ప్రత్యక్షంగానే దాడి మొదలైంది. విభజన కూడా బహిరంగంగానే ఆరంభమైంది. నీవేవరో? నీ పేరేమిటో? బోర్డు కట్టి మెడకు తగిలించుకోమంటున్నారు. నాటి హిట్లర్, ముస్సోలినీల అడుగుల్లో అడుగులు వేస్తూ నిరంకుశంగానే యోగి తెగబడుతున్నారు. మనుషులను మతాలుగా విభజించి చిచ్చు పెట్టేందుకు ప్రజాస్వామ్య దేశంలో బాహటంగానే తలపులు తెరుచుకుంటున్నాయి. ఈ దేశం ‘మీది కాదు మాది’ అంటే భిన్నత్వంలో ఏకత్వంలా కలిసుండే ప్రజలు ఎక్కడివెళ్లాలి? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆంక్షల బోనులో ప్రజల్ని బంధిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో సోమవారం నాడు మొదలైన కన్వర్‌యాత్ర ఆగస్టు 4తో ముగుస్తుంది. ఈ యాత్ర సాగే దారి పొడవున ఉన్న తినుబండారాలు అమ్మే దుకాణాలు, టీ కొట్లు, హోటళ్లు, పళ్లబండ్లు మొదలైన వాటి ముందు యజమానుల పేర్లు, వాటిలో పని చేసే వారి పేర్లు, వ్యక్తిగత వివరాలతో బోర్డులు పెట్టాలంటూ తొలుత ముజఫర్ నగర్ పాలనా విభాగం ఆదేశించింది. ఆ తరవాత ఈ ఆదేశాన్ని యోగీ ప్రభుత్వం రాష్ట్ర మంతటికీ వర్తింపచేసింది. ఆ బాటలోనే ఉత్తరా ఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు నడిచాయి. ఆ పేర్లను బట్టి వారి కుల మతాలు తెలుసుకోవాలన్న ఉద్దేశం ఈ ఆదేశాల వెనక దాగి ఉంది.ఈ తీరును ఏమనాలి? ఇది దేనిని సూచిస్తున్నట్టు?
వారి అసలైన ఉద్దేశం కనిపించకుండా మభ్య పెడుతూ ఇచ్చిన ఆదేశాలు ఇవి. నేమ్‌ప్లేట్స్ ప్రదర్శిం చనివారికి జరిమానా విధిస్తారు. ఎవరు మనకు వడ్డిస్తున్నారని కాకుండా.. తినాలనుకుంటున్న ఆహారాన్ని బట్టి మనం రెస్టారెంట్‌కు వెళ్తాం. గుర్తింపును బట్టి దూరం పెట్టే ఉద్దేశమే ఈ ఉత్తర్వుల్లో కనిపిస్తోంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అది అక్కడితోనే ఆగలేదు. ఆ దుకాణాల్లో ముస్లిం ఉద్యోగులుంటే వారిని తొలగించాలని ఆదేశించిన ఉదంతాలూ ఉన్నాయి. ఈ యాత్ర వలన ఆ ప్రాంత ముస్లిములు ఉపాధి కొల్పోవాల్సిన పరిస్థితి.
యోగి ప్రభుత్వచర్యను స్వపక్షం విపక్షం అన్న తేడాలేకుండా అన్ని పక్షాలు తూర్పారబడ్తున్నాయి. అంటే ఇది ఎంతటి ప్రజాకంటక ఆదేశమో అర్థం చేసుకోవచ్చు. అన్య మతస్థుల వ్యాపారాలను దెబ్బతీసే ఉద్దేశం వికృతరీతిలో బయటకువస్తోంది. ప్రస్తు తం కేంద్రంలో బీజేపీతో కలిసి అధికారం పంచుకుంటున్న నితీశ్ కుమార్ నాయ కత్వంలోని జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జెపి, ఆర్‌ఎల్డీ కూడా ఈ వివక్షా పూరిత ఉత్తర్వును దుయ్యబడు తున్నాయి. గతంలోనూ ఇలానే మాంసాన్ని బహిరంగంగా అమ్మకూడదని నిబంధన యోగి ప్రభుత్వం తీసు కొచ్చింది. అప్పుడు కూడా ‘భక్తుల మనోభా వాలు దెబ్బతినకుండా ఉండేందుకే..’ అంటూ రాగాలు తీశారు. కానీ, బాధితులకు కూడా మనో భావాలు ఉంటాయి కదా? వాటి సంగతేమిటి?
ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ ప్రజలు మతోన్మాదాన్ని తిప్పికొట్టారు. సాక్షాత్తు రాముడు ”కొలువైన” అయోధ్యలోనూ, శంకరుడు ”కొలువైన” బద్రీనాథ్‌లోనూ కాషాయపార్టీని జనం విసిరికొట్టారు. అయినా వాటి నుంచి గుణపాఠాలు నేర్వని బీజేపీ సంస్కృతీ సంప్రదాయాలను ఆచరిస్తున్నామనే పేరుతో, గౌరవిస్తున్నామనే సాకుతో ప్రజల్ని ఆంక్షల ఛట్రంలోకిలాగే తంత్రం నడుపుతున్నారు. ఇది భారత సంస్కృతిపై దాడే. దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే కన్వర్‌యాత్ర ఉంది. అప్పుడెపుడూ ముస్లింల మీద ఈ రకమైన ఆంక్షలు ఏ ప్రభుత్వం విధించిన పాపాన పోలేదు. ఎప్పుడూ ఎలాంటి ఆటంకాలు రానిది ఇప్పుడే ఎందుకు సృష్టించబడుతున్నవి? ‘హిందూ, ముస్లిం భారుభారు’ అంటూ సోదరుల్లా కలిసుండే వారి మధ్య విభజన చిచ్చును ఎందుకు రగిలిస్తున్నారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో మైనార్టీ ప్రజలు నిత్యం అభద్రత, ఆందోళన, అసహనంతో బతుకులీడుస్తున్నారు. వారికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ఫలాలకు కత్తెరేశారు. ముస్లింల వృత్తిలో ప్రధానమైనది మాంసం విక్రయించడం. ఇది ఏండ్లుగా సాగుతున్నా ఇప్పుడు కొత్తగా ఊరేగింపులు జరిగే ప్రాంతాల్లో, శోభాయాత్రలు నిర్వహించే ప్రదేశాల్లో, హోమాలు జరిగే చోట్ల ముస్లింలపై విధిస్తున్న ఆంక్షలతో వారి జీవనోపాధి ఏం కావాలి? సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నాడు ఇచ్చిన తీర్పు కొంత ఆశాజనకంగా ఉంది.
నేడు మన దేశంలో అమలవుతున్న ఆంక్షలు. ఇక్కడ ముస్లింల మీద జరుగుతున్న ప్రత్యక్ష, పరోక్ష దాడులు చూస్తుంటే తాలిబన్లు విధిస్తున్న ఆంక్షలను తలపిస్తున్నాయి. ఇజ్రాయిల్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ విధానం దేశాన్ని నిత్యాగ్నిగుండంగా మార్చే ప్రమాదం ఉంది. విభజించు, పాలించు నినాదంతో మత, విద్వేష పాలన సాగిస్తున్న కేంద్రం విధానాల్ని ఎదుర్కోవడం ప్రస్తుతం దేశ లక్ష్యం. లౌకిక ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న శక్తులకు మద్దతునివ్వడం, వారిబాటలో అడుగులేయడం ప్రజల కర్తవ్యం. చీకట్లోకి నెడుతున్న భారతావనికి వెలుగులు చూపడం అందరి బాధ్యత. ఇక ఆలోచించాల్సింది పౌర సమాజమే…