుంది. దీని తర్వాత ఓ చిన్న పోరుకు ఇరువర్గాలు తయారవుతాయి. ఇలా ప్రత్యేకంగా నిర్ణయించుకుని కొట్టుకోవడం వారికి మామూలే. జెట్శ్ నాయకుడు రిఫ్ స్నేహితుడు టోని. ఇతను ఈ గొడవల నుంచి దూరంగా ఓ డాక్టర్ దగ్గర మందులు అందించే పనికి కుదురుతాడు. రిఫ్ టోనీని ఈ డాన్స్‌కి ఆహ్వానిస్తాడు. టోని వద్దనుకుంటూనే ఈ డాన్స్‌కు వస్తాడు. అక్కడ బర్నాడొ చెల్లెలు మారియాతో ప్రేమలో పడతాడు. బర్నాడొ టోనిని తన చెల్లెలుకు దూరంగా ఉండమని హెచ్చరించి ఆమెను తన గర్ల్‌ఫ్రెండ్ అనితాతో ఇంటికి పంపిస్తాడు. కాని టోని ఆమె ప్రభావాన్ని తప్పించుకోలేక ఆమె ఇల్లు కనుక్కుని వెళ్లి మారియాని కలుస్తాడు. ఆమె కూడా తనను ప్రేమిస్తుందని తెలుసుకుని సంతోషిస్తాడు.
రిఫ్ బర్నాడో వారి స్నేహితులతో టోని పనిచేసే డాక్టర్ షాపులో కలుసుకుని వాళ్ల మధ్య జరగబోయే వీధి యుద్ధ్దానికి నియమాలను నిర్ణయించుకుంటారు. పోలీసు ఆఫీసర్ వీరి మధ్య గొడవ జరగబోతుందని పసిగట్టి అక్కడకు వస్తాడు. అప్పటికి ఒకరికొకరుగా ముష్టియుద్ధ్దంలో వాళ్లు పాల్గొనాలని, గెలిచిన వాళ్ళదే అక్కడ ఆధిపత్యం అని ఆ రెండు ముఠాలు నిర్ణయించుకుంటారు. పోలీస్ ఆఫీసర్ ముందు అందరూ మిత్రుల్లా నటిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
అనితా మరుసటి రోజు జరగబోయే ఈ ముష్టి యుద్ధ్దం గురించి మారియాతో చెప్తుంది. మారియా ఆ రాత్రి వాళ్లు పనిచేసే బట్టల దుకాణంలో టోనీని కలుస్తుంది. టోని అక్కడకు రావడం అనితా చూస్తుంది. మారియాని హెచ్చరించి ఆమె వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలి ఇంటికి వెళ్లిపోతుంది. టోనితో మారియా ఈ గొడవలు తమ భవిష్యత్‌కు మంచివి కావని ఏ రకంగానన్నా వాటిని ఆపమని కోరుతుంది. మారియా కోరికను టోని అర్థం చేసుకుంటాడు. తాను ఈ గొడవను ఆపుతానని ప్రమాణం చేస్తాడు. ఇద్దరూ తమ పెళ్లిరోజు గురించి ఆ తర్వాతి జీవితం గురించి తమ కలలను పంచుకుంటారు.
హైవే దగ్గర ఈ రెండు ముఠాలు గొడవకు సిద్ధ్దపడతాయి. టోని వచ్చి వారిని ఆపే ప్రయత్నం చేస్తాడు. గొడవ మంచిది కాదని మానమని అభ్యర్ధిస్తాడు. రిఫ్ టోని మాట విని ఆలోచనలో పడతాడు. కాని బర్నాడొ దానికి అవకాశం ఇవ్వడు. టోనీని రిఫ్‌ని మాటలతో రెచ్చగొడతాడు. టోని గొడవ పెరగకూడదని విశ్వప్రయత్నం చేస్తాడు. కాని గొడవకు మానసికంగా సిద్ధ్దపడి వచ్చిన స్నేహితులు కూడా వారి నాయకులను రెచ్చగొట్టే ప్రయత్నంలోనే ఉంటారు. టోని మాటలను వినిపించుకునే స్థితిలో ఎవరూ ఉండరు. దానితో టోని అసహాయుడవుతాడు. బర్నాడో రెచ్చగొట్టే మాటలు తిట్లతో రిఫ్ కూడా సహనం కోల్పోతాడు. ప్రాణ మిత్రుడు టోనిని బర్నాడో నీచంగా అవమానిస్తుంటే తట్టుకోలేక రిఫ్ ఆవేశంతో కత్తి బైటకు తీస్తాడు. ఆయుధాలను ప్రయోగించకూడదనే వాళ్ల నియమం ఇరు పక్షాలకు ఆ ఆవేశంలో గుర్తుకు రాదు. బర్నాడొ కూడా కత్తితో దాడి చేస్తాడు. ఈ గొడవలో ఆవేశంతో సర్వం మరిచి బర్నాడొ రిఫ్ ను కత్తితో గాయపరుస్తే అక్కడికక్కడే రిఫ్ మరణిస్తాడు.
తన మిత్రుని మరణాన్ని టోని తట్టుకోలేకపోతాడు. అతనిలోనూ ఆవేశం పెరుగుతుంది. కోపంతో బర్నాడొ పై దాడికి దిగుతాడు. రిఫ్ కత్తితో బర్నాడోని హత్య చేస్తాడు టోని. పోలీసుల సైరన్లు వినిపించడంతో రెండు శవాలను అక్కడే వదిలేసి అందరూ పారిపోతారు. జరిగిన పరిణామాలకు భయపడ్డ టోని కూడా అక్కడి నుంచి పారిపోతాడు.
మారియా ఇంటిపైన టోని కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కాని చీనో అక్కడకు వస్తాడు. చీనోతో మారియా వివాహం చేయాలని బర్నాడో అంతకుముందు అనుకుంటాడు. చీనో మారియోతో టోని బర్నాడొని హత్య చేసి పారిపోయాడని చెప్తాడు. చీనో వెళ్ళిపోయాక అమె గదిలోకి టోని వస్తాడు. జరిగిన దానికి క్షమాపణ కోరుతూ తాను తెలిసి ఈ పని చేయలేదని, ఆ గొడవ ఆపాలని ఎంతో ప్రయత్నించానని కాని పరిస్థితి తన చేయి దాటి పోయిందని, బర్నాడొ రిఫ్ ని చంపితే తాను తట్టుకోలేకపోయానని ఆ ఆవేశంలోనే తానూ తప్పు చేసానని మారియా దగ్గర వాపోతాడు. తాను పోలీసులకు లొంగిపోతానని చెప్తాడు. మారియా పరిస్థితి అర్ధం చేసుకుంటుంది. టోనిపై తనకున్న ప్రేమను మర్చిపోలేనని, ఇద్దరం కలిసి అక్కడి నుంచి పారిపోదామని, కొంత ఓపిక పట్టమని టోనిని వేడుకుంటుంది.
జెట్శ్‌లకు కొత్త నాయకుడుగా ఐస్ వ్యవహరిస్తూ ఉంటాడు. పోలీసులతో ఆ తర్వాత తాము ఎంత జాగ్రత్తతో మెలగాలో ఐస్ వారందరికీ వివరిస్తాడు. అప్పుడే టోనిని చంపడానికి చీనో తుపాకితో వెతుకుతున్నాడన్న విషయం వారికి తెలుస్తుంది. టోనికి ఈ విషయం చెప్పి జాగ్రత్తపడమనే సందేశాన్ని ఐస్ మరో స్నేహితుడితో పంపిస్తాడు.
బర్నాడొ చనిపోయిన దుఖంలో అనితా ఇంటికి వస్తుంది. కాని టోని మారియాతో ఉండడం ఆమె గమనిస్తుంది. తన రాకను గమనించి కిటికీ దూకి పారిపోయిన టోనిని ఆమె కోపంతో చూస్తుంది. అన్న హంతకుడితో ప్రేమ సాగించడం ఆపమని ఆమె మారియాతో అంటుంది. కాని మారియా అనితాను ఆలోచించమని ప్రాధేయపడుతుంది. అన్నను మానస్పూర్తిగా ప్రేమించిన స్త్రీగా తనను అర్ధం చేసుకొమ్మని సహాయపడమని బతిమాలుతుంది. అనితా తన దు:ఖాన్ని మరిచి మారియా ప్రేమను గెలిపించాలని నిశ్చయించుకుంటుంది.
