నిరసనల బాట..బుజ్జగింపుల పాట

The path of protests..the song of appeasement– నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఇదీ..
– రంగంలోకి ట్రబుల్‌ షూటర్‌
– తగ్గేదేలే అంటున్న అసంతృప్త నేతలు
బివిఎన్‌ పద్మరాజు
‘మూడు నిరసనలు.. ఆరు బుజ్జగింపులు…’
ఇదీ ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ పరిస్థితి. సీటు దక్కని వారు, జాబితాలో తమ తమ నియోజకవర్గాల పేర్లు లేని వారు… ఆ పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. పార్టీ కోసం ఎన్నో ఏండ్లుగా పని చేస్తూ జనంలో ఉన్న నేతలు, సామాజిక పొందికల రీత్యా బలమైన ఓటు బ్యాంకును కలిగున్నామని భావిస్తున్న యువ నాయకులు సైతం ప్రస్తుతమున్న అభ్యర్థులను మార్చి తమకే టిక్కెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. కానీ సీఎం కేసీఆర్‌ వారి మొరను ఆలకించటం లేదు. గోస చెప్పుకుందామంటే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అందుబాటులో లేరు. దీంతో ఆ నేతల్లో కొందరు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఊరూరా తిరుగుతూ తమకు టిక్కెట్‌ దక్కలేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారు. తమ ఆవేదనను, ఆక్రందనను వెళ్లగక్కుతున్నారు. వీరిలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి…తనకు సీటు దక్కనీయలేదంటూ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిపై తీవ్ర ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. ఆయన బీఆర్‌ఎస్‌ అధిష్టానంపై కోపంతో ఇటీవల అర్థనగ ప్రదర్శన చేసిన సంగతి విదితమే. పక్కనే ఉన్న స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి సీటు దక్కని సిట్టింగ్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. గులాబీ పార్టీపై గుస్సాతో రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్‌ గూటికి చేరుతారనే ప్రచారం ఊపందు కుంది. దీంతోపాటు సిరిసిల్ల, సిద్ధిపేటలో మత్స్యకా రులు, ముదిరాజ్‌లు కలిసి ఆందోళనలు కొనసాగి స్తున్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో అత్యధిక ఓటు బ్యాంకు కలిగి, బలమైన సామాజిక వర్గంగా ఉన్న తమకే టిక్కెట్‌ కేటాయించాలంటూ వారు పట్టుబడుతున్నారు. పటాన్‌చెరు నియోజక వర్గం లో ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన నీలం మధు కూడా కారు పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. అనేక ఏండ్లుగా బీఆర్‌ఎస్‌ అభివృద్ధి కోసం పని చేస్తూ, అనునిత్యం ప్రజల్లో ఉంటున్న తనను కాదని వేరే వారికి టిక్కెట్‌ కేటాయించటంపై ఆయన సీరియస్‌గా ఉన్నారని ఆ నియోజకవర్గ నేతలు చెబుతున్నారు. ప్రస్తుత అభ్యర్థిని మార్చి.. కచ్చితంగా టిక్కెట్‌ తనకే ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే పోటీలో ఉండి తీరతానంటూ ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని రామేశ్వరం బండ, గుమ్మడిదలతోపాటు అనేక గ్రామాల ప్రజలు తనకు మద్దతునిస్తున్నారంటూ మధు వివరించారు. జహీరాబాద్‌ టిక్కెట్‌ను ఆశించిన ఢిల్లీ వసంత్‌… బీఆర్‌ఎస్‌ అధిష్టానంపై తనదైన పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ‘మట్టి మనుషుల మనోగతం-భూమి పుత్రుల ఆకలి కేక’ అంటూ జహీరాబాద్‌లో చక్కెర కర్మాగారం అంశంపై వినూత్న రీతిలో కార్యక్రమం చేపట్టారు. దళిత బంధు కింద ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో కర్మాగారాన్ని కొనేద్దామంటూ ఆయన ప్రతిపాదిం చారు. లబ్దిదారులను షేర్‌ హోల్డర్లుగా మార్చాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు విన్నవించారు.
ఇలా రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ సీటు దక్కని ఆశావహులు తమదైన పద్ధతుల్లో ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. టిక్కెట్‌ దక్కిన నేతలకు వీరిని ప్రసన్నం చేసుకోవటం ఓ సవాలుగా మారింది. వీరి బుజ్జగింపులు పని చేయకపోవటంతో సీఎం కేసీఆర్‌…ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌రావుకు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే పటాన్‌చెరు, నర్సాపూర్‌, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, ఆలంపూర్‌, జనగాం తదితర ప్రాంతాల్లోని నేతలతో మంతనాలు జరిపారు. అక్కడి ‘రెబల్స్‌’ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీకి, సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్న నేతలను అసంతృప్తుల ఇండ్లకు పంపి, వేడిని చల్లార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వారు మాత్రం ‘తగ్గేదేలే’ అంటున్నట్టు సమాచారం. అధికార పార్టీ నుంచి సీటొస్తే ఓకే.. లేదంటే, ఏదో ఒక పార్టీ నుంచి, అదీ కుదరకపోతే స్వతంత్రులుగానైనా బరిలోకి దిగుతామంటూ హెచ్చరిస్తుండటం గమనార్హం.