ఆగమవుతున్న పంచాయతీ పాలన

– సతమతమవుతున్న పంచాయతీ ప్రత్యేక అధికారులు
– గ్రామ పాలనతో సంబంధం లేని శాఖల అధికారులు
– ఇటు మాతృశాఖకు అటు అదనపు బాధ్యతలకు జరగని న్యాయం
– సవాల్ గా నీటి ఎద్దడి
నవతెలంగాణ – నిజాంసాగర్
గ్రామ పంచాయతీల పాలకవర్గల పదవి కాలం రెండు నెలల క్రితం ముగియగా ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. మండలంలో మొత్తం 27 గ్రామ పంచాయతీలు ఉండగా మొత్తంగా పదిమంది గెజిటెడ్ అధికారులకు ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు కేటాయించారు. ఈ అధికారులందరూ కూడా వివిధ ప్రభుత్వ శాఖల్లో కీలకమైన అధికారులే దీంతో అటు మాతృ శాఖకు ఇటు పంచాయతీల విధులు నిర్వర్తిస్తూ సమన్యాయం చేయాల్సి ఉంటుంది. కానీ శాఖ పరమైన పనులతో ఒత్తిడిని ఎదుర్కొంటున్న వీరికి పంచాయతీల అదనపు బాధ్యతలు అప్పగించడం పై ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. చాలామంది ప్రత్యేక అధికారులు మండలంలో ఇన్చార్జి గానే ఉన్నారు. వీరు వేరే మండలంలో వారి యొక్క బాధ్యత నెరవేర్చి తిరిగి నిజాంసాగర్ మండలంలో శాఖపరమైన బాధ్యతలు నెరవేర్చి తిరిగి పంచాయతీ అధికారులు కూడా బాధ్యత నెరవేర్చాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు వరకు పంచాయతీల బాధ్యతలు అప్పజెప్పారు ఇన్ని శాఖ పరమైన పనులలో పంచాయతీలలో సరైన పాలన జరగడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మండలంలోని చాలా గ్రామాలలో ఉపాధి హామీ పనులలో నిర్లక్ష్యం, మొక్కల పెంపకంలో కూడా  అశ్రద్ధ, నీటి ఎద్దడి చాలా ఉన్నాయి గ్రామపంచాయతీ కార్యదర్శులు కూడా సమయపాలనలో నిర్లక్ష్యంగా వహిస్తున్నారని గ్రామాల్లో గ్రామపంచాయతీలో ఉదయం ప్రజలకు అందుబాటులో ఉండవలసిన అధికారులు కూడా టైం కు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వలన ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. మండలంలోని ప్రజలు ఏదైనా అవసరం ఉండి మండలం లోని అధికారుల దగ్గరికి వెళ్తే వారు ప్రత్యేక అధికారుల బాధ్యతపరంగా వేరే వేరే గ్రామాలకు వెళ్తున్నారు. దీనివలన ప్రజలకు వారి పనులు కాక పోవడం వలన రోజువారీగా మండలం చుట్టూ తిరుగుతూ నానా ఇబ్బందులు గురి అవుతున్నారు. ఈ ప్రభుత్వం అయిన మండలానికి ఇన్చార్జ్ అధికారులు గాక పర్మినెంట్ అధికారులను నియమిస్తుందో లేదో చూడాలి అని ప్రజలు ఆరోపిస్తున్నారు.