ప్యారిస్‌ కమ్యూన్‌: ఒక గమనం! ఒక గమ్యం!

కమ్యూనా..! ఏంటది..? కథా…? సినిమానా..? నవలా..? ఏదీ కాదు. 1871 మార్చి 18న పారిస్‌ కార్మికవర్గం మానవజాతి చరిత్ర పుస్తకంలో రాసిన ఒక అజరామర ఉదంతం. పెట్టుబడిదారీ వ్యవస్థ 17, 18 శతాబ్దాలలో ఐరోపా ఖండం, అమెరికాలలో వేళ్లూనికుని ప్రపంచాన్ని ఆవహించడానికి ఉర్రూతలూగు తున్న రోజులవి. ఫ్రాన్స్‌ దేశంలో 1789లో సాగిన పెట్టుబడిదారీ విప్లవం (పారిశ్రామిక విప్లవం) ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసింది. కారణం తరతరాల పురాతన సమాజాలను ముఖ్యంగా నాటి రాచరిక పాలనను ఆ దేశ పెట్టుబడిదారీ వర్గం అత్యంత హింసాత్మకంగా కూలదోసి ఆధునిక రాజ్య స్థాపన చేసింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం నినాదాలు మిన్నుముట్టాయి. అయితే కొద్ది దశాబ్ధాలలోనే పెట్టుబడిదారీ వ్యవస్థ క్రూరత్వం ప్రపంచానికి తెలియవచ్చింది. ఐరోపా ఖండంలోనే ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ వ్యవస్థే సృష్టించిన కార్మికవర్గం తిరుగుబాట్లు ప్రారంభించింది. కార్ల్‌మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఏంగెల్స్‌ల నాయకత్వాన కమ్యూనిస్టు లీగ్‌ (1847)ఏర్పడింది. మొదటి అంతర్జాతీయ కార్మిక సంస్థ 1864లో ఏర్పడింది. మార్క్స్‌, ఏంగెల్స్‌లు 1848లో ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ విడుదల చేశారు. ఈ క్రమంలో అదే ఫ్రాన్స్‌ దేశంలో కార్మికవర్గం 1871లో స్వతంత్రంగా పారిస్‌ నగరంలో అధికారంలోకి వచ్చి 72రోజులు పరిపాలన సాగించింది. దీనినే ”పారిస్‌ కమ్యూన్‌” అంటారు. కార్మికవర్గం ఏ పరిస్థితులలో అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చిన వెనువెంటనే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా, క్షణం తీరిక లేకుండా కార్మికవర్గ ప్రభుత్వాన్ని ఎలా నడిపింది, కేవలం 72రోజులలో ఏమేమి చేయగల్గింది, చివరకు ఎలా కూల్చబడింది… అన్నది నేటి తరానికి ముఖ్యంగా విప్లవ కార్మిక సంస్థలలో పనిచేస్తున్న యువతకు తెలియాలి.
నేడు ప్రపంచ గమనం ఎటుంది?
ఆధునిక రచయితలందరూ పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక సాంఘిక వ్యవస్థగా అది పుట్టిన తరువాత ఎన్నడూ లేనంత బలహీనమైన స్థితికి చేరుకుంది అని రాస్తున్నారు. ఆర్థిక మాంద్యం, దృవీకరణ మానవ చరిత్రలో ఎన్నడూ లేనంత తీవ్రమైన ఆర్థిక అసమానతలు, వీటికి తోడు నిరుద్యోగం, ఉపాధిలేమి, పేదరికం, ఆకలి, అనారోగ్యం, పర్యావరణ వినాశనం… నేటి పెట్టుబడిదారీ ప్రపంచం ప్రధాన లక్షణాలుగా ఉన్నాయి.
ప్రముఖ చరిత్రకారుడు ఎరిక్‌ హాబ్స్‌బామ్‌ ”మానవాళి తనకంటూ ఓ మంచి భవిష్యత్తు కావాలనుకుంటే ప్రస్తుత వ్యవస్థని కొనసాగనివ్వకూడదు. ఒక వేళ దీనిపైనే మూడవ సహస్రాబ్ధిని నిర్మించాలను కుంటే విఫలం అవుతాము. చివరకు మిగిలేది ఓ చీకటి సమాజమే” అని తేల్చి చెప్పారు. కార్ల్‌మార్క్స్‌, ఏంగెల్స్‌లు కమ్యూనిస్టు ప్రణాళికలో చెప్పినట్లు నేడు మునుపెన్నటికన్నా ప్రపంచం ఎక్కడికి చేరుకుందంటే సమాజాన్ని విప్లవాత్మకంగా పునర్‌ నిర్మించడమా? లేక పోటీపడుతున్న వర్గాలన్నీ సమిష్టిగా నాశనం అవటమా? అన్న దశకు చేరుకున్నాయి అనిపిస్తుంది.
