మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌ బిల్లులివ్వాలి

మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌ బిల్లులివ్వాలి– విద్యా, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శులకు సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి ఈ కుబేరులో ఉన్న పెండింగ్‌ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) కోరింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ.రమ, ఉపాధ్యక్షులు వై.స్వప్న వినతిపత్రాలను అందజేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు 2023 నవంబర్‌ నుంచి కార్మికులకిచ్చే గౌరవ వేతనం, అల్పాహారం, బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి, వంట చేసి పెడుతున్న తీరును వివరించారు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయనీ, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని తెలిపారు. సుదీర్ఘకాలం పోరాటాల తర్వాత మధ్యాహ్న భోజన కార్మికులకు ఉన్న వేతనంపై రూ.2 వేలు పెంచారనీ, దాన్ని కూడా సక్రమంగా ఇవ్వడం లేదని వాపోయారు. బిల్లులను కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లోనే వేయాలని కోరారు. నిత్యావసర ధరలకు అనుగుణంగా పిల్లలకిచ్చే మెనూ చార్జీలను పెంచాలని విన్నవించారు. ప్రస్తుతం కేటాయిస్తున్న బడ్జెట్‌ పాత మెనూకే సరిపోవడం లేదనీ, ఇప్పుడు కొత్తగా అల్పాహారం పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. టిఫిన్‌ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. గుడ్లకు బడ్జెట్‌ అదనంగా కేటాయించాలనీ, లేకుంటే అంగవాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్టుగానే మధ్యాహ్న భోజన పథకానికి కూడా సరఫరా చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు అవసరమైన గ్యాస్‌ను సబ్సిడీకి ఇవ్వాలనీ, కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేల వేతనం, గుర్తింపు కార్డులివ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులకు కాటన్‌ బట్టల యూనిఫాం, ప్రమాదబీమా, పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలను కల్పించాలని డిమాండ్‌ చేశారు.