ఆస్కార్‌కు లాపతా లేడీస్‌

ఆస్కార్‌కు లాపతా లేడీస్‌మహిళా దర్శకురాలు కిరణ్‌రావు దర్శకత్వంలో రూపొందిన ‘లాపతా లేడీస్‌’ చిత్రం అరుదైన ఘనత సాధించింది. 97వ ఆస్కార్‌ అవార్డుల కోసం మన దేశం నుంచి ఈ సినిమా ఉత్తమ విదేశీ చిత్ర విభాగం కోసం ఎంపికైంది. ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించింది.
2025 ఆస్కార్‌ అవార్డుల కోసం మన దేశం తరఫున తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల నుంచి 12 చిత్రాలు పోటీ పడగా, ఇందులో ‘లాపతా లేడీస్‌’ హిందీ చిత్రం ఆస్కార్‌ నామినేషన్ల కోసం వెళ్ళింది. ఈ నేపథ్యంలో దర్శకురాలు కిరణ్‌రావు సోషల్‌ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘ఆస్కార్‌కు మా సినిమా ఎంపికైనందుకు చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన కథకు ప్రాణం పోయడంలో ఎంతగానో శ్రమించిన టీమ్‌, వారి హార్డ్‌వర్క్‌కు దక్కిన గుర్తింపు ఇది. సరిహద్దులు దాటి మనుషులను చేరువ చేయటంలో సినిమా అనేది ఓ కీలక మాధ్యమంగా మారింది. మనదేశంలో ప్రేక్షకులు ఏ విధంగా ఈ చిత్రాన్ని ఆదరించారో, అలాగే ప్రపంచస్థాయిలోనూ అదే విధంగా అభిమానిస్తారని ఆశిస్తున్నా. ఆస్కార్‌కి వెళ్ళాలనే నా కల ఈ సినిమాతో సాకారమైనందుకు చాలా గర్వంగా ఉంది’ అని కిరణ్‌రావు తెలిపారు.
ఈసారీ నిరాశే..
ఈసారి కూడా మన తెలుగు సినిమాలు ఆస్కార్‌ ఎంట్రీకి నోచుకోలేకపోయాయి. మన దేశం తరఫున ఉత్తమ విదేశీ చిత్రం విభాగం కోసం పోటీ పడిన చిత్రాల్లో ‘కల్కి’, ‘హను-మాన్‌’, ‘మంగళ వారం’ చిత్రాలు ఉన్నాయి. ఇవి విశేష ప్రేక్షకాదరణ పొందినప్పటికీ ఆస్కార్‌ ఎంట్రీకి వెళ్ళలేక పోవడంతో నిరాశే మిగిలింది.