అసలు లక్ష్యం ఇరాన్‌పై దాడి?

The original goal was to attack Iran?ఆదివారం నాడు మధ్య ప్రాచ్యంలోని ఎర్ర సముద్రంలో అమెరికా నౌకాదళ యుద్ధ విమానం ఒకటి కూలిపోయింది. పొరపాటున దాన్ని తమ దళాలే కూల్చివేసినట్లు అమెరికా ప్రకటించగా, తామే కూల్చివేసినట్లు రాజధాని సనా నగరంతో సహా కీలకమైన ప్రాంతాలను అదుపులో ఉంచుకున్న హౌతీ సాయుధ దళం ప్రకటించింది. మరోవైపు హౌతీలు ప్రయోగించిన క్షిపణులను తమ రాడార్లు పసిగట్టలేకపోయాయని, ఫలితంగా కొద్ది మంది తమ పౌరులు గాయపడినట్లు ఇజ్రా యిల్‌ ప్రకటించింది. ఈ రెండు పరిణామాలు అమెరికా, ఇజ్రాయిల్‌ బలహీనతలను వెల్లడిం చాయి. గత కొద్ది రోజులుగా అమెరికా, ఇజ్రాయిల్‌ దళాలు ఎమెన్‌పై వైమానిక దాడులు జరుపుతున్నాయి. సిరియాలో బాత్‌ పార్టీ నేత అసద్‌ సర్కార్‌ కూలిపోయిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది.హౌతీలకు బదులు వారి వెనుక ఉన్న ఇరాన్‌ సంగతే చూడాలంటూ ఇజ్రాయిల్‌ గూఢచార సంస్థ మొసాద్‌ అధిపతి డేవిడ్‌ బర్నెయా తమ నేతలకు సూచించాడు. దీన్ని బట్టి ఇరాన్‌పై దాడికి పూనుకున్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గత ఏడాది కాలంగా ఎమెన్‌ కేంద్రంగా పని చేస్తున్న హౌతీలు జరుపుతున్న దాడుల తీరుతెన్నులను చూస్తే వారిని అణచివేయటం అంతతేలిక కాదని నిపుణలు చెబుతున్నారు.వారు ఇజ్రాయిల్‌ రాజధాని టెల్‌అవీవ్‌ మీద ప్రయోగించిన క్షిపణులు రెండు వేల కిలో మీటర్లు ప్రయాణించి భారీ నష్టం కలిగించాయి. లెబనాన్‌ కేంద్రంగా పని చేస్తున్న హిజబుల్లా కంటే వీరు శక్తివంతులని తేలింది. ఈ పూర్వరంగంలో ఒకేసారి ఇరాన్‌-ఎమెన్‌ మీద దాడులకు దిగితే రాగల పరిణామాలు, పర్యవసానాల గురించి అమెరికా కూటమి మల్లగుల్లాలు పడుతున్నట్లు చెప్పవచ్చు. మధ్యప్రాచ్య పరిణా మాలు ఏ మలుపు తిరిగేదీ ఇంకా స్పష్టంగా తెలియటం లేదు.
ఎర్రసముద్ర తీరం ఒకవైపు, మరోవైపు అరేబియా సముద్రం సరిహద్దులుగా కీలక ప్రాంతంలో ఉన్న పశ్చిమాసియాలోని ఎమెన్‌ తొలుత బ్రిటన్‌ తరువాత అమెరికా సామ్రాజ్యవాదుల కుట్రకు బలైంది. అంతర్యుద్ధం తరువాత ఉత్తర, దక్షిణ ఎమెన్‌లు 1990లో విలీనమైన తరువాత తిరిగి అంతర్యుద్ధం ప్రారంభమైంది.ప్రస్తుతం వివిధ దేశాల మద్దతు ఉన్న పక్షాల ఆధీనంలో ఎమెన్‌ ఉంది. ప్రభుత్వ ఆధీనంలో మెజారిటీ ప్రాంతం ఉన్నప్పటికీ దానిలో ఎక్కువ భాగం ఎడారి, తరువాత ఇరాన్‌ మద్దతు ఉన్న హౌతీలు, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మద్దతున్న సాయుధులు, పరిమిత ప్రాంతంలో ఆల్‌ఖైదా, మరో రెండు సాయుధ శక్తుల ఆధీనంలో రెండు ప్రాంతాలు ఉన్నాయి. మధ్యధరా సముద్రం నుంచి సూయజ్‌ కాలువ ద్వారా ఎర్ర సముద్రం ఏడెన్‌ సంధి దగ్గర అరేబియా సముద్రం కలుస్తాయి. నౌకా రవాణాకు కీలకమైన ఈ ప్రాంతాన్ని ఆనుకొని ఎమెన్‌ రాజధాని సనాతో సహా కీలకమైన ప్రాంతాలు హౌతీల చేతుల్లో ఉన్నాయి. ఇటీవలి వరకు వీరిని వ్యతిరేకించే ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతు ఇచ్చింది. గతంలో దక్షిణ ఎమెన్‌ ప్రాంతానికి సౌదీ రక్షితదారుగా ఉంది. తరువాత చైనా మధ్యవర్తిత్వంలో ఇరాన్‌-సౌదీ అరేబియా ఒక ఒప్పందానికి వచ్చిన తరువాత సౌదీ అరేబియా జోక్యం నిలిచిపోయింది. పాలస్తీనాకు గట్టి మద్దతుదారుగా ఉన్న హౌతీల ఆధీనంలోని ఎమెన్‌ ఇటీవలి కాలంలో ఇజ్రాయిల్‌ దుశ్చర్యలను అడ్డుకుంటున్నది. ఎర్ర సముద్ర ప్రాంతంలో పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌కు వచ్చే, మద్దతు ఇచ్చే దేశాల నౌకలను అడ్డుకోవటం ద్వారా ఒత్తిడి తెస్తున్నది. ఈ కారణంగానే సూయజ్‌ కాలువ లేకముందు మన దేశానికి వచ్చే నౌకలు ఆఫ్రికా ఖండంలోని గుడ్‌హోప్‌ ఆగ్రాన్ని చుట్టి వచ్చినట్లుగా ఇప్పుడు కూడా అనేక దేశాల నౌకలు చుట్టుతిరిగి వస్తున్నాయి.ఈ కారణంగానే మధ్య ధరా, ఎర్ర సముద్రాల్లో తిష్టవేసిన అమెరికా మిలిటరీ ఎమెన్‌పై దాడులకు పాల్పడుతున్నది.తమపై జరుపుతున్న క్షిపణి దాడులకు ప్రతిగా ఇజ్రాయిల్‌ కూడా దాడులకు దిగింది. తొలిసారిగా రాజధాని సనా నగరం మీద బాంబులు కురిపించింది.
ఇరాన్‌పై ఎంత బలమైన దాడులు జరిపామో అదే విధంగా ఎమెన్‌పై కూడా చేసి తీరుతామని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఆదివారం నాడు ప్రకటించాడు. హౌతీలు ప్రయోగించిన క్షిపణులతో ఇజ్రాయిల్‌ పౌరులు వణికిపోయారు. ఎందుకంటే చీమ చిటుక్కుమన్నా తమపైకి వచ్చే ప్రతి క్షిపణిని మధ్యలోనే కూల్చివేసే సామర్ధ్యం తమకుందని చెబుతున్న వారు శనివారం రాత్రి రాజధాని టెల్‌అవీవ్‌పై జరిగిన దాడిని పసిగట్టలేకపోయినట్లు స్వయంగా అంగీకరించారు. కేవలం పదహారు మంది గాయపడ్డారని మాత్రమే చెబుతున్నప్పటికీ అంతకంటే ఎక్కువే నష్టం జరిగినట్లు వార్తలు వచ్చాయి. గురువారం నాడు కూడా క్షిపణి దాడిని సూచిస్తూ దేశంలోని అనేక ప్రాంతాల్లో సైరన్లు మోగించారు. జరిగిన నష్టాన్ని యంత్రాంగం మూసిపెడుతున్నది. టెహరాన్‌ మద్దతుదారులపై ఎందుకు ఏకంగా ఇరాన్‌పైనే దాడులకు దిగాలని ఇజ్రాయిల్‌ యుద్ధ దురహంకారులు రంకెలు వేస్తున్నారు. యుద్ధ కాబినెట్‌ సమావేశం తరువాత నెతన్యాహు మాట్లాడుతూ హౌతీలపై దాడుల్లో తాము ఒంటరి కాదని, గత ఏడాదిగా అమెరికా, బ్రిటన్‌ దళాలు కూడా ఉన్నాయని చెప్పాడు. కాస్త సమయం తీసుకున్నప్పటికీ గాజాలోని హమాస్‌, లెబనాన్‌లోని హిజబుల్లా మాదిరి దెబ్బతీస్తామని అన్నాడు. 2023 అక్టోబరు ఏడున గాజాలో మారణకాండ ప్రారంభమైన నాటి నుంచి హౌతీలు దాడులు చేస్తున్నారు. ఇప్పటి వరకు 200 క్షిపణులు, 170డ్రోన్లు ప్రయోగించినట్లు చెబుతున్నారు.ఎర్ర సముద్రంలోకి రాకుండా వంద వాణిజ్య నౌకల మీద కూడా దాడులు చేశారు. ఇదిలా ఉండగా ఇరాన్‌ మీద కొనసాగిస్తున్న తప్పుడు ప్రచారంలో భాగంగా ఆ దేశం అణ్వాయుధాల తయారీకి పూనుకున్నదని మరోసారి అమెరికా ఆరోపించింది. తాము శాంతియుత ప్రయోజనాల కోసం అణుకార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, అయితే గతంలో ట్రంప్‌ అధికారంలో ఉన్నపుడు అంతకు ముందు కుదిరిన ఒప్పందాల నుంచి ఏకపక్షంగా వైదొలగి, తమ మీద విధించిన ఆంక్షల కారణంగా యురేనియం శుద్దికి పూనుకున్నట్లు ఇరాన్‌ అంటోంది.