హత్య విషయంగా మారియాను ప్రశ్నించాలని పోలీస్ ఆఫీసర్ వారింటికి వస్తాడు. టోనిని డాక్టర్ క్లీనిక్ దగ్గర వేచి ఉండమని మారియా చెప్తుంది. ఈ ఇంటరాగేషన్‌తో ఆలస్యం అయితే టోనీ భయపడతాడని, తాను రానని అనుకుంటాడని మారియా అనితను తాను కొంతసేపు ఆగి వస్తానని టోనికి చెప్పమని అతను దాక్కున్న చోటకు పంపిస్తుంది.
అక్కడకు వెళ్లిన అనితను రిఫ్ స్నేహితులు అడ్డగిస్తారు. వాళ్లు ఆమెను బర్నాడో ప్రేమికురాలిగానే చూస్తారు. ఆమెపై కసి తీర్చుకునే ప్రయత్నంలో ఆమె చెప్తున్నదేదీ వినకుండా ఆమెపై అత్యాచారయత్నం చేస్తారు. డాక్టర్ వచ్చి ఆమెను వారి నుంచి రక్షిస్తాడు. అనిత కోపంతో బాధతో రగిలిపోతుంది. టోనికి మారియాను మర్చిపొమ్మని చీనో మారియాను హత్య చేసాడనే సమాచారాన్ని ఇవ్వమని రిఫ్ స్నేహితులకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఈ సంగతి డాక్టర్ కింద గదిలో దాక్కున్న టోనికి చెప్తాడు. టోని ఆ ఊరు వదిలి వెళ్లడానికి డాక్టర్ డబ్బు సహాయం చేస్తాడు. కాని మారియా చనిపోయిందని విని టోని బాధతో రగిలిపోతాడు. తాను మారియా లేకుండా జీవించలేనని తానూ చనిపోతానని రోడ్డు మీదకు చీనో పేరు అరుస్తూ వస్తాడు. తననూ చంపమని గట్టిగా అరుస్తూ అక్కడే పిచ్చిగా తిరుగుతాడు. ఇంతలో టోనికి మారియా వస్తూ కనిపిస్తుంది. ఆనందంగా ఆమెను చేరుకుంటాడు టోని. కాని అప్పటికే అతని కేకలకు బైటకు వచ్చిన చీనో టోనిపై తుపాకి పేలుస్తాడు. టోనీ మారియా చేతుల్లో ప్రాణాలు వదులుతాడు.
చీనో చేతిలోని తుపాకి లాక్కుంటుంది మారియా. అప్పటికే అక్కడకు చేరిన రెండు ముఠాల సభ్యులను ఆ తుపాకితో కాల్చి చంపుతానని బెదిరిస్తుంది. బర్నాడో, రిఫ్, టోనిల మరణానికి వారి మూర్ఖత్వం, ద్వేషం కారణం అని అవి ఎప్పటికీ ఎవరినీ ప్రశాంతంగా ఉండనివ్వవని చెప్తుంది. పోలీసులు చీనోని అరెస్టు చేయడానికి వస్తారు. టోని మతదేహాన్ని ఇరు ముఠాల సభ్యులు మోస్తుండగా కన్నీళ్లతో మారియా వారి వెంట వెళ్తుంది.
సినిమాలో ఈ రెండు ముఠాల్లోని సభ్యులు యువతీ యువకులే. అర్ధం లేని ఆవేశాలతో ముఠా కక్షలకు దిగే ఆ నాటి అమెరికన్ యువత మన:స్థితిని ఈ రెండు ముఠాల సభ్యులు వ్యక్తీకరిస్తారు. అలాగే ఇమిగ్రింట్లపై అమెరికన్ల ద్వేషం కూడా ఈ ముఠా కక్షల్లో ప్రధాన అంశం.
