వరి పంట ఎండిపోతోంది మహాప్రభో

– దిక్కు తోచని స్థితిలో కోట కాలువ రైతులు
– కక్కుర్తి పడుతున్న నీటిపారుదల శాఖ అధికారులు
నవతెలంగాణ-గోవిందరావుపేట
లక్నవరం చెరువు రబీ తైబందీ ఖరారు చేసిన అధికారులు పంటలకు పూర్తిస్థాయిలో నీరు సకాలంలో అందించకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్లో రభీ తైబంది ప్రకటించిన అధికారులు ప్రకటించిన తేదీ కన్నా ఆలస్యంగా నీటిని విడుదల చేయడం వల్ల రైతులు లేటుగా నార్లు పోసుకోవడం జరిగింది. ఇప్పుడు కోట కాలువ పారకం కింద ప్రకటించిన దాని కంటే అధికంగా అక్రమ వరి సాగు కావడం వల్ల కోట కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరు అందక రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఇప్పటికే ఎకరానికి సుమారు పాతిక వేల రూపాయల పెట్టుబడి దాటిందనీ రేపు పంటలు నీరందక ఎండిపోతే పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇది చాలదు అన్నట్టుగా అధికారులు సద్దిమడుగు గేజ్ చేసి నరసింహుల కాలువకు నీటిని విడుదల చేయడం ఆశ్చర్యంగా ఉందని కోట కాలువ రైతులు అంటున్నారు. కాసులకు కక్కుర్తి పడి అధికారులు నీటి చౌర్యానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ సాగులు అరికట్టడంలో అధికార యంత్రాంగం విఫలమైందని అందుకు వారి నైతిక బాధ్యత వహించాలని పంటలు ఎండిన పాపం కూడా వారిదేనని రైతులు అంటున్నారు. కోట కాలువ జాతీయ రహదారి పెట్రోల్ బంక్ సమీపంలో రైతులు రాత్రింబవళ్లు పొలం వద్ద పడుకొని నీరు పారించాల్సిన దుస్థితి నెలకొందని అయినా పారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రభి తై బంది ప్రకటించక పోయిన బాగుండేదని ఇప్పుడు బొచ్చెడు పెట్టుబడి పెట్టి పొలం పారించలేక అవస్థలు పడుతున్నామని బోరున విలపిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యమే నీరందడం లేదు
సప్పిడి ఆదిరెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్
నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే కోట కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందని పరిస్థితి నెలకొందన్నారు. అధికారులు అమ్ముడు పోవడం వల్లే చల్వాయి నరసింహుల కాలువకు నీటిని విడుదల జరిగిందని అందుకు  అధికారులు మూల్యం చెల్లించక తప్పదన్నారు. అక్రమ వరి సాగును అరికట్టడంలోనూ అధికారుల డొల్లతనం తేటతెల్లమైందన్నారు. ఇప్పటికైనా అధికారులు చిత్తశుద్ధితో పనిచేసే అక్రమ సాగును అరికట్టి ఆయకట్టు చివరి భూములకు నీరు అందించాలని లేనియెడల రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.