ఆదివారం నాడు అమెరికాకు చెందిన ఎఫ్‌-18 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని, ఎమెన్‌పై అమెరికా, బ్రిటన్‌ దాడులను అడ్డుకున్నామని హౌతీ మిలిటరీ ప్రతినిధి యాహ్యా శారీ ప్రకటించాడు. అమెరికా విమానవాహక నౌక హారీ ఎస్‌ ట్రూమన్‌, ఇతర అనేక అనుబంధ నౌకలు శనివారం నుంచి దాడులు ప్రారంభించినట్లు పేర్కొన్నాడు. విమానాన్ని కూల్చివేసేందుకు తాము ఎనిమిది క్షిపణులు, 17 డ్రోన్లను వినియోగించినట్లు వెల్లడించాడు. అయితే తమ విమానాన్ని తామే కూల్చివేసినట్లు అమెరికా చెప్పుకుంది. అయితే అది ఎలా జరిగిందన్నది మాత్రం వెల్లడించలేదు.శనివారం నాడు ఎమెన్‌లోని క్షిపణి కేంద్రాల మీద దాడులు చేసినట్లు చెప్పుకుంది.తమ, ప్రాంతీయ భాగస్వాముల, అంతర్జాతీయ నౌకల ప్రయోజనాల రక్షణకే దాడులు చేస్తున్నట్లు పేర్కొన్నది. ఎర్రసముద్ర ప్రాంతంలో హౌతీలు దాడులను ముమ్మరం చేయటంతో అమెరికా తీవ్ర ఒత్తిడికి లోనైన కారణంగానే తమ స్వంత విమానాన్ని కూడా గుర్తించలేని ఆత్రత కారణంగా స్వయంగా కూల్చివేసినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి కారణంగా రానున్న రోజుల్లో దాని దాడుల సామర్ధ్యం తగ్గే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా ప్రత్యర్ధుల వైపు నుంచి మానవరహిత ఆయుధాల ప్రయోగ సమయంలో ఇలాంటి తప్పిదాలు మరింత ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.అమెరికా సూపర్‌ హార్నెట్‌ విమానాన్ని యుఎస్‌ఎస్‌ హారీ ఎస్‌ ట్రూమన్‌ నౌక నుంచి ప్రయోగించగా ఆ నౌకకు కాపలాగా అనుసరించే గెటీఎస్‌బర్గ్‌ అనే మరో నౌక రాత్రి మూడు గంటల సమయంలో నియంత్రిత క్షిపణి ద్వారా కూల్చివేసింది. అయితే ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ అసాధారణ ఉదంతం హౌతీల నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను ఎదుర్కొనే క్రమంలో జరిగింది.తమవైపు వస్తున్నది శత్రువులదా లేక మిత్రులదా అన్నది గుర్తించటంలో అమెరికా మిలిటరీ విఫలమైంది.హౌతీల దాడులు తగ్గకపోవటంతో గత గురువారం నాడు ఎమెన్‌ రిజర్వుబాంకు, మరికొన్ని కంపెనీల మీద అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సరికొత్త ఆంక్షలు ప్రకటించాడు.
