ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి వినతిపత్రం అందజేత..

నవతెలంగాణ-వీణవంక
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 12 రోజులుగా సీఐటీయూ, ఏఐటీయూసీ, టీజీకేబీయూ, ఐఎఫ్ టీయూ సంఘాల సమక్ష్యంలో ఏర్పడిన ఐక్య తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జీపీ కార్మికులు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ముఖ్య కూడళ్లలో సోమవారం భిక్షాటన చేశారు. అలాగే మండలానికి వచ్చిన ఎమ్మెల్సీ, విప్ పాడి కౌశిక్ రెడ్డికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. పలువురు నాయకులు మాట్లాడుతూ గ్రామపంచాయతీ  కార్మికుల వేతనాల పెంపు, పర్మనెంట్ కోసం గత 12 రోజులుగా సమ్మె చేస్తున్నా తమను పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. ఉద్యోగ భద్రత లేకుండా, వేతనాలు రెండు మూడు నెలలు పెండింగ్ ఉంటున్నాయని, అధికారులు, ప్రజాప్రతినిధులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలిచి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు మహంకాళి కొమురయ్య, కండె సదయ్య, దసారపు వెంకటేష్, కిషన్ రావు, గోడిసేలా కొమురయ్య, దసారపు మల్లయ్య, శంకర్ వీరితోపాటు గ్రామాల కార్మికులు పాల్గొన్నారు.