– వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
నవతెలంగాణ-జోగిపేట
అందోల్ ప్రజలు తనకు జీవితాన్ని ఇచ్చారని, వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా అందోలు-జోగిపేట మున్సిపల్ పరిధిలోని 17,18 వార్డుల్లో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలను అందిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పి.. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకం పెంపును అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. మిగతా నాలుగు గ్యారంటీల అమలు కోసం ప్రజల ముందుకు ప్రభుత్వాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ప్రజా పరిపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు తీసుకొని అర్హులకు న్యాయం అందిస్తామన్నారు. జోగిపేట పట్టణ అభివృద్ధికి తాను కృషి చేస్తానని, ఇండ్లులేని నిరుపేదలున్నారనీ, వారికి త్వరలో ఇండ్లు అందిస్తామని చెప్పారు. ఈనెల 6 వరకు నిర్వహించనున్న ప్రజా పాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిలో అర్హులైన వారిని ఎంపిక చేసి వారందరికీ సంక్షేమ ఫలాలను అందిస్తామన్నారు. కాగా, 17వ వార్డు కౌన్సిలర్ ఆకుల చిట్టిబాబు, 18వ వార్డు కౌన్సిలర్ యస్.సురేందర్‌గౌడ్ మంత్రి దామోదర్‌కు శాలువాలు, పుష్ప్రగుచ్చాలను అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) మాధురి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ట్రైబల్ వెల్ఫేర్ అఫీసర్ సిరంగీ, ఆర్‌డీవో పాండు, డీఎస్‌పీ రమేష్, మున్సిపల్ చైర్మెన్ మల్లయ్య, కమిషనర్ తిరుపతి, ఉప తహసీల్దార్ మధుకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎస్. కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.