పంచపాండవులు..మంచం కోళ్లు!

Panchapandas..bed chickens!పంచపాండవులంటే.. మంచం కోళ్లలా… మూడు చూపించ బోయి.. సామెతలా ఉంది రుణమాఫీ మార్గదర్శకాలు. రేవంత్‌ సర్కారు రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలను విడుదల చేసింది. అప్పు, వడ్డీ మొత్తం కలిపి కుటుంబానికి రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రుణమాఫీ మొత్తాన్ని డైరెక్టుగా లబ్ధిదారుల రుణ ఖాతాలకు నగదు బదిలీ పద్ధతిలో జమ చేస్తామని కూడా చెప్పింది. రుణమాఫీ పొందాలంటే ఆధార్‌, ఆహార భద్రతా కార్డు, పట్టా పాసు పుస్తకాలకు లింకు పెట్టడంతో గొళ్లాలు పడ్డాయి.
ప్రభుత్వ జీవోను పరిశీలిస్తే ఆదార్‌కార్డు, పాస్‌బుక్‌ డేటా, రేషన్‌కార్డు డేటా ఒకటిగా ఉన్న వారికే రుణమాఫీ వర్తింప చేసింది. అయితే ఈ కార్డులేవీ లేని కుటుంబాలు రాష్ట్రంలో లక్షల్లో ఉన్నాయి. గత పదేండ్ల నుండి రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనే లేదు. మరి ఈ పదేండ్లలో పెండ్లి చేసుకొని వేరు కుటుంబాలు పెట్టుకున్న వారి పరిస్థితేంటీ? అలాగే పహనీ ఉన్నప్పటికీ పాసు పుస్తకం ఉంటేనే రుణమాఫీ వర్తిస్తుందని కూడా మరో లింకు పెట్టారు. ఇప్పటికే పాసు పుస్తకాల కొరకు ధరణిలో 12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వ ప్రజాపాలన సర్వేలో తేలింది. అవి ఏండ్ల నుండి అలాగే పెండింగ్‌లో ఉన్నాయి. ఇక రేషన్‌కార్డుల కొరకు దరఖాస్తు చేసుకున్న వారు కూడా లక్షల్లో ఉన్నారు. కానీ ప్రభుత్వ జీవో ప్రకారం రుణమాఫీ మాత్రం ఆధార్‌కార్డు, పాస్‌బుక్‌, రేషన్‌కార్డు ఉన్న వారికే వర్తింపజేశారు. ఈ షరతుల వల్ల చిన్న, సన్నకారు, కౌలు రైతులే ఎక్కువగా నష్టపోతున్నారు.
అలాగే వ్యవసాయం కోసం రుణం తీసుకున్న సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్స్‌ (స్వయం సహాయక బృందాలు) జాయింట్‌ లయబిలిటీ గ్రూప్‌, రైతు మిత్ర గ్రూప్‌, కౌలుదారులకు ఇచ్చిన లోన్‌ ఎలిజిబిలిటీ కార్డు ఉన్న వారికి రుణమాఫీ వర్తించదని ప్రకటించారు. వాస్తవానికి ఈ నాలుగు గ్రూపుల్లోని వారు అత్యంత పేదలే కాక దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల నుండి వచ్చిన వారే ఎక్కువ. రీషెడ్యూల్‌ చేసిన రుణాలకు కూడా రుణమాఫీ వర్తించదని మరో నిబంధన చెబుతున్నది. గతంలో కరువులు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు బ్యాంకులు మూడు నుండి ఐదేండ్ల వాయిదాలపై రుణాలు రీషెడ్యూల్‌ చేశాయి. ఈ లెక్క ప్రకారం వీరికి కూడా రుణమాఫీ వర్తించదు. అలాగే రెండు లక్షలకు మించి రుణం తీసుకున్నవారు, రెండు లక్షలకు పైన ఉన్న అప్పు చెల్లిస్తేనే మాఫీ వర్తిస్తుందనే నిబంధన కూడా పెట్టారు.
గత పదేండ్లుగా బ్యాంకులు రుణాలివ్వకపోవడం వల్ల అసలుకు మించి వడ్డీలు పెరిగాయి. చాలామంది రైతులకు రూ.2 లక్షలకు పైగా బాకీలు ఉన్నప్పటికీ గతంలో ప్రకటించిన 2014, 2018 రుణమాఫీ పథకాలు వారికి వర్తించలేదు. అలాంటి వారికి రుణం రెండు లక్షలకు పైగా ఉంది. వారంతా ఇప్పుడు ఆ అప్పు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. అలాగే కొంత మంది రైతులు బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. అలాంటి రైతుల గురించి కూడా జీవోలో ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రస్తుతం వానాకాలం మొదలయ్యింది. కానీ పంటలు వేసేందుకు పెట్టుబడి లేక రైతులు, కౌలు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు లక్షలకు మించి ఉన్న అప్పు చెల్లించడం వారికెలా సాధ్యమో ప్రభుత్వమే చెప్పాలి. అంటే వాటిని తీర్చడం కోసం మళ్లీ అప్పులు చేయమనేగా..!
అలాగే పీఎం కిసాన్‌ డేటాకు రుణమాఫీని జోడించడం వల్ల చాలా మంది రైతులు రుణమాఫీ అర్హత కోల్పోయే అవకాశం ఉంది. వాస్తవానికి రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులు ఉంటే బ్యాంకులు 43 లక్షల మందికి మాత్రమే అప్పులిచ్చాయి. పీఎం కిసాన్‌ పథకం కింద 31 లక్షల మందికే వర్తింపజేశారు. అందువల్ల పీఎం కిసాన్‌ డేటాను వర్తింపజేయడం వల్ల అర్హత కలిగిన వారు రుణమాఫీ పొందలేకపోతారు. 2018 డిసెంబర్‌ నుండి, 2023 డిసెంబర్‌ వరకు ప్రకటించిన రుణమాఫీని వర్తింపజేయడానికి కొన్ని బ్యాంకులు జనవరి 2024 నుండి రుణాలను కొత్త రుణాలుగా రీషెడ్యూల్‌ చేశాయి. గతం నుండి బ్యాంకులు ‘బుక్‌ అడ్జెస్ట్‌మెంట్‌’ ద్వారా రైతులకు రుణాలు పెంచుకుంటూ వస్తున్నాయి. అందువల్ల 2023, డిసెంబర్‌ తర్వాత రీషెడ్యూల్‌ చేసిన రుణాలకు లేదా బుక్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేసిన రుణాలకు రుణమాఫీని వర్తింపజేయాలని కూడా రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
ఇప్పటికే రైతుల, రైతు సంఘాల ఆందోళన గమనించిన రాష్ట్ర సర్కారు ఆహార భద్రతా కార్డుతో సంబంధం లేకుండా రైతులందరికీ రుణమాఫీ వర్తింప చేస్తామని చెప్పింది. అయితే దీన్ని నిజంగా అమలు చేస్తారో లేదో అనే అను మానం మాత్రం రైతుల్లో ఉంది. కనుక ఈ విషయాన్ని జీవోలో వెంటనే పొందుపరచాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిజంగా రైతులకు మేలు చేయాలనుకుంటే వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతు సంఘాలు కోరినట్టు జీవోలో పేర్కొన్న సమస్యలకు వెంటనే సవరణలు చేయాలి. అప్పుడే అన్నదాతలందరికీ న్యాయం జరిగే అవకాశముంది.