ఈ మ్యూజికల్ స్టేజ్‌పై ప్రభంజనం సష్టించడంతో, స్టేజీ నాటకానికి దర్శకత్వం చేసిన జెరోమ్ రాబిన్స్‌నే ఈ సినిమాకూ దర్శకత్వం చేయమని అడిగారు. ఆయన ఒప్పుకున్నారు కూడా, కాని అంతకు ముందు ఏ సినిమాకు దర్శకత్వం చేసిన అనుభవం లేకపోవడంతో రాబర్ట్ వైస్ సహాయం కోరారు. కాని సగం సినిమా తర్వాత కొన్ని గొడవల కారణంగా రాబర్ట్ వైస్ పూర్తి భాద్యతను తీసుకున్నారు. కాని రాబిన్స్ సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూనే ఈ సినిమాను ముగించారు వైస్. అందుకనే ఈ సినిమాకు ఇద్దరు దర్శకులూ అకాడమీ అవార్డుని పంచుకున్నారు. అలా ఒకే సినిమాకు ఇద్దరు దర్శకులు అకాడమీ అవార్డు గెలుచుకున్న ప్రథమ చిత్రంగానూ వెస్ట్ సైడ్ స్టోరీ చరిత్రకెక్కింది. ఆ తర్వాత రెండోసారి నలభై ఆరు ఏండ్ల తర్వాత ”నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్” ఇద్దరు దర్శకుల చిత్రంగా అవార్డుకు ఎంపికయింది.
ఈ సినిమా పారిస్‌లో మొత్తం 249 వారాలు ఏకథాటిగా నడిచి ఫ్రాన్స్‌లో అత్యధిక రోజులు నడిచిన సినిమాగా రికార్డు సష్టించింది. అనితా పాత్రలో నటించిన రీటా మోరినో గాయని కూడా. తన పాటలన్నీ ఒక పాట మినహాయించి ఆమె పాడుకున్నారు. ఇతర పాత్రలకు వేరే గాయకులు ప్లేబాక్ పాడారు. ఈ సినిమాకు ఉత్తమ సాహాయ నటిగా రీటా ఆకాడమీ అవార్డు గెలుచుకుని ఆ అవార్డు సొంతం చేసుకున్న మొదటి లాటిన్ అమెరికన్ మహిళగా రికార్డు సష్టించారు. ఈ సినిమాను ఆ తర్వాతి తరం ప్రేక్షకులతో పాటు, సిన దర్శకులు కూడా హాలివుడ్ గొప్ప చిత్రాల్లో ఒకటిగా అంగికరించారు. స్టివెన్ స్పీల్బర్గ్ 2021లో దీన్ని రీమేక్ చేశారు. కానీ 1961లో తీసిన ఈ సినిమాలోని మాజిక్‌ను ఆయన తన సినిమాలో చొప్పించలేకపోయారు.
ఈ సినిమాలో నటించిన ప్రతిఒక్కరూ నాట్యంలో నిష్ణాతులే. సినిమాలో మొదటి సీన్ మొత్తం ఆ రెండు ముఠాల మధ్య జరిగే గొడవ. కాని దాన్ని పూర్తిగా నత్యంగా బాలే పద్ధ్దతిలో చిత్రించిన విధానం సినీ ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభూతినిస్తుంది. అలాగే పూర్టో రికా నుంచి వలసి వచ్చిన ఇమ్మిగ్రెంట్ల మధ్య తమ దేశాన్ని అమెరికికాతో పోలిస్తూ రెండిటి మధ్య మంచి చెడులను విశ్లేషిస్తూ సాగే గీతం కూడా ఇప్పటి పరిస్థితుల దష్ట్యా ప్రేక్షకులను ఈ నాటికీ ఆలొచింపజేస్తుంది. ఈ సినిమాలో వివిధ సన్నివేశాలు, నత్యాల రిహార్సల్స్‌లో మొత్తం నటులు 200లకు పైగా షూలను అరగదీశారన్న రికార్డు ఉంది. ఎల్విస్ ప్రెస్లీ ని టోని పాత్రకు దర్సకులు కోరుకున్నారు. కాని ప్రెస్లీ మేనేజర్ ఈ పాత్రను నిరాకరించారు. ఇందులో ఎల్విస్ పాడే పాటల సంఖ్య తక్కువని వాటిపై పూర్తి హక్కులు ఆయనకు ఉండవని మేనేజర్ ఈ సినిమాలో ఎల్విస్ నటించడానికి నిరాకరించారట. అలా ఆ పాత్ర రిచర్డ్ బెయ్మర్‌కు దక్కింది. మారియాగా నటించిన నటాలియా వుడ్ కెరీర్‌లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిచింది.
వెస్ట్ సైడ్ స్టోరీ అమెరికా సినీ చరిత్రలో ఒక ప్రభంజనం. నేటికీ ప్రతిఒక్కరూ గొప్ప సినిమాగా ఇష్టంగా తలచుకునే మధురమైన జ్ఞాపకం.
పి.జ్యోతి
98853 84740