– కేంద్ర ఏజెన్సీలతో దాడులు
– లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ వ్యూహాలు
– రాజకీయంగా గుప్పెట్లో పెట్టుకునే యత్నాలు
– లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే కేజ్రీవాల్ సహా పలువురు ముఖ్యనేతల అరెస్ట్
– భూ-కుంభకోణంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్
– మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంలోకి అజిత్ వర్గం
– తమిళనాడులోని డీఎంకే నాయకులపై దాడులు
– ‘ఇండియా’ కూటమిని బలహీనపర్చే యత్నం
– ఇలాంటి చర్యలతో బీజేపీపై ప్రజల్లో అసంతృప్తి
– రాజకీయ పరిశీలకులు, మేధావుల విశ్లేషణ
భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ నేతృత్వ ఎన్డీయే ప్రభుత్వం ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నది. 400కు పైగా లోక్‌సభ సీట్లను గెలవటమే లక్ష్యంగా పెట్టుకున్నది. సిద్ధాంత పార్టీగా గొప్పలు చెప్పుకునే ఆ పార్టీ.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకొచ్చి టికెట్లు ఇస్తున్నది. సొంత పార్టీ నాయకులనే చిన్న చూపు చూస్తున్నది. ఇక కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ తన రాజకీయ లబ్ది కోసం ప్రత్యర్థులపై ఆయుధంగా వాడుకుంటున్నది.
న్యూఢిల్లీ : సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఉసిగొల్పుతూ, వారిపై కేసులు బనాయిస్తూ జైళ్లకు పంపేలా మోడీ సర్కార్ వ్యూహాలు పన్నుతున్నది. నాయకులను బెదిరించి పార్టీల్లో చీలికలు తేవటం, ప్రభుత్వాలు కూల్చటం, నాయకులను తమ పార్టీలోకి చేర్చుకోవటం వంటి చర్యలను కొనసాగిస్తున్నది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు ఇందులో భాగమేనని విశ్లేషకులు చెప్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, తెలంగాణ ఎమ్మెల్సీ కవితలు ఈ కేసులో అరెస్టైన విషయం విదితమే. ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేజ్రీవాల్, కవితల అరెస్టులతో ఢిల్లీ, తెలంగాణల్లోనే కాకుండా యావత్ దేశంలో రాజకీయంగా ప్రయోజనం పొందొచ్చనీ, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఇది ప్రచారాస్త్రంగా మలుచుకోవచ్చని బీజేపీ భావించింది. అయితే, ఈ అంశం కాషాయపార్టీకి రివర్స్‌ఫైర్ అయ్యే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ప్రతిపక్షం బలంగా లేకపోవటంతో..
భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షం అత్యంత కీలకమైనది. గత రెండు దఫాల ఎన్డీయే పాలనలో ప్రధాన ప్రతిపక్షం బలంగా లేదు. ప్రతిపక్ష స్థానానికి కావాల్సిన సీట్లను సైతం కాంగ్రెస్ గెలవలేకపోయింది. ఇక లోక్‌సభలో తమకు ఉన్న బలం చూసుకొని బీజేపీ రెచ్చిపోయిందనీ, అనేక ప్రజా వ్యతిరేక, మత విద్వేష బిల్లులను తీసుకొచ్చి చట్టాలుగా మార్చిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
టార్గెట్ ‘ఇండియా’ కూటమి
రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ‘ఇండియా’ కూటమి ఏర్పడింది. కాంగ్రెస్, ఆప్, డీఎంకే, సీపీఐ(ఎం), సీపీఐ, జేడీ(యూ), జేఎంఎం ఎన్సీపీలు అందులో కీలకంగా ఉన్నాయి. అయితే, బీహార్‌లో జేడీ(యూ)ను దూరం చేసి.. నితీశ్‌కి మద్దతు పలికిన బీజేపీ అక్కడ సంకీర్ణ ప్రభుత్వానికి బీజం వేసింది. ఇటు మహారాష్ట్రలోని కీలక ఎన్సీపీ పార్టీలో కాషాయపార్టీ చీలిక తెచ్చింది. జార్ఖండ్ సీఎం, జేఎంఎం నాయకుడు హేమంత్ సొరెన్‌ను ఇదే ఈడీ అరెస్ట్ చేసింది. ఇక ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆప్‌పై కన్నేసిన బీజేపీ.. ఈడీ సహాయంతో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయించగలిగింది. అయితే, కేజ్రీవాల్ అరెస్ట్‌పై దేశ ప్రజల నుంచి బీజేపీ ఆశించిన స్పందన రాకపోగా.. బీజేపీ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిని తెప్పిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఎలక్టోరల్ బాండ్ల నుంచి దృష్టి మరల్చేందుకే..