సిరియాలో తాము మద్దతు ఇస్తున్న అసద్‌ ప్రభుత్వం కూలిపోయినప్పటికీ ప్రతిఘటన కొనసాగించాల్సిందేనని ఇరాన్‌ భావిస్తున్నది. ప్రతిఘటించే దేశాల కూటమి కుప్పకూలిపోయినట్లు ఎవరైనా భావిస్తే పొరపాటని అధినేత అయాతుల్లా అలీ ఖమేనీ చెప్పాడు. లెబనాన్‌లో హిజబుల్లా సాయుధ సంస్థ మీద ఇజ్రాయిల్‌ దాడులు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ సజీవంగానే ఉందన్నాడు. ఇజ్రాయిల్‌ను వ్యతిరేకించే సిరియాలో ప్రభుత్వం పతనమై నూతన శక్తులు అధికారానికి వచ్చాయి. వాటి వైఖరి, ఆచరణ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఈలోగా కొంత మంది పశ్చిమదేశాల వారు చైనా- ఇరాన్‌ సంబంధాల గురించి మాట్లాడుతున్నారు.ఇరాన్‌ బలహీన పడినందున ఇప్పటి మాదిరి చైనా దానికి మద్దతుగా ఉండకపోవచ్చని, పశ్చిమదేశాల మార్కెట్‌ను వదులు కొనేందుకు సిద్ధపడదంటూ కొందరు, ఇరాన్‌తో సంబంధాలను చూపి పశ్చిమదేశాలతో ఒప్పందాలు చేసుకోవచ్చన్న విపరీత వ్యాఖ్యానాలు కూడా చేశారు. రెండు దేశాలూ అమెరికా, ఇతర పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదుల దాడులు, ఆర్థిక ఆంక్షలకు గురవుతున్నాయి, వాణిజ్య పోరును ఎదుర్కొంటున్నాయి. సామ్రాజ్యవాద వ్యతిరేకత అన్న అంశమే వారి మధ్య బంధం పెరగటానికి కారణం. పాతిక సంవత్సరాల సహకార ఒప్పందం రెండు దేశాల మధ్య 2021లో కుదిరింది. ఉప్పు నిప్పుగా ఉన్న ఇరాన్‌-సౌదీ మధ్య సయోధ్య కుదిర్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. తాత్కాలికంగా మధ్య ప్రాచ్యంలో ఇరాన్‌ బలహీనపడినంత మాత్రాన దాన్ని వదలివేసే అవకాశాలు లేవని చైనా తీరుతెన్నులను చూసినపుడు అర్ధమవుతుంది. మరింత పటిష్టపరుచుకోవటం, ఆ ప్రాంతంలో అమెరికా, దాని తొత్తు దేశాలను ఎదుర్కోవటం ఎలా అన్న అంశం రానున్న రోజుల్లో కచ్చితంగా ప్రాధాన్యత సంతరించు కుంటుంది. దీనిలో భాగంగానే బ్రిక్స్‌, షాంఘై సహకార సంస్థలోకిి ఇరాన్‌కు షీ జిన్‌పింగ్‌ ఆహ్వానం పలికాడు.
సిరియాలో అసద్‌ ప్రభుత్వం కూలిపోయినంత మాత్రాన అక్కడ అధికారానికి వచ్చిన శక్తులు అమెరికా ఒళ్లో వాలి పోతాయని, ఇజ్రాయిల్‌కు దాసోహమంటాయని చెప్పలేము. తొలుత అక్కడ ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలి. ఆ తరువాతే దాని బాట ఎటు అన్నది స్పష్టం అవుతుంది. అమెరికా అనుకూల దేశంగా ఉన్న సౌదీ అరేబియా నాటకీయ పరిణామాల మధ్య దాన్ని ధిక్కరించి రష్యాకు దగ్గరైంది.చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ను ఆహ్వానించి తాము అమెరికాతో అంటకాగేది లేదన్న సందేశమిచ్చింది. చైనా చొరవతో చిరకాల ప్రత్యర్థిగా ఉన్న ఇరాన్‌తో సయోధ్య కుదుర్చుకుంది. ఇది మధ్య ప్రాచ్యంలో చైనా చొరవలో ఒక మైలురాయి, అమెరికాకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఎదురుదెబ్బ. అమెరికా ఆర్థిక ఆంక్షలు, రాజకీయ ఒంటరితనం నుంచి ఇరాన్‌ కొంత మేర బయటపడింది. చైనాను దెబ్బ తీసేందుకు అమెరికా నాయకత్వంలోని పశ్చిమదేశాలు నిరంతరం ప్రయత్నిస్తున్న పూర్వరంగంలో ప్రతి ప్రాంతంలోనూ వాటిని ప్రతిఘటించే శక్తిగా చైనా ముందుకు వస్తోందని ఇటీవలి అనేక పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ రెచ్చగొట్టే చర్యలతో చైనా-ఇరాన్‌-రష్యా మరింత దగ్గరవుతాయి. ట్రంప్‌ తన యంత్రాంగంలోకి ఎంచుకున్న వ్యక్తుల తీరుతెన్నులను చూసినపుడు అసలే కోతి ఆపైన కల్లుతాగింది అన్నట్లుగా వారి చర్యలుంటాయని వేరే చెప్పనవసరం లేదు.

– ఎం కోటేశ్వరరావు, 8331013288