హుస్నాబాద్‌ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానే..

హుస్నాబాద్‌ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానే..– మాటల మనిషి కావాలా.. చేతల మనిషి కావాలా : హరీశ్‌రావు
నవతెలంగాణ- హుస్నాబాద్‌ రూరల్‌
”ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్‌ ఓట్ల కోసం వస్తోంది.. కాంగ్రెస్‌ మాటలు నమ్మి ఓటేస్తే రైతులు మళ్లీ ఉరేసుకునే రోజులు వస్తాయి.. మాటల మనిషి కావాలా.. చేతల మనిషి కావాలా.. హుస్నాబాద్‌ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానే” అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సతీష్‌కుమార్‌కు మద్దతుగా మంత్రి హరీశ్‌రావు మాజీ మంత్రి పెద్దిరెడ్డితో కలిసి మంగళవారం రోడ్‌షో నిర్వహించారు. అంబేద్కర్‌ కూడలిలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఈ జన ప్రభంజనాన్ని చూస్తుంటే సతీషన్నకు భారీ మెజారిటీ ఖాయమన్నారు. నీతి నిజాయితీ, నిబద్దతతో పనిచేసే వ్యక్తి సతీషన్న అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ అవసరమైన నిధులు మంజూరు చేశారని తెలిపారు. రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించామన్నారు. దేవాదుల, మిడ్‌ మానేరు ద్వారా హుస్నాబాద్‌ గడ్డకు గోదావరి జలాలు వస్తున్నాయన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయిందన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌లో అభివృద్ధి చేస్తే అక్కడే గెలవాలని, అక్కడ ఏమీ చేయకనే హుస్నాబాద్‌కు వచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజల మనిషి నీతి నిజాయితీ గల సతీష్‌ను గెలిపించాలన్నారు. కెేసీఆర్‌కు లక్ష్మీ నియోజకవర్గంగా.. సెంటిమెంట్‌గా ఉన్న హుస్నాబాద్‌లో బీఆర్‌ఎస్‌ జెండా ఎగరాలన్నారు.
చుక్క నీరు లేక ఇబ్బంది పడ్డ హుస్నాబాద్‌ నేడు రెండు పంటల సాగుతో కలకలాడుతోందన్నారు. సాగు నీరుకు నోచుకుని హుస్నాబాద్‌కు మిడ్‌ మానేరు నీళ్లు తెచ్చుకున్నామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే అసైన్డ్‌ భూములను పట్టా భూములుగా మారుస్తామన్నారు. హుస్నాబాద్‌లో ఎల్లమ్మ చెరువును రూ.10 కోట్లతో పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు.