– కాంగ్రెస్‌లోకి వివేక్ ఘర్‌వాపసీ
– బీజేపీకి ఏనుగు రాకేశ్‌రెడ్డి రాజీనామా
– విజయశాంతి, బాబూమోహన్, కొండా చూపూ హస్తం వైపే!
– బీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్
– తీవ్ర నైరాశ్యంలో కమలం పార్టీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సాధారణంగా ఎన్నికలవేళ ఏ పార్టీలోనైనా సందడి ఉంటుంది. నేతల కోలాహలం కనిపిస్తుంది. కానీ, బీజేపీలో మాత్రం చేజారుతున్న నేతలతో తీవ్ర నైరాశ్యం నెలకొంటున్నది. ”పోను..పోను..పార్టీ అసలే మారను..”అంటూనే నేతలు ఒక్కొక్కరుగా రాంరాం చెప్పేస్తున్నారు. హస్తం గూటికి క్యూ కడుతున్నారు. ‘మీకు ఎమ్మెల్యే…మాకు ఎంపీ సీటు అనేలా దోస్తానా చేస్తూ కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకోవడంలో బీజేపీ వెనుకడుగు వేసింది. బీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టే సత్తా ఆ పార్టీకి అసలే లేదనీ, తమ భ్రమలన్నీ తొలగిపోయాయ’ని బాంబు పేల్చి మరీ పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్ పెద్దల డీల్‌దండంతో వివేక్ వెంకటస్వామి ఘర్‌వాపసీ విజయవంతంగా పూర్తయింది.
మొన్న స్కీనింగ్ కమిటీ చైర్మెన్, నేడు మ్యానిఫెస్టో కమిటీ చైర్మెన్ పార్టీని వీడటంతో ఎటూపాలుపోని పరిస్థితిలోకి బీజేపీ వెళ్లిపోయింది. అదే బాటలో విజయశాంతి, బాబూమోహన్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ కూడా ఉన్నారనే చర్చ పువ్వు పార్టీని మరింత కలవరపాటుకు గురిచేస్తున్నది. వారి కోసం హస్తం, బీఆర్‌ఎస్ పార్టీలు పోటీపడుతున్నాయి. యువతకు బీజేపీలో అస్సలే ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ రాష్ట్ర నేత ఏనుగు రాకేశ్‌రెడ్డి ఆ పార్టీకి బైబై చెప్పేశారు. ఒకదానికి వెనుక ఒకటిగా జరుగుతున్న పరిణా మాలు ఆ పార్టీకి దెబ్బమీద దెబ్బ లాంటివే. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లో టికెట్లు దక్కని అతి కొద్ది మంది నేతలు తమ పార్టీలో చేరుతున్నారనీ సంబురపడాలో…కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నందుకు బాధపడలాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
కాంగ్రెస్ జాతీయ నాయకత్వం విసురుతున్న బౌన్సర్లకు తెలంగాణలో బీజేపీ కీలక వికెట్లు టపటపా పడిపోతున్నాయి. బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు తేరుకునేలోపే జరగరాని నష్టం జరిగిపోతున్నది. ఇటీవల రాజగోపాల్‌రెడ్డి..ఏనుగు రవీందర్‌రెడ్డి…కపిలవాయి దిలీప్‌కుమార్…రేవూరి ప్రకాశ్‌రెడ్డి.. ఎ.శ్రీనివాస్‌రెడ్డి..ఇలా కీలక నేతలను లాక్కున్న కాంగ్రెస్ మిగతా వారిపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే వివేక్ వెంకటస్వామి ఘర్‌వాపసీని విజయవంతంగా ముగించింది. ఇప్పుడు మిగతా నేతలపైనా దృష్టి పెట్టింది. వివేక్ వెంకటస్వామి బీజేపీని వీడటం ఆ పార్టీకి మీడియా పరంగానూ, ఆర్థిక పరంగానూ తీవ్ర నష్టం చేకూర్చినట్లేనని చర్చ నడుస్తున్నది. దీంతో ఈటలకు వ్యతిరేకంగా జట్టు కట్టిన అసంతృప్త నేతల్లో ఇప్పటికే ఆ పార్టీని ఐదుగురు సీనియర్లు వీడినట్టు అయింది. వీరంతా మూకుమ్మడిగా రెండు,మూడు కీలకాంశాలు చెప్పి పార్టీని వీడటం గమనార్హం. ఆరు నెలల కిందటి దాకా బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులూ పదేపదే బీఆర్‌ఎస్ అవినీతి చిట్టా తమ దగ్గర ఉందనీ, త్వరలోనే వారి పని ఖతం అనే స్థాయిలో మాట్లాడారు. దీంతో తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి కేసీఆర్‌తో విభేదించి బయటకు వచ్చిన వారంతా కాలక్రమంలో బీజేపీలో చేరి పోయారు. కానీ, కర్నాటక ఎన్నికల తర్వాత బీజేపీ వైఖరిలో దూకుడు తగ్గింది. మద్యం కుంభకోణం విషయంలో కవిత అరెస్టు కాబోతున్నది.. కాబోతు న్నది..అని పదేపదే ప్రచారం చేసినా అదీ జరగలేదు. కాళేశ్వరం అవినీతి అంశంపైనా విచారణ చేపట్ట లేదు. పైగా, బీఆర్‌ఎస్‌తో బీజేపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నదని అందుకే ఆ పార్టీలో దూకుడు తగ్గిందనే చర్చామొదలైంది. దీంతో బీజేపీ నాయకత్వంపై వలసనేతలకున్న భ్రమలు క్రమంగా తొలగిపోవడం ప్రారంభమైంది. బీజేపీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్ ఉండదనే నిర్ణయానికి వచ్చేశారు. దీంతో ఎలా వెళ్లిన నేతలు అలాగే ఒక్కొక్క రుగా బయటకు వచ్చేస్తున్నారు. ఈ జంపింగ్‌లు ఇంతటితోనే ఆగవనీ, వారం రోజుల్లో ఇవి మరింత తీవ్రమయ్యే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. పార్టీ నుంచి నాయకులు ఎందుకు వెళ్లిపోతున్నారు? ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? మీరేం చేస్తున్నారు? ఎన్నికల ముందు ఇదేం పరిస్థితి? అని రాష్ట్ర నాయకత్వంపై అమిత్‌షా, నడ్డా అక్షింతలు వేసినట్టు తెలిసింది.