బీజేపీకి విరాళాలిచ్చిన 487 మందిలో మొదటి 10 మంది విరాళాలు దాదాపు రూ. 2,119 కోట్లుగా ఉన్నాయి. బాండ్ కొనుగోళ్లలో ఎక్కువ వాటా పెద్ద ప్రయివేట్ దాతల నుంచే ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ల సమస్యను ఇప్పటివరకు సుప్రీంకోర్టు పరిష్కరించిన విధానం, దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చటానికి బీజేపీ ప్రయత్నించిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇందులో భాగంగా, అవినీతికి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామనే ఆలోచన కలిపించే ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలను, ముఖ్యంగా ఈడీని మోడీ సర్కారు ఆయుధంగా వాడుతున్నదని వారు అంటున్నారు.
బీజేపీ పాలనలో పెరిగిన ఈడీ దాడులు
2005-2014 మధ్య, యూపీఏ హయాంలో ఈడీ దాదాపు 112 సోదాలు నిర్వహించింది. 104 ఫిర్యాదులను కలిగి ఉన్నది. అయితే 2015-2022 మధ్య, బీజేపీ ప్రభుత్వ హయాంలో ఈడీ సోదాలు 3010 కాగా.. 888 వరకు ఫిర్యాదులు ఉన్నాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకులపై 100కు పైగా సోదాలు జరిగాయి. బీజేపీ, ఇతర పార్టీల నుంచి ఆ పార్టీలోకి వెళ్లిన నాయకులు, దాని మిత్రపక్షాలపై వచ్చిన ఆరోపణలను మాత్రం ఈడీ పట్టించుకోకపోవటం గమనార్హం. ఈడీ ద్వారా మొత్తం కేసుల్లో 95 శాతం ప్రతిపక్ష నాయకులపై నమోదు చేయబడ్డాయని రాజకీయ విశ్లేషకులు కొన్ని గణాంకాలను ఉదహరిస్తున్నారు.
కేవలం రాజకీయ ప్రత్యర్థుల మీద మాత్రమే కాదు.. అన్ని రకాల విమర్శకులపైనా కేంద్ర ఏజెన్సీ సంస్థలు విరుచుకుపడుతున్నాయి. ఫ్యాక్ట్‌చెక్ వెబ్‌సైట్ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్‌ను సుప్రీంకోర్టు విడుదల చేయటానికి ముందు మోడీ సర్కారు ఆయనను జైలుకు వెళ్లేలా చేసిందనీ, బీబీసీ, భాస్కర్ మీడియా గ్రూప్‌లపై ఐటీ శాఖ దాడులు చేసిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అలాగే, గతేడాది ఆక్స్‌ఫామ్ ఇండియా, ఇండిపెండెంట్ అండ్ పబ్లిక్-స్పిరిటెడ్ మీడియా ఫౌండేషన్, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఎన్జీవోలు, మరికొన్ని పరిశోధన థింక్ ట్యాంక్‌లకు విదేశీ నిధులు అందకుండా ఎఫ్‌సీఆర్‌ఏ, 2010 లైసెన్సులను మోడీ సర్కారు రద్దు చేసిందని విశ్లేషకులు, మేధావులు, సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.