పారిస్‌ కమ్యూన్‌ పిలుపు
తాను చెప్పిన ప్రజాస్వామ్యం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, అందరికీ సుఖవంతమైన జీవితం, ఆధునిక ప్రగతిశీల భావాలు, శాస్త్రీయ దృక్ఫథంపై ఆధారపడ్డ సమాజాన్ని నిర్మిస్తాం అని నమ్మబలికిన పెట్టుబడిదారీ వ్యవస్థ పుట్టిన 100ఏండ్లలోనే అవన్నీ దానికి సాధ్యం కాదని, ఆ పని విప్లవ కార్మికవర్గం మాత్రమే చేయగలదని 1871లోనే పారిస్‌ కమ్యూన్‌ చేసి చూపించింది. మానవ చరిత్రలో మొట్టమొదటసారి కార్మిక వర్గం మాత్రమే ప్రజాస్వామ్యం కోసం జరిగే పోరాటాన్ని సమసమాజం కోసం జరిగే పోరాటంగా మలచగలదని నిరూపించింది. 1871 మార్చి 18న ప్యారిస్‌ నగర కార్మికులు ఆ నగరం నుండి పెట్టుబడిదారులను తరిమేసి అధికారం చేపట్టారు. పది రోజుల తర్వాత మార్చి 28న ప్యారిస్‌ కమ్యూన్‌, కార్మిక ప్రభుత్వాన్ని, తొలి కార్మిక రాజ్యాన్ని స్థాపించారు. ఈ విప్లవం పెట్టుబడిదారీ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. కారణం అవి క్రూరమైన మూఢ, మత విశ్వాసాలకు రూపాలుగా ఉన్న భూస్వామ్య రాచరిక పాలనను అంతంచేసిన పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచమంతా విస్తరిస్తున్న రోజులు. ప్రజాస్వామ్యం, గణతంత్రం, లౌకికతత్వం, హేతువాదం, శాస్త్రీయ దృక్పథాల ఆధారంగా తన పరిపాలన ఉంటుందని పెట్టుబడిదారీ పాలకులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న రోజులు. అయితే అప్పటికే మార్క్స్‌ ఏంగెల్స్‌ల నాయకత్వాన ప్రారంభమైన మొదటి ఇంటర్నేషనల్‌ పెట్టుబడిదారీ దేశాల (జర్మనీ, ఫ్రాన్స్‌, అమెరికా, ఇంగ్లాండ్‌, బెల్జియం తదితర) అన్నింటా కార్మిక వర్గాన్ని పోరాటాలవైపు కూడగడు తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ బండారాన్ని, దాన్ని కూల్చగలిగిన ఏకైక శక్తి కార్మిక వర్గమని, అది నిర్వహించాల్సిన చారిత్రక పాత్ర గురించి మార్క్స్‌, ఏంగెల్స్‌లు సిద్ధాంతం రూపొందించారు. కార్మికవర్గ విప్లవ సిద్ధాంతం-మార్క్సిజం కార్మిక వర్గంలో ప్రభావం కలుగ జేస్తున్నది. ఈ నేపథ్యంలో అనివార్యంగా వచ్చిన అవకాశాన్ని పారిస్‌ కార్మిక వర్గం అందిపుచ్చుకున్నది. జర్మనీతో సాగిన యుద్ధంలో ఫ్రాన్స్‌ ప్రభువు నెపోలియన్‌ 1870లో చేతులెత్తేశాడు. ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని స్థాపిస్తామని ప్రగల్భాలు పలికిన ఫ్రెంచి పెట్టుబడిదారులు చతికిలబడిపోయారు. జర్మన్‌ సైన్యాలు ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ నగరాన్ని (ఇందులో 20జిల్లాలు ఉంటాయి) చుట్టుముట్టాయి. ఈ పరిస్థితులలో పారిస్‌ కార్మికులు ఎదురు తిరిగారు. పెట్టుబడిదారులను తరిమేశారు. పారిస్‌ నగరాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. వెనువెంటనే తమది సోషల్‌ గణతంత్ర రాజ్యంగా ఉంటుందని ప్రకటించారు. దిమ్మ తిరిగిపోయిన ఫ్రెంచి పెట్టుబడిదారీవర్గం జర్మన్‌ ప్రభుత్వంతో, ఆ దేశ దోపిడీదారులతో నిస్సిగ్గుగా ఒప్పందం చేసుకొని వారి సైన్యం సహకారంతో పారిస్‌ నగరంపై తీవ్రమైన దాడి చేసి 72రోజుల కార్మిక వర్గ రాజ్యాన్ని పారిస్‌ కమ్యూన్‌ని రక్తపుటేరుల్లో ముంచెత్తింది. సుమారు 40,000మంది కమ్యూనార్డ్స్‌ని కాల్చిచంపారు. కొన్ని వేలమంది విదేశాలకు వెళ్లిపోవాల్సి వచ్చింది. జైళ్లు కమ్యూన్‌ కార్యకర్తలతో నిండిపోయాయి. పెట్టుబడిదారీ దేశాల పాలకులందరికీ మొదటి ఇంటర్నేషనల్‌ని నాశనం చేయాలని, అందుకు వారి దేశాల్లో ఉన్న ఇంటర్నేషనల్‌ నాయకుల్ని వేటాడి అంతం చేయమని పిలుపులు వెలువడ్డాయి. బూర్జువా పత్రికలు కమ్యూన్‌పై విషం చిమ్మే రాతలు రాశాయి.
