కాంగ్రెస్‌ తన్నుల పార్టీ.. బీఆర్‌ఎస్‌ టన్నుల పార్టీ

Congress is a party of brothers.. BRS is a party of brothers– ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్‌ వన్‌
– పనిచేసేవాళ్లు కావాలా? పగోళ్లు కావాలా..?
– ఖమ్మంలో మెడికల్‌ కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్‌రావు
– మద్దులపల్లిలో నర్సింగ్‌ కళాశాలకు శంకుస్థాపన
– చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నా: మంత్రి పువ్వాడ
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
‘కాంగ్రెస్‌ తన్నుల పార్టీ.. మాది టన్నుల పార్టీ’ అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. 50 ఏండ్ల కాంగ్రెస్‌ పార్టీ హయాంలో నీళ్లు, ఎరువులు, కరెంట్‌ కోసం రైతులు తన్నుకున్నారని తెలిపారు. అధికారం కోసం ఇప్పుడా పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారన్నారు. అప్పుడే పదవుల కోసం కుర్చీల కోట్లాటలు మొదల య్యాయని తెలిపారు. ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్‌ వన్‌గా ఉందన్నారు. ప్రపంచం లోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం పాలమూరు రంగారెడ్డిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభిస్తుంటే…ఆ ప్రాజెక్టు రాకుండా రకరకాల అడ్డంకులు సృష్టించిన కాంగ్రెస్‌.. నేడు ఏకంగా ఆ ప్రాజెక్టే దండగ అనే రీతిలో మాట్లాడు తోందన్నారు. గురువారం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి హరీశ్‌.. పాత కలెక్టరేట్‌, ఆర్‌అండ్‌బీ బిల్డింగ్స్‌ సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలతో పాటు ఖమ్మం రూరల్‌ మండలం మద్దులపల్లిలో నర్సింగ్‌ కళాశాల కు శంకుస్థాపన, మమత మెడికల్‌ కళాశాల సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌తో పాటు విపక్షాలపై మండిపడ్డారు.
చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నాం: మంత్రి పువ్వాడ
నేడు క్షణాల్లో మెడికల్‌ కళాశాలలకు అనుమతు లిస్తుంటే.. నాడు లెటర్‌ ఆఫ్‌ ఇండెంట్‌ ఇస్తే.. లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌ ఇవ్వకపోయేవారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ గుర్తు చేశారు. మమత మెడికల్‌ కళాశాల సిల్వర్‌ జూబ్ల్లీ వేడుకల్లో ఆయన మాట్లా డారు. తన మమత మెడికల్‌ కళాశాలకు ఇలాంటి ఇబ్బందులే తలెత్తితే కేంద్ర మాజీ మంత్రి వెంకయ్య నాయుడి సహకారంతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహాయం చేశారన్నారు. ఇప్పుడు ఈ కళాశాల నిలదొక్కుకోవడానికి కేసీఆర్‌ దోహదపడుతున్నారని తెలిపారు. ఏపీలో కక్ష పూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయి స్తున్నారని తెలిపారు. చంద్రబాబు అరెస్టును ఖండి స్తున్నామన్నారు. విపక్ష నేతలు పిండం పెడతా మన్నా పెద్దాయన కేసీఆర్‌ ఎలాంటి కక్షపూరిత చర్యలకు దిగలేదన్నారు. ఏపీ, తెలంగాణ పాలనా వైరుధ్యానికి ఇది నిదర్శనమన్నారు. 85వ వసంతం లోకి అడుగిడిన మమత మెడికల్‌ కళాశాల ఫౌండర్‌ పువ్వాడ నాగేశ్వరరావుకు మంత్రి హరీశ్‌రావు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా మమత మెడికల్‌ కళాశాల చైర్మెన్‌ పువ్వాడ జయశ్రీ అతిథులను వేదిక మీదకు ఆహ్వానించారు. నర్సింగ్‌ కళాశాల శంకుస్థాపనకు వచ్చిన అతిథులకు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఎంపీ నామ నాగేశ్వర రావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తాతా మధుసూదన్‌, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్లు, హరిప్రియ, సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మెన్‌ లింగాల కమల్‌రాజ్‌, మేయర్‌ పునుకొల్లు నీరజ, డీసీసీబీ, డీసీఎంఎస్‌, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, సుడా చైర్మెన్లు కూరాకుల నాగభూషణం, రాయల శేషగిరిరావు, కొండబాల కోటేశ్వరరావు, బచ్చు విజరుకుమార్‌, ఖమ్మం మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ దోరేపల్లి శ్వేత, వివిధ డివిజన్‌ల కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
రాబోయే ఎన్నికల్లో నోబెల్స్‌.. గోబెల్స్‌ మధ్య పోటీ
రానున్న ఎన్నికల్లో చేసిన పనులు చెప్పుకునే బీఆర్‌ఎస్‌ నోబుల్స్‌కు, అబద్దాలు చెప్పే గోబెల్స్‌ కాంగ్రెస్‌కు మధ్య పోటీ అని వ్యాఖ్యానించారు. వంద అబద్దాలాడినా జనబలం కాంగ్రెస్‌కు లేదన్నా రు. బీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలే హైకమాండైతే.. కాంగ్రెస్‌ బెంగళూరు, ఢిల్లీ చుట్టూ తిరుగుతుంద న్నారు. మత కల్లోహాలు సృష్టించయినా పదవుల్లోకి రావాలనే ఆకాంక్ష కాంగ్రెస్‌ది అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 57శాతం ఎంబీబీఎస్‌ సీట్లు ప్రారంభమైతే ఒక్క తెలంగాణలోనే 43శాతం ప్రారంభమయ్యాయని తెలిపారు. తెలంగాణ రాకముందు 250 సీట్లు ఉంటే నేడు ఏటా పదివేల మంది వైద్య విద్యార్థులను తయారు చేస్తున్నామన్నారు.
శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు హైద రాబాద్‌ నుంచి ఖమ్మం మెడికల్‌ కళాశాలలో క్లాస్‌ల ను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని తెలిపారు. వచ్చే వర్షాకాలం నాటికి సీతారామ పూర్తి చేసి పాలేరు నుంచి గోదావరి జలాలు అందిస్తామని, ఇక ఖమ్మం డిక్షనరీలో కరువు అనే పదం లేకుండా చేస్తామన్నా రు. ఆర్టీసీ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపడంతో కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారన్నారు.