నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైనచోట సహాయ సహకారాలు అందించాలన్నారు. వర్షాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులకు సూచనలు చేస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.మట్టి మిద్దెలు, కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇండ్లలో ఎవరు నివాసం ఉండవదని సూచించారు. మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులకు తెలియజేస్తే అవసరమైతే తక్షణమే వసతి, సహకారం అందిస్తారని పేర్కొన్నారు.నాగార్జునసాగర్ ప్రాజెక్టు, మూసి ప్రాజెక్టుల గేట్లు తెరిచినందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలు, నది పరివాహక ప్రాంతాలలో నీటిలోకి ఎవరు వెళ్లొద్దని, పశువులను సైతం నీటిలోకి తీసుకెళ్లొద్దని పేర్కొన్నారు. ఈత కొట్టేందుకు యువత నదులు ప్రాజెక్టుల వద్ద నీటిలోకి దిగవద్దని,మత్స్యకారులు చేపలు పట్టేందుకు నీళ్లలోకి వెళ్ళవద్దని,పిల్లలు, పెద్దలు నీటి ప్రాంతాల వద్ద సెల్ఫీలు దిగేవారు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.వర్షం కారణంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల కు షార్ట్ సర్క్యూట్ వచ్చేందుకు అవకాశం ఉన్నందున వాటికి దగ్గరగా వెళ్లరాదని సూచించారు. ప్రమాదాలు జరగకుండా విద్యుత్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉన్న వాటిని గుర్తించి ముందే తొలగించాలని ఆదేశించారు.వర్షం, గాలుల కారణంగా ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపోయిన, స్తంభాలు ఒరిగిపోయిన తక్షణమే సరి చేయాలని సూచించారు. మున్సిపల్ అధికారులుఎక్కడైనా నీరు నిలువ ఉంటే తక్షణమే నీరు నిలువ లేకుండా చర్యలు తీసుకోవాలని,పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని సూచించారు.కల్వర్టులు, రోడ్లు పొంగిపొర్లుతున్నట్లయితే వాటిని దాటే సాహసం ఎవరు చేయొద్దని,ఆర్ అండ్ బి,పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు అలాంటి ప్రదేశాలలో తక్షణమే హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.వర్షం వల్ల రోడ్లపై చెట్లు విరిగిపడినట్లయితే తక్షణమే తొలగించాలని సూచించారు.నీటిపారుదల, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు వర్షాల కారణంగా చెరువులు, కుంటలు ఎక్కడైనా నిండి తెగిపోయేందుకు ఆస్కారం ఉన్నచోట తక్షణమే వాటిని గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.వర్షం వల్ల రైతులు పంటలు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సరైన సూచనలు, సలహాలు ఇవ్వాలని,వర్షాల కారణంగా సీజనల్ వ్యాధుల బారిన పడిన ప్రజలకు తక్షణ చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మందులు, మెడికల్ కిట్లు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైనచోట సహాయక చర్యలను చేపట్టాలని, జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు అందరూ జిల్లా యంత్రంగానికి అందుబాటులో ఉండాలని ఆదేశించారు.