ఏ దేశ ప్రజలు గొర్రెల్లా ఉంటారో

ఆ జాతిని చూసి జాలిపడు
ఏ గొర్రెల కాపరులు వారిని తప్పుదారి పట్టిస్తారో
ఆ దేశపు బూటకపు నాయకత్వాన్ని చూసి జాలిపడు

ఏ దేశ మేధావులు నోరు విప్పరో
ఏ సద్గుణ సంపన్నులు గాలి కబుర్లతో
గాలితో యుద్ధాలు చేస్తుంటరో
వారినందరినీ చూసి జాలిపడు
అవసరమైనప్పుడైనా గొంతెత్తలేని
జాతి జనుల చూసి జాలిపడు
దాడులు చేసే వారిని పొగడుతూ ఉండడం
హింసిస్తూ, ప్రపంచాన్ని బలవంతంగా
పాలించాలనుకునే ఆంబోతుల్ని – హీరోలనుకుని,
భజనలు చేస్తున్న భక్తుల్ని చూసి జాలిపడు –
తమ భాష తమదే తప్ప,
మరో భాష అర్థం చేసుకోలేని
అవివేకులను చూసి జాలిపడు

తమ సంస్కతీ సంప్రదాయాలు తమవే తప్ప,
ఇంకా వేరేవి కూడా ఉంటాయని
తెలుసుకోలేని మూర్ఖుల్ని చూసి జాలిపడు
డబ్బే ఊపిరిగా బతికే వారిని చూసి జాలిపడు
బాగా మెక్కి నిద్రిస్తున్న వారిని ఇంకా నిద్రబుచ్చుతున్న
కాపాలాదారుల కపటత్వాన్ని చూసి జాలిపడు
హక్కుల్ని, బాధ్యతల్ని గాలికొదిలేసే దేశప్రజల్నీ..
వారి దేశాన్నీ… చూసి జాలిపడు!

తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కొట్టుకుపోతున్నా,
మిన్నకుండే వానపాము
రమనస్తత్వాన్ని చూసి జాలిపడు.
స్వేచ్ఛాలోచనతో తలెత్తుకు సగర్వంగా బతికిన
ఓ నా ప్రియమైన దేశమా? నువ్విప్పుడు నిరంతరం
కన్నీళ్ళెందుకు కారుస్తున్నావ్‌?

ఖలీల్‌ జీబ్రాన్‌ భావానికి కవితా రూపం ఇచ్చింది:
అమెరికన్‌ కవి లారెన్స్‌ ఫెర్‌లిగెట్టి
తెలుగు అనువాదం : డాక్టర్‌ దేవరాజు మహారాజు