ప్యారిస్‌ కమ్యూన్‌ పాలన
మార్చి 18 విప్లవం జయప్రదం కాగానే కార్మిక వర్గం నగరంలో ఎన్నికలు నిర్వహించింది. ప్రజా ప్రతినిధులు కార్మికులకు అందుతున్న (నాటికి ఆరువేల ఫ్రాంకులు) కనీస వేతనం మాత్రమే తీసుకోవాలని షరతు విధించింది. కమ్యూన్‌ ఏర్పడగానే మొదటి చట్టం నిరంకుశ పోలీస్‌, సైన్యం వ్యవస్థలను రద్దు చేసింది. వాటి స్థానంలో శక్తివంతులైన ప్రజలే సైన్యం అని ప్రకటించింది. న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నత అధికారులు ఎవరైనా ప్రజలతో ఎన్నుకోబడాల్సిందే. నచ్చకపోతే వారిని దిగిపొమ్మని, తిరిగి వేరే వారిని ఎన్నుకునే హక్కును ప్రజలకు ఇస్తూ చట్టం చేయబడింది. ఫ్రాన్స్‌ జాతి ఉన్మాదానికి చిహ్నాలుగా ఉన్న రాచరిక ఆనవాళ్లను తొలగించి వేసింది. ప్రజలపై ఉన్న అక్రమ వడ్డీలను రద్దు చేసింది. మూసి వేయబడ్డ కార్ఖానాలను కార్మికుల సహకార సంస్థలకు అప్పగించింది. కార్ఖానాలలో రాత్రి పనులు నిషేధించింది. కార్మికులపై అపరాధ రుసుం వేసే పద్ధతిని రద్దు చేసింది. విప్లవాత్మకమైన మరో నిర్ణయం ఏమంటే మతాన్ని, రాజ్యాన్ని విడగొట్టడం. లౌకిక విద్యను మాత్రమే బోధించాలని, మత విషయాలు పాఠ్యాంశాలలో ఉండరాదని చట్టం చేయడం. నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థను రూపొందించింది. ఆ విధంగా కమ్యూన్‌ ఏవో కొన్ని సంకుచిత జాతీయ లక్ష్యాలు కోసం కాకుండా మొత్తం అణగారిన శ్రామిక జనబాహుళ్యం కోసం నిలబడింది. పోరాడింది. పోరాడుతూనే నేలకొరిగింది. విఫలమైనప్పటికీ ఇటువంటి మహత్తర పోరాటాలను కార్మిక వర్గం చేస్తూనే ఉండాలి. కామ్రేడ్‌ లెనిన్‌ ”కొన్ని నిరాశా సందర్భాలలో కూడా అవకాశం ఉండదని తెలిసినప్పటికీ జరిగే పోరాటాలు ప్రజానీకాన్ని భవిష్యత్‌ పోరాటాలకు సన్నద్ధం చేయడానికి పాఠశాలలుగా ఉపయోగ పడతాయని” అంటారు. ఈ సందర్భంగా కార్ల్‌మార్క్స్‌ చెప్పినట్లు… ”ప్యారిస్‌ కమ్యూన్‌ లక్ష్యాలు కార్మిక వర్గం విముక్తి చెందేవరకు చరిత్రలో మరలా మరలా ముందుకు వస్తూనే ఉంటాయి” అని గుర్తుంచుకోవాలి. నిజం. ఇప్పుడు మరల ప్యారిస్‌ కమ్యూన్‌ని ముందుకు తెద్దాం. సాధించుకుందాం సోషలిస్టు వ్యవస్థని.
– ఆర్‌. రఘు
సెల్‌:9490098422