పేపర్‌ లీక్‌ కేసును సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

– ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎల్‌ మూర్తి డిమాండ్‌
నవతెలంగాణ-ఓయూ
టీఎస్‌పీఎస్‌సీలో ప్రశ్నాపత్రాల లీకేజీపై రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర విచారణ చేపట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎల్‌ మూర్తి డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్‌సీలో ప్రశ్నాపత్రం లీకేజీపై గురువారం ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్‌ను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రశ్నాపత్రం లీకేజ్‌లో ప్రభుత్వ పెద్దల కుట్ర కూడా దాగుందన్న అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు పోరాడతామని హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ ఓయూ కార్యదర్శి రవి నాయక్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా జరగకపోవడం బాధాకరం అన్నారు. టీఎస్‌పీఎస్‌సీలోని సభ్యులందరినీ తొలగించి నూతన సభ్యులను, చైర్మెన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఉపాధ్యక్షులు రామాటేంకి శ్రీను, సాయికిరణ్‌, రాజు, నాయకులు సందీప్‌, పునీత్‌, నీరజ్‌, రాజశేఖర్‌, ప్రవీణ్‌, మధు, విద్యార్థులు పాల్గొన్నారు.