– టీబీజీకేఎస్ గెలుపు చాలా అవసరం
– కార్మికుల హక్కులు, ప్రయోజనాల కోసం సంస్థను నిద్రపోనివ్వం : గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో సింగరేణి సంస్థ పురోగమనానికి టీబీజీకేఎస్ గెలుపు చాలా అవసరమని ఆ సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సింగరేణి ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్ నాయకులు, ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికుల హక్కులు, ప్రయోజనాల సాధనకు సంస్థను నిద్రపోనివ్వబోమని అన్నారు. సింగరేణి అంటే సింహగర్జన అనీ, అదే స్ఫూర్తితో పనిచేస్తూ సంస్థను కాపాడుకోవాల్సిన అవసరముందని చెప్పారు. రాష్ట్ర సాధనలో బొగ్గు గని కార్మికులు ప్రధాన భూమిక పోషించారని అన్నారు. సింగరేణి కార్మికులకు ఉన్న పోరాట స్ఫూర్తి జాతీయ సంఘాలకు లేదని స్పష్టం చేశారు. గనుల్లో కార్మికులు చేస్తున్న కష్టం, చిందిస్తున్న చెమట తెలంగాణలో వెలుగులు నింపుతోందన్నారు. అధికారం ఉన్నా, లేకున్నా సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తామనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. ఎన్నికల్లో ఒక్కొక్కరూ ఒక్కో కేసీఆర్‌లా పనిచేయాలని పిలుపునిచ్చారు. మ్యానిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసి అతిత్వరలో విడుదల చేస్తామని అన్నారు. ఐఎన్‌టీ యూసీ, ఏఐటీయూసీ వంటి జాతీయ సంఘాలు సింగరేణి హక్కులను ఏనాడూ కాపాడలేదని ఆరోపించారు. టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉండగా ఒక్క సమ్మె కూడా చేసే అవసరం లేకుండా అన్ని పనులనూ సాధించామని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రాధాన్యతల్లో సింగరేణి కార్మికుల్లేరని చెప్పారు. తమకు పోరాటాలు కొత్త కాదనీ, కార్మికుల హక్కులను సాధించే వరకు విశ్రమించబోమని అన్నారు. సింగరేణిలో దాదాపు 40 వేల ఉద్యోగులుంటే, వారిలో 21 వేల వరకు యువకులే ఉన్నారని వివరించారు. అన్ని కమిటీల్లోనూ యువతకు సరైన ప్రాధాన్యత ఇస్తామనీ, మహిళలకూ అవకాశాలను కల్పిస్తామని చెప్పారు. డిపెండెంట్ ఉద్యోగాల కోసం బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ తీవ్రంగా కృషి చేశారని గుర్తు చేశారు. కార్మికులు ఆర్థికంగా ఎదిగేలా చేయడమే కాకుండా ఆత్మగౌ రవం ఇవ్వాలన్న ఆలోచనతో అనేక కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు.