సబ్‌ స్టేషన్‌లో ఆపరేటర్‌ దారుణ హత్య

The operator was brutally murdered in the sub station– భూతగాదాలపై అనుమానం
– ఘటనాస్థలాన్ని సందర్శించిన మెదక్‌ డీఎస్పీ ఫణిందర్‌, సీఐ కేశవులు
నవతెలంగాణ- కొల్చారం
మెదక్‌ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి విద్యుత్తు సబ్‌ స్టేషన్‌లో విద్యుత్‌ ఆపరేటర్‌ మంగళవారం రాత్రి హత్యకు గురయ్యాడు. వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్‌ గ్రామానికి చెందిన తట్కురి నరేష్‌(35) సబ్‌ స్టేషన్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తలపై, మెడపై పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో నరేష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. విద్యుత్‌ ఉపకేంద్రం గ్రామాలకు దూరంగా ఉండటంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉప్పు లింగాపూర్‌ గ్రామంలో నరేష్‌కు కొంతకాలంగా భూతగాదాలు ఉన్నట్టు తెలిసింది. ఆ తగాదాల కారణంగానే నరేష్‌ను ఎవరైనా చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రేషన్‌ డీలర్‌ రమేష్‌ అటువైపుగా వెళ్తూ సబ్‌ స్టేషన్‌లో ఎవరు కనిపించకపోవడంతో లోపలికెళ్లాడు. నరేష్‌ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు. వెంటనే ఈ విషయాన్ని కొల్చారం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసు జాగిలాలను తెప్పించి ఘటనస్థలాన్ని పరిశీలించగా.. జాగిలం కొంగోడు వైపు కొద్ది దూరం వెళ్లి ఆగిపోయింది. సంఘటన స్థలాన్ని మెదక్‌ డీఎస్పీ ఫణిందర్‌, మెదక్‌ రూరల్‌ సీఐ కేశవులు, కొల్చారం ఎస్‌ఐ మొహమ్మద్‌ గౌస్‌ పరిశీలించారు. సీఐ కేశవులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.