‘అసలు’ మిగిలే ఉంది

 Sampadakiyamఅనుకున్నట్టే వాంగ్‌చుక్‌ తన దీక్ష విరమించారు. అనుకున్నట్టే కేంద్రం ఒక మెట్టు దిగింది. హౌంశాఖ సహాయ మంత్రిని చర్చలకు పంపుతానంది. మోడీ, షాలతోనే చర్చిస్తానన్న వాంగ్‌చుక్‌ బృందం తమ పట్టు సడలించింది. పదహారు రోజుల దీక్ష అంకం ముగిసింది. ఈ దీక్ష విరమిస్తూ వాంగ్‌ చుక్‌ ”తాను మరోసారి దీక్ష బూనాల్సిన స్థితి రాదనే ఆశిస్తున్నా”నన్నాడు. అదే జరగాలని ఆశిద్దాం.
అక్కడ, అంటే లడఖ్‌లో ఉద్యమిస్తున్నది ఒక వ్యక్తి కాదు. కాబట్టి, ఒక వ్యక్తితోనో, పార్టీతోనో చర్చలు కాదు. మో-షా బృందానికి ఆర్టికల్‌ 370 రద్దు చేసినంత తేలికగా ఈ సమస్య పరిష్కారమయ్యేలా లేదు. ఇప్పటికే లడఖ్‌ బౌద్ధ సంఘాల కో-కన్వీనర్‌ డోర్జే లాక్రుక్‌ ‘తమ నాలుగు పాయింట్ల ఎజెండా నుండి వెనక్కి తగ్గేదేలే’ అని ప్రకటించారు. కొందర్ని కొన్నిసార్లు మోసం చేయొచ్చుగానీ అందర్నీ అన్నిసార్లూ మోసం చేయలేరన్న నానుడి భారతీయ జనతా పార్టీకి ఎంత తొందరగా అర్థమైతే లడఖ్‌కు అంత మంచిది. లడఖ్‌ రెండు స్వయం ప్రతిపత్తిగల ప్రాంతాల సమూహం. అవి లేV్‌ా అపెక్స్‌ బాడీ, కార్గిల్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌లు. జమ్ముకాశ్మీర్‌ ప్రజల సంస్కృతి వేరు, లడఖ్‌ ప్రజల సంస్కృతి వేరు. మతం వేరు. మనోభావాలు వేరు.
2019లో ఆర్టికల్‌ 370 రద్దు సందర్భంలో లడఖ్‌లో విస్తృత చర్చ జరగలేదు. ప్రజల ఆమోదం లేదు. కొందరు వ్యక్తుల ఆమోదం తీసుకుని లడఖ్‌ను ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటుచేశారు. ‘లోక్‌నీతి’ సర్వే ప్రకారం కాశ్మీర్‌ లోయలో దాదాపు ప్రజలంతా 370 అధికరణ రద్దును వ్యతిరేకిస్తున్నారు. హిందువులు మెజారిటీగా ఉన్న జమ్మూలో 40శాతం మంది ప్రజలు ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తున్నారు. అత్యధిక మంది 370 ఆర్టికల్‌ను పునరుద్ధరించాలని కోరుతున్నారని లోక్‌నీతి సర్వే పేర్కొంది. లడఖ్‌లో కొందరైనా వ్యతిరేకించక పోవడానికి కారణం నాటి జమ్మూకాశ్మీర్‌ శాసనసభలో మెజారిటీ జమ్మూ-కాశ్మీర్‌ వారే ఉండటంవల్ల తమ ఆకాంక్షలు నెరవేరడం లేదని భావించారు. కానీ, కేంద్ర పాలిత ప్రాంతమైన తర్వాత కేంద్రమే పాలిస్తుందని పసిగట్టలేకపోయారు.
మొన్నటితో వాంగ్‌చుక్‌ నిరవధిక దీక్ష ముగిసినా ఆయన లేవనెత్తిన పర్యావరణ సమస్యలు అలానే ఉన్నాయి. ‘పర్యావరణం’ పెట్టుబడిదారీ విధానానికి విలోమాను పాతంలో ఉంటుంది. అందుకే అనేక పశ్చిమదేశాల్లో పర్యావరణ వేత్తలు, గ్రీన్స్‌ మూవ్‌మెంట్‌ సోషలిస్టు, కమ్యూనిస్టులతో కలిసి ఉద్యమిస్తున్నారు. ఇది వాంగ్‌చుక్‌ వంటి వారి దృష్టిలో ఉందా అనేది పరిశీలించుకోవాలి. అక్కడి పర్యావరణాన్ని దెబ్బతీసేలా ఖనిజ నిక్షేపాలను తవ్వనిస్తారా, లేదా చూడాలి. ఇజ్రాయిల్‌ బంధం గట్టిగా బిగిసిపోయినాక ఆయుధాలు, మందుగుండు తయారీలో లడఖ్‌లో విస్తారంగా దొరికే గంధకం (సల్ఫర్‌)ను అదానీ హస్తగతం కాకుండా మోడీ సర్కార్‌ నియంత్రిస్తుందా? లడఖీయుల ప్రధాన డిమాండ్‌ వారికి రాష్ట్ర హౌదా లేదా ఆరవ షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్లు కీలకమైనవి. మిగతా దేశమంతాలాగానే ఉపాధి సమస్య వారికీ ప్రధానం. 370 అధికరణం రద్దుచేసి తమ జీవిత లక్ష్యం నెరవేరినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు 2019 నుండీ చంకలు గుద్దుకుంటున్నాయి.
కాని నేడు ప్రజల నిత్య జీవిత సమస్యలను ముందుకు తెచ్చింది వాంగ్‌ చుక్‌ బృందం. ఏడాదంతా మంచు దుప్పటి పరుచుకునుండే ప్రాంతంలో పశువులకు అవసరమైన పచ్చిక మైదానాలు, మనుషులకు (పశువుల్తో సహా) మంచినీరు అందించడం కీలకమైంది. 370 రద్దుతో ‘స్కీయింగ్‌’ (మంచులో ఆడే ఆటల) కోసం భారత పెట్టుబడిదార్లు ఇప్పటికే వెంపర్లాడుతున్నారు. వెరసి, ఇవన్నీ ఆ ప్రాంత పర్యావరణాన్ని ధ్వంసం చేస్తాయని ఆ ఉద్యమం ఆరోపిస్తోంది.
అందుకే, 370 అధికరణం రద్దు కోసం 2019లో మోడీ బృందం నయానా, భయానా చాలామందిని లొంగదీసుకుంది. కాని నేడు ఈ ఉద్యమం లేవనెత్తిన కీలక సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందా? 370 ఆర్టికల్‌ రద్దును ఉపసంహరించాలనే పార్టీల కూటమి నేడు జమ్మూ-కాశ్మీర్‌లో అధికారంలో ఉంది. ఇప్పటికే వారి క్యాబినెట్‌ ఆ డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. ఆ సమస్య ఎలా ఉన్నా లడఖ్‌కు రాష్ట్ర హౌదా కల్పించాలనే న్యాయ సమ్మత డిమాండ్‌ను ఆమోదించడం మోడీ సర్కార్‌కు తప్పనిసరి.